రెండువైపులా వృధా! సమంజసమేనా?

జగన్ గారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన నవరత్నాలలో అమ్మ ఒడి పథకం ఒకటి.  దీని అమలులో భాగంగా పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి తల్లికి సంవత్సరానికి 15 వేల రూపాయలను అందిస్తామని తెలిపారు. ఆయన విజయం సాధించిన తరువాత, ఈ పథకాన్ని వచ్చే సంవత్సరం జనవరి మాసం నుండి అమలు చేయనున్నామని, రాష్ట్రంలో ఉన్న మొత్తం తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఇది వర్తిస్తుందని తెలియజేశారు.     

మానిఫెస్టోలో ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే పరిమితం చేస్తారని ఎక్కువమంది భావించారు. కాని, ఇప్పుడు ఆయన ఇది ప్రైవేటు పాఠశాలలలో చదివే విద్యార్థులకు కూడా వర్తిస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో 90% పైగా జనాభాకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే దాదాపు చదివే 90% విద్యార్థులు ఈ పథకానికి అర్హులవుతారు.  

అసలు ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణే అస్తవ్యస్తంగా ఉంది. వీటి నిర్వహణకు, ఉపాధ్యాయుల వేతనాల రూపంలో వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. కాని ఏ ప్రభుత్వ ఉద్యోగి, ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివించడం లేదు. జగన్ గారికి కూడా ప్రభుత్వ స్కూళ్ల మీద అసలు నమ్మకం లేకపోతే, అవ్వన్నీ మూసేస్తే వేలాది కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. అప్పుడు 15 వేల బదులు, 25 వేలు కూడా ఇవ్వొచ్చు. ప్రభుత్వానికి కూడా ప్రజలు పన్నుల ద్వారా చెల్లించిన డబ్బు ఆదా చేసినట్లు అవుతుంది.         

నిరుపేద విద్యార్థులు మాత్రమే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు కేవలం ఒక పూట మధ్యాహ్న భోజన పథకం కోసమే పిల్లలను స్కూలుకు పంపుతున్నారు. ముందు అటువంటి వ్యవస్థలో సౌకర్యాలను మెరుగుపరిచి, వారికి చదువుకునే పరిస్థితులు కల్పించాలి. మోడీగారు, మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం కూడా అందించనున్నామని ఈ మధ్యే ప్రకటించారు. మూడు పూటలా పెట్టినా బాగుంటుంది.     

ముఖ్యమంత్రి గారు పునరాలోచించి, అమ్మఒడి పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే పరిమితం చేయాలి. 15 వేల మొత్తాన్ని కూడా ఒకే విడతగా కాకుండా, నెలవారి కొంత మొత్తంగా చెల్లిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లను ప్రోత్సహించినట్లు కూడా అవుతుంది. కొంతమంది దీనిని ఫీజు-రీ ఇంబర్స్‌మెంట్ పథకంతో పోలుస్తున్నారు. కాని, ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కువ సీట్లు లేవు. కాబట్టి అది కార్పొరేట్ కళాశాలలకే మేలు చేసిందని  విమర్శలు ఉన్నా, కొంతవరకు ప్రయోజనకరమే. పాఠశాల విద్యా స్థాయిలో ప్రభుత్వానికి పూర్తిస్థాయి వ్యవస్థ ఉంది. అందువల్ల ఈ స్థాయిలో ప్రైవేటు విద్యాసంస్థలలో చదివే పిల్లలకు కూడా చెల్లింపులు చేయడం సమంజసం కాదు. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో నష్టపరిచే చర్య అవుతుంది. 

ప్రభుత్వ విద్యకు భారీగా ఖర్చుపెడుతూ, అమ్మ ఒడి ద్వారా ప్రైవేటు విద్యా సంస్థలకు లాభం చేయబూనడం ప్రజల డబ్బును రెండువైపులా వృధా చేయడమే అవుతుంది.  

0/Post a Comment/Comments

Previous Post Next Post