మల్లన్నసాగర్‌ కేసులో ముగ్గురు ప్రభుత్వాధికారులకు జైలుశిక్ష


మల్లన్న సాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి, కోర్టు ధిక్కరణకు పాల్పడిన ముగ్గురు ప్రభుత్వాధికారులకు హైకోర్టు 2వేల రూపాయల జరిమానాతో పాటు మూడు నెలల జైలు శిక్ష కూడా విధించింది. 

పునరావాసం కల్పించకుండానే, పనులు మొదలు పెట్టారని సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌కు చెందిన 70 మంది వ్యవసాయ కార్మికులు గతేడాది హైకోర్టును ఆశ్రయించారు. పునరావాసం కల్పించకుండా పనులు చేపట్టవద్దని గత జులై 25న కోర్టు ఆదేశించింది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు పిటిషనర్లకు తెలుగులో సమర్పించాలని, వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. 

కోర్టు ఆదేశించిన తరువాత కూడా పనులు కొనసాగిస్తున్నారంటూ,  గత పిటిషనర్లలో 17 మంది కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.  దీనిని విచారించిన హైకోర్టు కోర్టు ధిక్కరణకు పాల్పడటమే కాకుండా, న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చారని తేల్చింది.  ఇందుకు కారణమైన  
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో యూనిట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న సిద్దిపేట ఆర్డీవో జయచంద్రా రెడ్డి,
తొగుట తహసీల్దార్ వీర్ సింగ్, మరియు
నీటి పారుదల శాఖ గజ్వేల్ డివిజన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ టి.వేణులను దోషులుగా తేల్చింది. వారికి మూడు నెలల జైలు శిక్షతో పాటు 2వేల రూపాయల చొప్పున జరిమానాను విధించింది. వీరు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్షను ఆరు వారాల పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వాధికారులు నిబంధనలను పాటించకుండా, రాజకీయ నాయకులకు వంతపాడితే, ఫలితాలు ఎలా ఉంటాయో ఈ ఉదంతం మరోసారి చాటిచెప్పింది.  

0/Post a Comment/Comments

Previous Post Next Post