Telugu News

తాజా వార్తలు

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన అనంతరం, మూల్యాంకనంలో పెద్ద ఎత్తున పొరపాట్లు జరిగాయని వార్తలు వచ్చాయి. అయితే కొందరు కావాలనే తమపై ఈ తరహా దుష్ప్రచారాన్ని చేశారని ప్రభుత్వం భావిస్తుంది. 

ఇంటర్‌లో ఫెయిల్ అయిన, రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న 3.82 లక్షల మంది విద్యార్థులలో కేవలం 1183 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని బోర్డు వెల్లడించింది. వీరిలో కూడా ఎక్కువమంది 3,4 మార్కుల తేడాతో ఫెయిల్ కావడంతో, మానవతా దృక్పథంతోనే పాస్ అయ్యారని, భారీగా మార్కులు తేడా రావడం అనేది కేవలం 10 సందర్భాలలోనే జరిగిందని, అవి కూడా సాంకేతిక కారణాల వల్లే జరిగాయని వారి వాదనగా ఉంది. ఇవే కారణాలపై హైకోర్టులో కొంతమంది దాఖలు చేసిన పిటీషన్లను కోర్టు కొట్టివేసింది. 

మూల్యాంకనంలో జరిగిన, ఆ కొన్ని పొరపాట్లకు కూడా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. మళ్ళీ ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా కూడా చర్యలు చేపట్టనుంది. లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని, రీ-వెరిఫికేషన్ తరువాత కూడా లక్షలాది మంది పాస్ అయ్యారని వదంతులు ఎక్కడ నుండి వ్యాప్తి చెందాయో కూడా విచారణ జరపాలని యోచిస్తోంది. 23 మంది మృతి చెందారన్న వార్తలపై కూడా స్పందిస్తూ, ఆ స్థాయి విద్యలో విపరీతమైన ఒత్తిడి నెలకొందని, దానిని తగ్గించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, ఇంటర్ బోర్డును ఉంచాలా? రద్దు చేయాలా అనే విషయాలపై కూడా కమిటీని వేయనున్నారు.                            

తెలంగాణలో నాలుగు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతన సచివాలయం, వంద కోట్ల రూపాయల వ్యయంతో నూతన సభా భవనాలను నిర్మించనున్నారు. వీటిలో సచివాలయాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే నిర్మిస్తుండగా, అసెంబ్లీని ఎర్రమంజిల్‌లో నిర్మించనున్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కెసిఆర్ గారు విలేఖరులకు వెల్లడించారు.  

పాత సచివాలయంలోని అన్ని భవనాలను కూల్చి కొత్తగా నిర్మించాలా?  లేక పాతవాటిని వాడుకుంటూ నిర్మాణం జరపాలా? అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. సభా భవనాలను పార్లమెంట్ తరహాలో మూడు హాల్‌లు వచ్చే విధంగా నిర్మించనున్నారు. ఈ నెల 27న సచివాలయ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.     

కెసిఆర్ గారు ఈ వివరాలు వెల్లడించిన వెంటనే , కొత్త సచివాలయం నిర్మాణానికి వాస్తు దోషమే కారణమని ప్రతిపక్ష నేతలైన రేవంత్ రెడ్డి, లక్ష్మణ్‌లు విమర్శించారు. చాలాకాలంగా ఈ తరహా వార్తలు ప్రజలలో వినబడుతున్నాయి. కెసిఆర్ గారికి ఉన్న నమ్మకాలు మరియు విశ్వాసాల దృష్ట్యా ఇవి నిజమని నమ్మేవారి సంఖ్య కూడా ఎక్కువే. వాస్తు వంటి వ్యక్తిగత విశ్వాసాల కోసం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని సోషల్ మీడియాలో కూడా ప్రచారం సాగుతోంది.  

వాస్తు దోషాల వల్ల కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారా? లేక  రాష్ట్రానికి మరిన్ని సదుపాయాలు కలిగిన ఆధునిక సచివాలయం అవసరమై  నిర్మిస్తున్నారా? అనే విషయంపై వివరణ, ఇప్పటివరకు కెసిఆర్ నుండి గాని, ప్రభుత్వం నుండి గాని వెలువడలేదు. అంతగా ప్రాముఖ్యత లేని విషయాలపై వదంతులను విస్మరించవచ్చు. కాని, ఇంత భారీగా ప్రచారంలోకి వచ్చిన వార్తపై వివరణ ఇవ్వకపోతే, వాస్తుకోసమే కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నాడని భావించేవాళ్లు తమ నమ్మకాన్ని దృఢపరుచుకుంటారు. ఆధునిక సచివాలయం కోసమే అని భావించే వాళ్ళు ఆయనది అహంకారమనుకుంటారు. 

కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానంపై అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఆ విధానం వలన లాభనష్టాలను పక్కన పెడితే, దీనిపై టిఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి మాత్రం  గందరగోళంగానే ఉంది.  

గత సంవత్సరం కేంద్రంతో జమిలి ఎన్నికలపై అనుకూల వైఖరిని వ్యక్తం చేసి, అసెంబ్లీని ముందుగానే రద్ధు చేసి రెండు ఎన్నికలు, ఒకేసారి జరగకుండా వ్యవహరించింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఏ ప్రాతిపదికన అనుకూలత వ్యక్తం చేస్తున్నారో స్పష్టం చేయలేదు. 

ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలలో జాతీయ సమస్యలు, విధానాలు, రాష్ట్రాల ఎన్నికలలో స్థానిక సమస్యలు, జనాకర్షక పథకాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరగడం వలన జాతీయ పార్టీలు బలపడి, ప్రాంతీయ పార్టీలు బలహీనపడే అవకాశముంది. ఈ విధానాన్ని దేశంలోని మెజారిటీ ప్రాంతీయ పార్టీలు ఎందుకు సమర్థిస్తున్నాయో అర్థం చేసుకోవడం కష్టమే.    

తెలంగాణ రాష్ట్ర సమితి, రాష్ట్రంలో బిజెపిని ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సన్నాహాలపై జరిగిన విలేఖరుల సమావేశంలో కూడా ఆయన అదే ధోరణిని ప్రదర్శించారు. 

రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కన్నా, బిజెపియే బలమైన శత్రువుగా కనిపించడం మొదలైంది. దీనికి కాంగ్రెస్ అసమర్ధతతో పాటు టిఆర్ఎస్ అనుసరించిన విధానాలు కూడా కారణమే. రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఫిరాయింపులు ప్రోత్సహించడం ద్వారా బలహీనపర్చమే కాక, ప్రజలలో కొంత వ్యతిరేకతను తెచ్చుకున్నారు. దీని వలన రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. బిజెపి ఆ శూన్యతను భర్తీ చేసే దిశగా బలపడుతోంది. బిజెపి అతివాద, హిందుత్వ విధానాలు, ఎంఐఎం తో టిఆర్ఎస్‌కు ఉన్న దోస్తీ కూడా దీనికి దోహదపడ్డాయి.  

గత అయిదేళ్లుగా టిఆర్ఎస్ నేతలు, కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి సహకరించట్లేదని గాని, నిధులు కేటాయించడం లేదనిగాని, బిజెపి పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యతనిస్తుందని గాని, విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చడంలేదని గాని పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. పైగా నోట్ల రద్ధు, జిఎస్టి లాంటి విషయాలలో మరియు రాష్ట్రపతి ఎన్నికలలో సహకరించారు కూడా. అందుకే  బిజెపితో అప్రకటిత మైత్రి కొనసాగిస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అప్పట్లో బిజెపిని విమర్శిస్తే కాంగ్రెస్ బలపడుతుందేమోనన్న అనుమానంతో వారు అలా వ్యవహరించినట్లు తెలుస్తుంది.   

ఎంపీలతో జరిగిన సమావేశంలో కెసిఆర్ గారు, ఢిల్లీలో మనకు మిత్రులూ లేరు.. శత్రువులూ లేరు... అంటూనే, గత ఐదేళ్లుగా కేంద్రం అన్యాయమే చేసిందని, రాష్ట్రానికి పన్నుల వాటా నిధులు తప్ప అదనంగా ఒక్క రూపాయి రాలేదని అన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైలు బోగీల కర్మాగారం లాంటి విభజన హామీలు నెరవేర్చలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇవ్వలేదని, మిషన్‌ భగీరథ, కాకతీయ లాంటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చలేదని... ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదనే భావన వచ్చే విమర్శలెన్నో చేశారు. ఎంపీలు, విషయ పరిజ్ఞానం పెంచుకుని, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సన్నాహాలపై జరిగిన విలేఖరుల సమావేశంలో కూడా ప్రధానంగా కేంద్రం రాష్ట్ర ప్రాజెక్టులకు సహకరించడం లేదని, నిధులు ఇవ్వడం లేదని విమర్శలు చేశారు. 

