భోగి పండుగ

భోగి మంట
భోగి మంట
భోగాలను కలిగించేది భోగి పండుగ అని నానుడి. తెలతెలవారకముందే పల్లె పల్లెను ఎర్ర ఎర్రని కాంతులతో ఆహ్లాదపరిచేది భోగి. తొలి మంచు సమయంలో భోగి మంటల వేడితో ఆనందంగా జరుపుకునేది భోగి పండుగ.

భోగి రోజున సాయంత్రం పసిపిల్లల తల్లులంతా భోగిపళ్ళ పేరంటాల్లో మునిగిపోతారు. సంక్రాంతి, కనుమల కోసం పిండి వంటలు చేసుకుంటారు. కొత్త వస్త్రాలు ధరిస్తారు.

పుష్య, మాఘ మాసాలలో ఉండే చలిలో భోగి మంటలు ప్రత్యేకమైన ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ధనుర్మాసం నెల్లాళ్ళు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి, దండగా గుచ్చి పిల్లలతో భోగి మంటలలో వేయిస్తారు. ఇలా చేయటం వలన పితృఋణం తీరుతుందని భావిస్తారు. అలాగే ఇంటిలో పాతబడిన వస్తువులను సైతం భోగి మంటలలో వేస్తారు. ఈ చర్యల వల్ల త్యాగం, వృథా బరువును వదిలించుకోవటం వంటి గుణాలు అలవడతాయి.

సంవత్సరంలో ఉండే పన్నెండు సూర్య సంక్రమణాలలో చాలా ఎక్కువ సేపు పుణ్యకాలం ఉండేది మకర సంక్రాంతి రోజునే. ఆ రోజుతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంతకు ముందు రోజు భోగి పండుగ వస్తుంది.

భోగి పండుగకు సంబంధించి అనేక పురాణ గాథలు ఉన్నాయి.
  • శ్రీరంగనాథుని భర్తగా పొందాలని పరితపించిన గోదాదేవి, ధనుర్మాసంలో కాత్యాయనీ వ్రతం ఆచరించింది. ఆ వ్రత ఫలంగా భోగి రోజు ఆమె కళ్యాణం జరిగింది. 
  • శ్రీహరి వామనావతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళానికి అణగదొక్కింది భోగినాడే అనేది కొందరి నమ్మకం. అందుకే భోగి రోజున వామన నామ స్మరణం, బలి చక్రవర్తిని ప్రస్తుతించటం లాంటి ఆచారాలు కొన్ని చోట్ల ఉన్నాయి. 
  • వర్ష కారకుడై, మంచి పంటలను ఇచ్చినందుకు, ద్వాపర యుగం వరకు భోగి రోజున ఇంద్రున్ని ఆరాధించేవారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినప్పటి నుండి ఈ ఆచారంలో మార్పు వచ్చినట్లుగా భావిస్తారు. 
దీపావళి అమావాస్య నాడు తలంటుకోరు. ముందు రోజయిన నరక చతుర్దశినాడే తలంటుకోవాలి. అలాగే మకర సంక్రాంతి నాడు కాకుండా భోగి నాడే తలంటుకోవాలి.

భోగిపళ్లు

భోగిపళ్లు
భోగిపళ్లు
భోగి రోజు సాయంత్రం ఇంట్లో పదమూడేళ్ళలోపు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. ముందుగా తల్లులు పేరంటం చేసి, పిల్లలను నూతన వస్త్రాలు ధరింప చేసి, పీటపై కూర్చోబెట్టి భోగిపళ్లు పోస్తారు. రేగు పళ్లు, చిల్లర నాణాలు, పసుపు అక్షతలు. బంతులు, చేమంతి పూల రేకులు కలిపితే భోగి పళ్లు అవుతాయి. భోగిపళ్లను చుట్టూరా మూడుసార్లు తిప్పి పిల్లల తలపై పోస్తారు. ఇలా దిష్టి తీయటం వలన బాలారిష్టాలు తొలగిపోయి, ఆయురారోగ్యాలు కలుగుతాయని భావిస్తారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post