రాజగోపాల్ రెడ్డి 'జంపింగ్' సన్నాహాలు

నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గారు, బిజెపిలో చేరేందుకు అవసరమైన సన్నాహాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపినే అంటూ కలకలం రేపి, షోకాజ్ నోటీసులు అందుకున్న ఆయన త్వరలో 'చారిత్రాత్మక ప్రకటన' చేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఉత్తమ్, భట్టి, కుంతియాలపై మండిపడ్డారు. వారు తమ స్వలాభం కోసం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ను నాశనం చేశారని ఆయన ఆరోపించారు.

గత కొద్ది రోజులుగా రాజగోపాల్‌రెడ్డి గారు, తనతో పాటు బిజెపిలోకి రావాల్సిందిగా మరింత మంది కాంగ్రెస్ నేతలను ఒప్పించే ప్రయత్నం చేశారు. కాని, ఈ విషయంలో ఆయన పెద్దగా సఫలీకృతం కాలేదు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న జగ్గారెడ్డి గార్ల పేర్లు వినిపించినప్పటికీ, వారు ఈ వార్తలను ఖండించారు. ఇంతకీ ఆయన వెంట ముఖ్య నేతలెవరైనా వెళ్తున్నారా? ఇన్నాళ్లుగా కలసి ఉన్న సోదరులు పార్టీల పరంగా విడిపోనున్నారా? అనే విషయం ఆయన ప్రకటన సమయంలోనే తేలనుంది. మునుగోడు నియోజకవర్గానికి  చెందిన ముఖ్య నాయకులతో ఆయన గత రెండు రోజులుగా ఆయన భేటీ అయ్యారు. తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని, భాజపాలో కీలక పదవి వస్తుందని, క్యాడర్ మొత్తం తనతో కలసిరావాలని ఒప్పించినట్లు తెలుస్తుంది.   

రాజగోపాల్ రెడ్డి గారు బిజెపిలో ఎందుకు చేరుతున్నారు?
  • కాంగ్రెస్‌లో కొనసాగడం వల్ల రాజకీయంగా ఇక ఎదగలేమన్న అభిప్రాయంలో రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ ఏర్పాటు తరువాత వెంకటరెడ్డి గారు పిసిసి అధ్యక్ష్య పదవిని ఆశించారు. రాకపోవటంతో అప్పటినుండే సోదరులిద్దరూ పార్టీపై కినుక వహించారు. కొన్నాళ్ల కింద వీరు, టిఆర్ఎస్‌లో చేరతారని కూడా వార్తలు వచ్చాయి.
  • బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండడం, తెలంగాణలో బలపడే అవకాశాలు కనిపిస్తుండడంతో అక్కడ ఇంతకన్నా మెరుగైన అవకాశాలు లభిస్తాయని రాజగోపాల్ రెడ్డి గారు భావిస్తున్నారు. 
  • పారిశ్రామికవేత్త అయిన రాజగోపాల్ రెడ్డి గారి సంస్థలు ఉత్తరాది మరియు ఈశాన్య రాష్ట్రాలలో కీలక ప్రాజెక్టులలో నిమగ్నమై ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆయా రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉండడంతో, బిజెపిలో చేరితేనే ఆయనకు ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు.
 పార్లమెంట్‌లో ఆసక్తికర సన్నివేశం  

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో, బీజేపీ ఎంపీలు బల్లలు చరుస్తూ, వెల్‌కమ్ టు బిజెపి అని అరవడం కనిపించింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post