రాష్ట్ర అభివృద్ధికి బిజెపి సహకరించడం లేదని, తాము మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలమనే భావనలను ప్రజలలో కలిగించడం ద్వారా కెసిఆర్ గారు ఆ పార్టీని ఎదుర్కోదలచుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో భవిష్యత్ ఎన్నికలను ఆయన, రాష్ట్ర ప్రయోజనాలకు, అతివాద జాతీయ భావానికి మధ్య పోరాటంగా చూపించే ప్రయత్నం చేయనున్నారు. 

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ మెట్రోపై రెండు రకాల పరస్పర విరుద్ధమైన వార్తలు వస్తున్నాయి.
 • మెట్రోలో ప్రయాణికుల సంఖ్య ఒక రోజుకి, దాదాపు మూడు లక్షలకు చేరిందని, రద్ధీ సమయాల్లో కాలు మోపే స్థలం ఉండటంలేదని, కెటిఆర్ గారు ఈ రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచమని కోరినట్లు కొన్ని పత్రికలలో వార్తలు వచ్చాయి. 
 • మరికొన్ని పత్రికలు, 2019లో ప్రయాణికుల సంఖ్య రోజుకు 17 లక్షలుగా ఉంటుందని అంచనా వేయగా, ఇప్పుడు కేవలం మూడు లక్షల పరిధిలోనే ఉందని, నిర్మాణ సంస్థ భారీగా నష్టపోతుందని, మెట్రో విఫలం చెందిందని ప్రకటించాయి.  
స్థూలంగా చూస్తే వాటి, వాటి దృష్టికోణాల నుండి రెండురకాల వార్తలు సరియైనవే. కాని, మెట్రో సఫలమైందా?,  విఫలమైందా? అని నిర్ధారించడానికి లక్ష్యాలలో నిర్దేశించుకున్న ప్రయాణికుల సంఖ్య ఒక్కటే ఆధారం కాదు. ముందు వేసుకున్న అంచనాల ప్రకారం, 2014 కల్లా మెట్రో నిర్మాణం పూర్తయి, 3 లైన్లలో తుదికంటా పరుగులు పెట్టాలి. ఇప్పటికి అలా పూర్తవలేదు. ఆ సమయానికే అన్ని లైన్లు పూర్తయి ఉండి, అప్పటి చార్జీలే అమలయి ఉంటే ప్రయాణికుల సంఖ్య అంచనాలకు చేరుకునేది. కాని, ఇప్పటికీ  అన్ని లైన్లు అందుబాటులోకి రాలేదు.

నిర్మాణ సంస్థ నష్టపోతుందనే వాదన విషయానికి వస్తే ప్రతిపాదిత చార్జీల ప్రకారం గరిష్ట టికెట్ 19 రూపాయలు మాత్రమే ఉండాలి. ప్రస్తుతం గరిష్ట టికెట్ 60 రూపాయలుగా ఉంది. అంటే అంచనాలో మూడో వంతు ప్రయాణికులు ఉన్నా సరిపోతుంది. మూడు లైన్లు పూర్తిగా అందుబాటులోకి వస్తే అంచనాలో సగాన్ని తేలికగా అందుకునే అవకాశముంది. పైగా ఇది దీర్ఘకాలిక ప్రాజెక్టు. స్వల్పకాలంలో ఇలాంటి ఒడిదుడుకులను తట్టుకునే సత్తా ఎల్&టి లాంటి సంస్థకు ఉంది. అంతేకాక, ఆదాయంలో సగం మాత్రమే ప్రయాణికుల టికెట్ల నుండి సమకూరుతుంది. మిగతా సగం ఆ సంస్థకు నగరంలోని కీలక ప్రాంతాలలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను వ్యాపారానికి ఉపయోగించుకోవడం ద్వారా సమకూర్చుకుంటుంది. కాబట్టి హైదరాబాద్ మెట్రో విఫలం చెందిందని భావించడం సరికాదు.     

