నవరత్నాల్లో ఒకటైన అమ్మ ఒడి పథకంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేశారు. ముందుగా ఈ పథకాన్ని తెల్లరేషన్ కార్డు ఉండి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మాత్రమే వర్తింపచేయనున్నారు. రాష్ట్రంలో 44,417 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 37.29 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని ఆయన వివరించారు. వీరిలో దాదాపు అందరికీ తెల్ల రేషన్ కార్డులే ఉన్నట్లుగా అంచనా.
ముఖ్యమంత్రి గారు మొదట ప్రభుత్వ, ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నామని ప్రకటించారు. విద్యావేత్తలు, నిపుణుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేశారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆధార్‌తో అనుసంధానమై ఉండడంతో దాని ద్వారానే ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి 15వేల రూపాయలను అందజేయనున్నారు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే ఇది వర్తించనుంది.
ప్రస్తుతం కేవలం పేద కుటుంబాల పిల్లలే ప్రభుత్వరంగ పాఠశాలల్లో చదువుకుంటుండడం తో వారికి ఈ పథకం సహాయపడనుంది. వచ్చే సంవత్సరం జనవరి 26 నుండి ఈ పథకం అమలు చేయనుండడంతో ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి.
Post a Comment