తెలుగు రైతుల పట్ల కేంద్రం శీతకన్ను


తెలుగు రాష్ట్రాలలో అధికంగా పండించే పంటలైన వరి, పత్తి లాంటి పంటలకు కేంద్రం ప్రకటిస్తున్న మద్ధతు ధరలను, వాటికయ్యే సాగు వ్యయాలను గమనిస్తే, రైతులకు ఎంత అన్యాయం జరుగుతుందో అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక అంచనాల ప్రకారమే ఈ తేడాలను గమనించండి.

పంట
పరిమాణం
సాగువ్యయంమద్ధతు ధర నష్టం
(రూపాయలలో)
ఏ-గ్రేడు వరి ధాన్యంక్వింటాలు26851835850
పత్తిక్వింటాలు950255503952

కనీసం ఈ ప్రకటించిన మద్ధతు ధరకన్నా కొనుగోళ్లు జరుగుతాయా?, అంటే అదీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడు 25% పంటనన్నా కొన్న దాఖలాలు లేవు. ఎందుకంటే కేంద్రం రాష్ట్రాలకు అంతవరకే వెసులుబాటు కల్పిస్తుంది. రైతులు, మద్ధతు ధర కంటే కొంత తక్కువకు వ్యాపారులకు అమ్ముకోవలసిందే. 

కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలు
  • 2014 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో, బిజెపి కనీస మద్దతు ధర 50 శాతం పెంచుతామని, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చింది. ఒకసారి అధికారం దక్కించుకున్న తరువాత ఆ విషయాన్ని మర్చిపోయింది. అడపా, దడపా 50 రూపాయలు, 100 రూపాయలు తప్ప ఒక్కసారి పెద్దగా పెంచిందేమీ లేదు.   
  • మద్దతు ధరలను నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వ విధానాలే లోపభూయిష్టంగా ఉన్నాయి. ఉద్యోగుల వేతనాలను, ప్రాజెక్టుల అంచనాలను ద్రవ్యోల్బణం ఆధారంగా సవరిస్తారు. కాని, పంటల మద్దతు ధరలను మాత్రం అలా చేయరట. పంటల మద్దతు ధరలను పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుందట. మరి ఉద్యోగుల వేతనాలను, ప్రాజెక్టుల అంచనాలను పెంచితే, ద్రవ్య లభ్యత పెరిగి ద్రవ్యోల్బణం పెరగదా? 
  • ఉత్తరభారత దేశంలో పండే  గోధుమలకు ఏనాటినుండో అధిక మద్దతు ధర ఇస్తున్నారు. పైగా అదే ధరకు చాలా రాష్ట్రప్రభుత్వాలకు నేరుగా మొత్తం పంటను కొనే అవకాశాన్ని కల్పిస్తుంది. వరి ధాన్యానికి వచ్చేసరికి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కనీసం సాగువ్యయమన్నా గిట్టుబాటు కావడంలేదు. ప్రత్యేకించి ఇప్పుడు దక్షిణ రాష్ట్రాల నేతల మాటలు, కేంద్రంలో చెల్లుబాటయ్యే అవకాశం కూడా లేదు.
  • ఇక సబ్సిడీల విషయానికి వస్తే, రైతులు పంటల సాగులో వినియోగించే రసాయన ఎరువులపై 1991 నుంచి క్రమంగా సబ్సిడీ ఎత్తేస్తున్నది. డీజిలుపై పూర్తిగా ఎత్తివేశారు. పైగా వీలైనన్ని సుంకాలు, పన్నులు కూడా మోపుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన పేరిట రైతులకు ఏటా ఆరువేల రూపాయలను అందిస్తున్నారు. కాని, దానికి సవాలక్ష నిబంధనలను విధించారు.
కొంతవరకు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు, రైతులకు తోడ్పాటునందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాని, మద్ధతు ధరలు ఇవ్వకుండా, రైతులను ఎక్కువకాలం కేవలం ప్రభుత్వంపై ఆధారపడేలా చేసే విధానాలను అవలంభించడం శ్రేయస్కరం కాదు. తెలంగాణ ప్రాంతంలో అయితే పంట కన్నా రైతులు రైతుబంధుపైనే ఎక్కువ ఆధారపడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు.   

0/Post a Comment/Comments

Previous Post Next Post