 మెట్రో లైన్ల ప్రస్తుత స్థితి 
 • మియాపూర్- ఎల్బీనగర్ లైన్ పూర్తి అయింది. 
 • నాగోల్ -హైటెక్ సిటీ - గచ్చిబౌలి లైన్లో ఇంకా రివర్సల్ పూర్తి కాకపోటంతో, ఏడున్నర నిమిషాలకు ఒక రైలు మాత్రమే తిరగగలుగుతుంది. దాంతో ఈ మార్గం అమీర్ పేట్ వరకు రద్ధీగా కనిపిస్తుంది. మరో ఒకటి, రెండు నెలల్లో ఇక్కడ రివర్సల్ పూర్తయి మొత్తం లైన్ అందుబాటులోకి రానుండడంతో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరగనుంది. 
 • మూడవ లైన్ (జెబిఎస్ -ఫలక్ నుమా) ప్రజల కోసం ఇంకా తెరవబడలేదు. పాక్షికంగా (జెబిఎస్ - ఎంజిబిఎస్) మొదలుపెట్టడానికి మరో అయిదారు నెలల సమయం పట్టవచ్చు. 

శాసనసభలో చర్చ సందర్భంగా వైసిపి సభ్యులు, చంద్రబాబు గారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి గారు కూడా దీనిలో పాలుపంచుకోవడం విశేషం. 

జగన్ గారు మాట్లాడుతూ 'రాజకీయాల్లో  40 ఏళ్ల అనుభవం ఉంది అని చెప్పే వాళ్ళలా,  2029లో ఏదో చేస్తాం.. 2050లో ఏదో సాధిస్తామని నేను చెప్పను. మేమేం చేయగలమో అది ఇప్పుడే చేసేస్తున్నాం.' అంటూ చంద్రబాబు గారు మాట్లాడే  మాటలను అనుకరిస్తూ ఎద్దేవా చేశారు.  

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ '29 సార్లా.. 39 సార్లా.. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లామన్నది కాదు. ఏం సాధించామన్నదే ముఖ్యం' అని అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు ఆయన జోక్యం చేసుకుంటూ 'చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా శాలువాలు, వీణలు, లడ్డూలు, ప్రసాదాలిచ్చారు. మీరు ఇక్కడనుంచి పట్టుకెళ్లి కప్పిన శాలువాలు దాచుకోవడానికి అక్కడి బీరువాలు సరిపోలేదని' వ్యంగ్యంగా అన్నారు.

ప్రత్యేక హోదా కోసం తాము కృషి చేశామన్న చంద్రబాబు మాటలకు స్పందిస్తూ 'కుట్ర, దగా, మోసం చేసే వాళ్లకు డాక్టరేట్లు ఇచ్చే విశ్వవిద్యాలయం ఏదైనా ఉంటే అది చంద్రబాబుకే ఇస్తుందని'  కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు.

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీని పిలవకపోవడంపై విలేఖరి అడిగిన ప్రశ్నకు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రతిదానికి ప్రధానిని పిలవాలా? సంతృప్తిగా నేను ప్రారంభోత్సవం చేస్తున్నా మీకు ఇష్టంలేదా?, కేంద్రం నుండి  ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా రాలేదు అన్నారు. 

మరి ప్రాజెక్ట్ అనుమతులను కేంద్రమే ఇచ్చింది కదా!, అని అడిగిన ప్రశ్నకు అనుమతులను తెచ్చుకోవడం తమకు ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అనుమతి ఇచ్చే శాఖలు, సంస్థలు చట్టప్రకారం పనిచేస్తాయని తెలిపారు.     

మరి అప్పట్లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి పిలిచారు కదా!, అని మరో విలేఖరి అడుగగా, మిషన్ భగీరథ మరియు కాకతీయ ప్రాజెక్టులకు 24 వేల కోట్ల రూపాయలను ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసింది. అప్పుడు మోడీని పిలిచినా కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్రం నుండి రాష్ట్రానికి హక్కుగా రావలసినవి తప్ప జాతీయ ప్రాజెక్టు గాని, అదనంగా నిధులు గాని రాలేదు. అని సమాధానమిచ్చారు. 

