చదువుల తల్లి సరస్వతి దేవి పుట్టినరోజైన మాఘ శుక్ల పంచమిని శ్రీపంచమి అంటారు. సమస్త జీవ రాశుల కంటే మానవుడిని ఉన్నత స్థానంలో నిలిపిన వాక్కు, ప్రజ్ఞ, మేధ, ధారణ, స్ఫురణ, బుద్ధి మొదలైన లక్షణాలన్నింటికీ అధిదేవత సరస్వతీదేవి. సరస్వతి దేవి పుట్టిన రోజు అంటే మానవుని ఔన్నత్యానికి పుట్టినరోజు.
సరస్వతీ పూజ
శ్రీ పంచమి రోజున సరస్వతీ దేవిని, పుస్తక రూపంలోగానీ, విగ్రహ రూపంలోగానీ పూజిస్తే సమస్త విద్యలు లభిస్తాయని భావిస్తారు.
శ్రీ పంచమి రోజు ఉదయం స్నానాదికాలు ముగించుకుని, శుచియై, గణపతిని పూజించి, కలశంలో సరస్వతీదేవిని ఆవాహన చేయాలి. ప్రతిమకు గానీ, చిత్రపటానికి గానీ, తెల్లని పూలు, మంచి గంధం, అక్షతలు, తెల్లని నగలు అలంకరించి, షోడశోపచారాలతో పూజించి, పాయసం, వెన్న, పెరుగు, వారి పేలాలు, తెల్లనువ్వులతో చేసిన లడ్లు, చెఱుకు రసం, బెల్లం, తేనే, పాల కోవా, చెక్కర, కొబ్బరికాయ, రేగిపళ్ళు వంటి వాటిలో లభ్యమైనవి నివేదించాలి. ఈ రోజున పలక, బలపం, పెన్నులు, పుస్తకాలు మరియు బెల్లం వంటివి దానం చేయటం శ్రేయస్కరం.
తెలుపు రంగు స్వచ్ఛతకు, పవిత్రతకు సంకేతం. తెల్లని శరీర వర్ణంతో, తెలుపు రంగు వస్త్రాలు ధరించి, తెల్లని పద్మంపై సరస్వతీ దేవి ఆసీనురాలై ఉంటుంది. అందుకే సరస్వతి పూజలో తెలుపు రంగుకు ప్రాధాన్యతనిస్తారు, తెల్లని మల్లెపూలతో పూజిస్తారు.
శ్రీ పంచమి రోజును వసంత పంచమి మరియు మంజు పంచమి లాంటి పేర్లతో కూడా జరుపుకుంటారు.
వసంత పంచమి
మకర సంక్రమణం తరువాత వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో గోచరిస్తాయి. మాఘ మాసం వసంత ఋతువును స్వాగతిస్తుంది. ఆ వసంత ఋతువు శోభకు వసంత పంచమి శ్రీకారం చుడుతుంది. ఋతు సంబంధమైన పర్వదినం వసంత పంచమి.
మంజు పంచమి
బౌద్ధులు సరస్వతీదేవిని ప్రజ్ఞా విశేషాలకు ప్రతీకగా భావించి ఆమెను మంజు శ్రీ అనే పేరుతో పూజిస్తారు. వారు శ్రీ పంచమిని పారుమంజు పంచమిగా జరుపుకుంటారు.
Post a Comment