ప్రాణాలైనా అర్పిస్తాం. 'ఆ ఒక్కటి తప్ప'


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విభజన తరువాత రెవిన్యూ లోటులో ఉంది. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు రెవిన్యూ లోటు కింద గత ఐదు సంవత్సరాలుగా, ఏటా నాలుగువేల కోట్ల వరకూ సహాయం చేసింది. కేంద్ర సహాయానికి కూడా ఇక ఇదే చివరి సంవత్సరం. మన రాష్ట్రంలో వేతనాల ఖర్చు, ఇతర రెవిన్యూ ఖర్చులు, మరే ఇతర రాష్ట్రంతో పోల్చి చూసినా చాలా ఎక్కువ. ఇప్పటివరకు రెవిన్యూ ఖర్చును అదుపులో ఉంచే చర్యలు చేపట్టలేదు. 

ఈ బడ్జెట్లో మన రాష్ట్ర ప్రణాళికా వ్యయాన్ని 47499 కోట్లుగా తేల్చారు. రాష్ట్ర రెవిన్యూ వ్యయం 180475 కోట్లు. దీనిలో కొంత విద్య, వైద్యం లాంటి నేరుగా సేవలు అందిస్తున్న వారి వేతనాలు తీసివేసినా ఒక రూపాయి ప్రజలకు ఖర్చు పెట్టడానికి (ప్రణాళికా వ్యయానికి), రెండు నుండి మూడు రూపాయలను ప్రభుత్వం రెవిన్యూ వ్యయం రూపేణా ఖర్చు చేస్తుందన్నమాట. ఆ నలభై ఏడు వేల కోట్ల మొత్తం కూడా ఎన్నడూ ఖర్చు పెట్టరు. రాష్ట్రానికి అంచనా వేసిన ఆదాయం రాకపోతే, రెవిన్యూ వ్యయం ఎలాగూ తగ్గదు. వారు తగ్గించేది ప్రణాళికా వ్యయమే. అంటే ఈ సంవత్సరం దీనిలో 20వేల కోట్లను ఖర్చు చేయగలిగినా గొప్పే. ఇంకా మనం అవినీతిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. అంటే విధానాలు, ఖర్చులు ఎంత అస్తవ్యస్తంగా, లోపభూయిష్టంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

మనం ఒక సంస్థను నడుపుతున్నాం అని అనుకోండి. ఆ సంస్థ నెలవారీ ఆదాయం 10 లక్షలు ఉండి, జీత భత్యాల ఖర్చు 12 లక్షలు ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం. ఉద్యోగులను, వేతనాలను, ఇతర ఖర్చులను తగ్గించే చర్యలు చేపడతాం. కాని, బయట నుండి అప్పులు తెచ్చి, ఖర్చును 15 లక్షలకు పెంచుకోం కదా!                              

రాష్ట్ర విభజన సమయంలో రాజకీయ నాయకులు, ఉద్యోగులు, ప్రజలు సమైక్య ఉద్యమం నడిపారు. అప్పుడు ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న అశోక్ బాబు గారు, రాష్ట్రం కోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం అని నినదించేవారు. విభజన జరిగిపోయింది. కాలక్రమంలో ఐదు సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. ఇప్పుడు రాజకీయ నేతగా రూపాంతరం చెందిన అదే అశోక్ బాబు గారు కొన్ని రోజుల క్రితం టీవీ చర్చలలో అరగంటపాటు, తెలుగు దేశం హయాంలో ప్రతిపాదించిన వేతన పెంపు, ఇప్పటి ప్రభుత్వం ప్రతిపాదించిన వేతన పెంపు కన్నా ఎలా అరశాతం ఎక్కువో అనర్గళంగా వివరించారు. విభజన జరిగిన వెంటనే లోటులో ఉన్న రాష్ట్రమని కూడా పరిగణించకుండా 40% వేతన సవరణను డిమాండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 27% . అంటే వీళ్ళు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తారు. కానీ వేతన సవరణను మాత్రం వదులుకోరన్నమాట. పోనీ, ఇంతా చేసి నిజాయితీగా, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడతారా? అంటే ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే.             

0/Post a Comment/Comments

Previous Post Next Post