మోడీతో గత పాలనాకాలంలో ఉన్నట్లుగా సత్సంబంధాలు లేవా?, అనే ప్రశ్నకు అప్పుడు మోడీ ప్రధాని అయిన సందర్భంలో అతి కఠినంగా నిందించిన వ్యక్తిని నేను. ఏడు మండలాలు, సీలేరు పవర్‌ ప్లాంటు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినప్పుడు ఫాసిస్టు పిఎం అని అన్నాను. అని సమాధానమిచ్చారు. మరి రాష్ట్రపతి ఎన్నికలలో సహకరించారు కదా అని అడుగగా, కేంద్ర ప్రభుత్వానికి మేం అంశాల వారీగా మద్దతు ఇచ్చాం. మాకు నచ్చిన వాటికి మద్దతిచ్చాం, నచ్చని వాటిని వ్యతిరేకించాం. ప్రత్యేకించి మిత్రత్వమో, శత్రుత్వమో లేదు. అంటూ ముక్తాయించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశల వారీ మద్య నిషేధం వైపుగా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా మద్యం వినియోగాన్ని తగ్గించే దిశగా కొన్ని చర్యలు తీసుకోనుంది. మూడు నెలల అనంతరం రాష్ట్రంలో అమలు కానున్న కొత్త అబ్కారీ విధానంలో ఉన్న నిబంధనలు దీనికి దోహదం చేయనున్నాయి. 

కొత్త విధానంలో లైసెన్స్ ఫీజును పెంచడమే కాకుండా, మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న పర్మిట్‌ రూంలను ఎత్తివేయనున్నారు. నగరాలలో మద్యం దుకాణాలలో జరిగే అమ్మకాలలో 30% పర్మిట్ రూంల ద్వారానే జరుగుతుంది. ఈ నిర్ణయాల ప్రభావం పట్టణాలలో తక్కువగా, నగరాలు, మహా నగరాలలో ఎక్కువగా ఉండనుంది. ప్రభుత్వం ధైర్యంగా ఈ రెండు నిర్ణయాలను తీసుకోగలిగితే కొంతమంది దుకాణ దారులు, లైసెన్స్ రెన్యువల్‌కు ముందుకు రారని, దానితో దుకాణాల సంఖ్య కూడా తగ్గుతుందని విశ్లేషణ ఉంది.  

పర్మిట్‌రూం అంటే మద్యం దుకాణాల వద్దే తాగడానికి అవకాశం ఉండే గది. వీటివలన దుకాణాల వద్ద భారీ రద్దీ కన్పిస్తోంది. ముఖ్యంగా జనావాస ప్రాంతాల్లో ఎక్కువమంది గుమికూడడం వలన సామాజిక, శాంతిభద్రతల సమస్యలు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వీటిని నిషేధించాలని డిమాండ్లున్నాయి. ఈ నేపథ్యంలో పర్మిట్ రూంలు ఎత్తివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

