ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానాన్ని గురించి రాష్ట్రపతి ఎన్నికల ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించడం, కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎంత పట్టుదలతో ఉందో తెలియజేస్తుంది. గతవారం ఈ విధానంపై నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెస్‌తోపాటు టిడిపి, ఆమ్ ఆద్మీ, బిఎస్పి, డీఎంకే, టిఎంసి, ఆర్జేడీ సహా 16 పార్టీలు గైర్హాజరయ్యాయి. హాజరయిన పార్టీలలో వామపక్షాలు, ఎంఐఎం దీనిని వ్యతిరేకించగా, టిఆర్ఎస్‌తో సహా మిగిలిన పక్షాలన్నీ సమర్థించాయి. ప్రభుత్వం దీనిపై అధ్యయనానికి ఒక కమిటీని కూడా వేసింది.
ఈ సందర్భంగా ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానంతో కలిగే లాభ నష్టాలను ఒకసారి విశ్లేషించుకుందాం. ముందుగా ఈ విధానానికి అనుకూలంగా ఉన్న వాదనలు:
- దేశంలో ఎప్పుడూ ఎదో ఒక ఎన్నికలు జరుగుతుండడం వలన ప్రభుత్వాలు ఎన్నికల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాయి. వీటి కోసం ప్రభుత్వాలు దీర్ఘకాలిక అభివృద్ధిపై దృష్టి సారించకుండా, జనాకర్షక పథకాల ద్వారా తాత్కాలిక ప్రయోజనాలను అందిస్తున్నాయి. దానివలన దేశ అభివృద్ధిపై ప్రభావం పడుతుంది.
- పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా మధ్యంతర ఎన్నికలు, ఉప ఎన్నికలు, ఇలా ఎప్పుడూ ఎదో ఒక ఎన్నిక నిర్వహించవలసి రావడం వలన ఎన్నికల కోడ్‌తో విధానపరమైన నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పనులు, బాధ్యతలు వదిలేసి ఎన్నికల పనులలో నిమగ్నం కావడం వలన, పాలన కూడా కుంటుపడుతోంది.
- ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు నిర్వహించడం వలన ఎన్నికల ఖర్చు కూడా కలసివస్తుంది.
- రాజకీయ పార్టీలు కూడా ఐదేళ్ల పాటు ఎన్నికల వ్యూహాలలో నిమగ్నం కావలసిన అవసరం ఉండదు, అవి తమ భావజాలానికి అనుకూలంగా అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తాయి.
- 29 రాష్ట్రాలకు మరియు పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు, కేంద్రంలో గాని, కొన్ని రాష్ట్రాలలో గాని సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోతే ఏం చేయగలరు?
- రాష్ట్రాలలో అయితే కొంత సంధికాలం పాటు రాష్ట్రపతి పాలన విధించవచ్చు. కాని ఐదేళ్ల పాటు దానినే కొనసాగించలేరు కదా. ఇప్పటికే, ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా, రాష్ట్రపతి పాలన పేరిట కేంద్రం నియమించిన గవర్నర్ పాలించడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అనేకరకాల విమర్శలు ఉన్నాయి.
- కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యంకాకపోతే రాష్ట్రపతి పాలన అనే వెసులుబాటు కూడా లేదు కదా? ఐదేళ్ల పాటు కేంద్రంలో ప్రభుత్వం లేకుండా మనుగడ సాధ్యమా?
- ఒకవేళ కేంద్రంలో గాని, రాష్ట్రాలలో గాని మధ్యలో ప్రభుత్వాలు పడిపోయినా ఇదే పరిస్థితి తలఎత్తుతుంది.
- పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ జమిలి ఎన్నికల విధానం సాధ్యం కాదు. అమెరికా తరహా అధ్యక్ష్య పాలన ఉంటేనే ఈ విధానం సాధ్యమవుతుంది. రాజ్యాంగ సవరణ ద్వారా మనదేశాన్నిఅధ్యక్ష్య పాలనవైపు మళ్లించేందుకే బిజెపి ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానాన్నితెరపైకి తెచ్చిందనే వాదనలూ ఉన్నాయి.
- ఇప్పటికే మన దేశంలో బిజెపి ప్రతిపాదిస్తున్న ఒకే భాష, ఒకే మతం విధానాలు విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు అదే కోవలో కొత్తగా ఒకే ఎన్నికలు అనే విధానం కూడా చేరింది.
కేంద్ర ప్రభుత్వానికి ఈ ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానంపై ఇప్పటికే వేసిన మూడు కమిటీలు (నీతి ఆయోగ్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, లా కమిషన్), నివేదికలు సమర్పించాయి. ఇప్పుడు కొత్తగా వేసిన కమిటీ ఏం సాధిస్తుందో వేచిచూద్దాం.
Post a Comment