ఉద్యోగులకు, ప్రజలకు మధ్య ఇంత అంతరం ఎందుకు?


కెసిఆర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచారు. దీనివలన ఉద్యోగులలో అవినీతి తగ్గుతుందని, మెరుగైన సేవలు అందుతాయని ప్రజలను మభ్యపెట్టారు. కొన్ని రోజులపాటు ఆ రకమైన వార్తాకథనాలను వెలువరించారు. కాని, దానికి విరుద్ధంగా వాస్తవాలు ఉన్నాయి. ఉద్యోగులలో అవినీతి విపరీతంగా పెరిగింది. అప్పటివరకు చిన్న ధ్రువ పత్రాలకు 100, 200 రూపాయల లంచాలు తీసుకున్నవారు, వేతనాలు పెరిగిన తరువాత 500/1000 డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. 

అంతేకాక అప్పటివరకే ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు మధ్య ఉన్న అంతరం విపరీతంగా పెరిగిపోయింది. ఉద్యోగులు, తమను ప్రజలలో ఒకరుగా గాక, వారికన్నా ఉన్నత స్థాయి వారిగా భావిస్తున్నారు. సామాన్యులు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా, అక్కడి ఉద్యోగులు వారికి ఇచ్చే గౌరవం గురించి, అందరికి తెలిసిన విషయమే. మధ్యతరగతి వారు తాము భరించలేకున్నా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించకపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఈ విషయమై ఇప్పటికే ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మరోమారు మధ్యంతర భృతి ఇవ్వనుంది. దీనితో ఈ అంతరాలు ఇంకెంత పెరగనున్నాయో, అవినీతి ఏ స్థాయికి చేరనుందో? 

ఇక ఇవాళ ఉత్తమ ఉద్యోగినిగా తెలంగాణ ప్రభుత్వ అవార్డు పొందిన తహసీల్దారు ఇంట్లో గుట్టలు,గుట్టలుగా నోట్ల కట్టలు దొరికాయి. ఆవిడ ఇంట్లో సోదాలు మొదలు పెట్టిన మూడు గంటలలోనే 93.50 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, కోట్ల విలువైన విలువైన ఆస్తి పత్రాలు లభించాయి. పూర్తి స్థాయి దర్యాప్తులో ఇంకెన్ని లభిస్తాయో? అసలు ఇలాంటి వారికి ఉత్తమ ఉద్యోగిని అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వం ఏమన్నా బాధ్యత తీసుకుంటుందా? ఆమెను సిఫారసు చేసిన ఉద్యోగ సంఘంపై చర్యలుంటాయా? ఈ ఎంపిక విధానాలను పూర్తిగా  సంస్కరించే దమ్మూ, ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా ?     

ఉత్తమ ఉద్యోగుల ఎంపిక మొత్తం ఉద్యోగ సంఘాల కనుసన్నలలోనే జరుగుతుంది. వారు సూచించిన వారికే ఈ ఉత్తమ ఉద్యోగ అవార్డులు లభిస్తున్నాయి. చదువు చెప్పటం కూడా సరిగ్గా చేతకాని అధ్యాపకులకు, సేవలు సరిగ్గా అందించని ఉద్యోగులకు కూడా ఇవి లభిస్తున్నాయి. వారు ఉద్యోగసంఘాలతో సన్నిహితంగా ఉండడమే ప్రధాన అర్హతగా మారింది. రిటైర్మెంట్‌కు చేరువై కనీసం ఒకసారైనా అవార్డు పొందకపోవడం కూడా మరో ప్రధాన అర్హత. అంటే ఈ ఉత్తమ ఉద్యోగుల ఎంపికలో సేవలు పొందే ప్రజల పాత్రగానీ, పాఠాలు వినే విద్యార్థుల పాత్రగానీ ఏమాత్రం ఉండదు.  

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరుగున్న స్థాయిలో, వారి సేవలలో నాణ్యత శాతం మెరుగుపడుతుందా? పంటలకు మద్దతు ధర పెంపు విషయంలో కూడా ఇదే విధానాన్ని పాంటించవచ్చు కదా! వృద్ధులకు, ఇతరులకు ఇచ్చే పెన్షన్లలో కనీస వేతనాన్ని గాని, ధరల విధానాన్ని గాని ఎందుకు అమలుచేయరు. ఇక విద్యుత్ ఉద్యోగుల వేతనాలు ఇప్పటికే అధికంగా ఉన్నాయి మరియు పంపిణీ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. సంస్థ ఉద్యోగుల అవినీతి గురించి మాట్లాడనవసరం లేదు. ఏటా వారికి వేతనాలు పెంచుతూ, ప్రజలపై విద్యుత్ భారాన్ని, సంస్థలపై నష్టాన్ని మోపుతున్నారు. ఏ సబ్-స్టేషన్‌ను అయినా ప్రయివేటు సంస్థకు అప్పగిస్తే ఇప్పుడు అవుతున్న ఖర్చులో సగంకన్నా తక్కువతోనే నడపవచ్చు. ఈ అనవసర భారాల్ని, అవినీతిని ప్రజలెందుకు మోయాలి?  

ఇప్పుడు కెసిఆర్ అవినీతి నిర్మూలన 2.0 

అవినీతిపై తొలి దఫా విధానాలు ఘోరంగా విఫలమైన ఈ సమయంలో, లంచాలు ఇచ్చే అవసరం లేకుండా కొత్త రెవెన్యూ, పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్టాలు తెస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రకటించారు. ఇవన్నా ఎమన్నా ఫలితాలనిస్తాయో, కొండనాలికకు మందేస్తే చందంగా ఉంటాయో వేచి చూడాలి. 

ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య భీమా, ఇఎస్ఐ మూడింటినీ కలిపి, రాష్ట్రప్రజలందరికీ ఒకే రకమైన ఆరోగ్య భీమాను అమలుపరచే ఆలోచనలు కెసిఆర్ గారు, చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇలా ప్రజలకు, ఉద్యోగులకు ఒకే తరహా సేవలు అందించే పథకం దిశగా చర్యలు చేపట్టడం అభినందనీయం. ఇలాంటి పథకం కార్యరూపంలోకి రావడం అనుమానమే, కాని వస్తే అది సంచలనమే. 

3/Post a Comment/Comments

  1. udyogulanu target chesaaru. privatisation valla vyavasthalu naashanamavutaayi.

    ReplyDelete
    Replies
    1. టెలిఫోన్ ప్రయివేటైజేషన్ తో నాశనమైంది BSNL ఒక్కటే, ప్రజలు, సేవలు బాగుపడ్డారు.

      Delete
  2. OYT scheme క్రింద అక్షరలా ముఫ్ఫ్రైవేలు కట్టి ఐదారేళ్ళు వేచి ఉండేవాళ్ళం అప్పటి రోజుల్లో . పదేళ్ళకూ ఫోను కనెక్షన్ దొరకని వాళ్ళూ అనేకులు.

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post