ప్రభుత్వాలు ఆదివాసీలను అడవుల నుండి ఎందుకు ఖాళీ చేయిస్తున్నాయి?


ఆదివాసీల జీవితం అడవులతో పెనవేసుకుపోయి ఉంటుంది. అక్కడ దొరికే తేనె, తునికాకు, కొన్నిరకాల గింజలు, పండ్లు, చింతపండు లాంటి అటవీ ఉత్పత్తులను సేకరించడం మరియు పశువులను పెంచడం ద్వారా వారు ఉపాధిని పొందుతారు. కాని ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఆదివాసీలను అడవులనుండి తరలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు, వారిని అక్కడ నుండి ఎందుకు తరలిస్తున్నారు? అనే విషయంపై ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి.  

ఐక్య రాజ్య సమితి ఆందోళన 

ఆదివాసీల తరలింపు అంశంపై గురువారం రోజు ఐక్య రాజ్య సమితి ప్రకటనను కూడా విడుదల చేసింది. భారత దేశంలో అడవులలో నివసిస్తున్న 90 లక్షల మంది ఆదివాసీలను ప్రభుత్వాలు తరలించే ప్రయత్నం చేయడం పట్ల ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివాసీల జీవితం అడవులపైనే ఆధారపడి ఉందని, వారిని అక్కడి నుండి తరలించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. అడవులకు వాస్తవ హక్కుదారులైన ఆదివాసీ గిరిజనులను, ఆక్రమణదారులుగా చూపించే ప్రయత్నాలను విరమించాలని, అటవీ హక్కుల కోసం గిరిజనులు పెట్టుకున్న దరఖాస్తులపై పారదర్శకమైన, స్వతంత్ర విచారణ జరగాలని సూచించారు. 

అడవులపై హక్కులు ఎవరికి ఉంటాయి? 

మన దేశంలో యుపిఎ ప్రభుత్వ హయాంలో 2006లో అటవీహక్కుల చట్టం ఆమోదింపబడింది. ఆ చట్టం ప్రకారం,  ఆ సమయం వరకు అడవులలో నివసిస్తున్న, ఆదివాసీలు, గిరిజనులకు అక్కడ భూ హక్కులు ఉంటాయి. ఒకవేళ గిరిజనేతరులయితే వారు మూడు తరాలు లేక 70 ఏళ్లకు పైబడి అక్కడ నివసిస్తేనే భూమి హక్కులు వస్తాయి. హక్కులు లేనివారు అడవులలో నివసించకూడదు. అంటే 2006 తర్వాత అడవులలో కొత్త ప్రాంతాలను ఆక్రమించే గిరిజనులు, హక్కులు పొందలేని ఇతరులు అక్రమంగా నివసిస్తున్నట్లుగా పరిగణింపబడతారు. 

ప్రభుత్వాలు ఆదివాసీలను ఎందుకు ఖాళీ చేయిస్తున్నాయి? 

రక్షిత అటవీప్రాంతాలను ఆక్రమించడం వల్ల అడవులు అంతరించిపోతున్నాయంటూ వన్యప్రాణి సంరక్షణ సంస్థలు కేసు వేశాయి. ఈ కేసులో ఈ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన సుప్రీంకోర్టు, అడవులలో అక్రమంగా నివసిస్తున్నవారందరినీ ఖాళీచేయించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో ప్రభుత్వాలు ఆదివాసీలను ఖాళీ చేయించడానికి ఉపక్రమించాయి. 

2006కు ముందు నుండి ఉన్నవారిని సక్రమంగా గుర్తించ లేదని, అసలు రాష్ట్రాలకు ఈ విషయాలపై అవగాహన, సరియైన విధానాలు లేవని, ఇంత గందరగోళ పరిస్థితులలో వారిని ఎలా తరలిస్తారని కొంతమంది ఈ తీర్పుపై అప్పీలు చేయడంతో 2006 అటవీహక్కుల చట్టం కింద గిరిజనులను ఖాళీచేయించాలన్న ఉత్తర్వులపై సుప్రీంకోర్టు 2019 ఫిబ్రవరి 28వ తేదీన స్టే ఇచ్చింది. ఆదివాసీల అటవీహక్కులను ఏ ప్రాతిపదికన ఖరారు చేయాలనుకుంటున్నారో జులై 12వ తేదీలోపు చెప్పాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.  

0/Post a Comment/Comments