బిజెపిలో చేరుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఒక ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
 • తాను, టిడిపిని వీడతానని వస్తున్న వార్తలు అవాస్తవాలని, ఒకవేళ వెళ్లదలచుకుంటే ముందుగా ఆ విషయాన్ని చంద్రబాబుకే  చెబుతానన్నారు.  
 • వైసిపి అధినేత జగన్‌పై కేసులు పెట్టి, ఆయనను ఇబ్బంది పెట్టడం సరికాదని, తాను గతంలో కూడా ఇదే చెప్పానని అన్నారు. 
 • ఎన్డీఏ‌లో కొనసాగి ఉంటే మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేవారమని, 2014లో బీజేపీ, పవన్ కళ్యాణ్‌ల సహాయంతోనే తాము అధికారంలోకి వచ్చామని అన్నారు. వారిని వదులుకోవడం పొరపాటేనని అన్నారు. 
 • రాష్ట్రంలో పెద్దగా ఉనికి లేని కాంగ్రెస్ పార్టీతో అవగాహన కుదుర్చుకున్నామని, అదే సమయంలో పెద్దగా ఉనికి లేని బిజెపితో పోరాటం చేశామని, రెండూ కూడా తప్పులేనని అభిప్రాయపడ్డారు.       
 • బిజెపి, ఎపికి బాగానే చేసిందని, కేంద్రం నుంచి అనేకం తాను ఇతర ఎంపీలతో కలిసి సాధించానని సుజనా వెల్లడించారు
 • మోడీ మంత్రివర్గం నుండి వైదొలిగే విషయమై తాను చంద్రబాబునాయుడు గారిని వారించానని, ఆయన వినపోవడంతోనే మంత్రిపదవులకు రాజీనామా చేశామని చెప్పారు. రాష్ట్రంలో బిజెపిని దెబ్బతీశామని, అదే సమయంలో తాము కూడా దెబ్బతిన్నామని అన్నారు. 
 • 2014లో తాము అధికారంలోకి వచ్చిన తరువాత పాలనలో పొరపాట్లు చోటు చేసుకొన్నాయని, గుడ్ గవర్నెన్స్ ఇవ్వలేకపోయామన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు. 
 • ప్రత్యేక హోదా విషయంలో యు-టర్న్‌లు తీసుకోవడం కూడా తమకు నష్టం చేసిందని సుజనా అభిప్రాయపడ్డారు. 
 • 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు కోటరీలో తాను ఉండేవాడినని, కేంద్ర మంత్రిపదవి లభించిన తరువాత, ఢిల్లీకే పరిమితం కావటంతో ఆ తరువాత కోటరీలో లేనని అన్నారు.   
 • మనుషులకంటే, మిషన్లు చెప్పే మాటలనే చంద్రబాబునాయుడు గారు నమ్మారని, సర్వేల మీద ఆధారపడడం కూడా ఓటమికి కారణమయిందని అన్నారు. 
 • ఈవిఎమ్ లను అనుమానించడం సరికాదని, వీటిపై చంద్రబాబును కొందరు మిస్ లీడ్ చేశారని అన్నారు. 
 • మంగళగిరి నియోజకవర్గాన్ని పోటీ కోసం ఎంపికచేసుకోవడం లోకేష్ చేసిన తప్పు అని సుజనా చెప్పారు. ఈ నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉంటుందని, గత ఐదేళ్లలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడ బాగా పనిచేశారని అన్నారు. ఈ నియోజకవర్గం కాకుండా మరో నియోజకవర్గం నుండి లోకేష్ పోటీచేసి ఉంటే  బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. యువ నేత లోకేష్, ఓటమి నుంచి పాఠం నేర్చుకుని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు,  విజయవాడ వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సుముఖత వ్యక్తం చేయడంతో ఆయనపై ఇరు రాష్ట్రాలలో, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నిర్మించతలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును, కమిషన్ల కోసమే రీడిజైన్ చేసి కాళేశ్వరం నిర్మించారని, దీనికి ఎలా హాజరవుతారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు  ప్రశ్నిస్తున్నారు.  

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆంధ్రా సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారు దీక్ష చేశారు. ఆ సమయంలో ఆయన చేసిన ప్రసంగాల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. గోదావరి నదీజలాలలో ఇరు రాష్ట్రాల వాటాలు నిర్ణయం అయిన తరువాత మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టాలని వాటిలో ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు, అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రకమైన ఇబ్బందులను కలిగిస్తాయి. రాజకీయ నాయకులు అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా మాటలు, విధానాలు మార్చుకుంటారు.   

గోదావరి నదీజలాలలో ఇరు రాష్ట్రాల వాటా తేలకుండా, ఆంధ్రప్రదేశ్ పోలవరం నిర్మిస్తున్నప్పుడు, తెలంగాణ కూడా ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు కదా. ప్రతియేటా ఆ నదిలో మూడు వేలకు పైగా టిఎంసిలు సముద్రంలో కలుస్తున్నాయి. మహారాష్ట్ర నుండి వచ్చే వరదను ఆ రాష్ట్రం కొంత అడ్డుకోగలదేమోగాని, దిగువన ఒడిషా, ఛత్తీస్ ఘఢ్‌ల నుండే గోదావరిలో ఎక్కువ వరద ప్రవాహం ఉంటుంది. ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టులు పూర్తి చేసి వినియోగించిన తరువాత కూడా వేల టిఎంసిలు సముద్రంలో కలుస్తాయి.            

అధికారంలో ఉన్నప్పుడు తెలుగు దేశం ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నది లేదు, విమర్శించింది లేదు. ఇప్పుడు జగన్ గారు వెళ్లడాన్ని విమర్శించడంలో అర్థమేముంది?. ఆయన ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లనంత మాత్రాన ప్రాజెక్టు వినియోగం ఆగదు కదా. పైగా వెళ్లకపోతే, రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి వెళ్లడమే శ్రేయస్కరం. ఇది భవిష్యత్తులో రెండురాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్, తొమ్మిది, పదవ షెడ్యూలులోని సంస్థల విభజన లాంటి వివాదాల పరిష్కారానికి దోహదపడుతుందని ఆశిద్దాం. 

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget