భారత దేశ దక్షిణ తీరానికి అతి సమీపంగా శ్రీలంక తీరప్రాంతం ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో రెండు తీరాల మధ్య దూరం కేవలం పది నాటికల్ మైళ్ళు మాత్రమే ఉంటుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్సకారులపై శ్రీలంక ప్రభుత్వం కఠినంగా వ్యవరిస్తుండడంతో, రెండు దేశాల మధ్య తరచూ ఉద్రికతలు తలెత్తుతున్నాయి.
తీరప్రాంతంలోని మత్స్యకారులు నిరక్ష్యరాసులు. చేపలు పట్టడం తప్ప మరే విద్య రానివారు. వారి వద్ద సముద్రంలో సరిహద్దులను గుర్తించే ఉపకారణాలేమీ ఉండవు. వారు పొరపాటున శ్రీలంక జలాల్లోకి ప్రవేశిస్తుండడంతో, శ్రీలంక సైన్యం యొక్క దాడులకు గురవుతున్నారు. కాల్చి చంపడం, పట్టుకుని చిత్రహింసలకు గురిచేయడం, పడవలను, చేపలను స్వాధీనపరచుకోవడం వంటి దుశ్ఛర్యలకు, ఆ సైన్యం పాల్పడుతుంది. ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం, శ్రీలంక సైన్యం దాడులలో గత నాలుగు సంవత్సరాలలో కనీసం 100 మంది భారతీయ మత్స్యకారులు మరణించారు మరియు 350 మంది తీవ్రంగా గాయపడ్డారు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
2004 సునామీ అనంతరం భారత తీర ప్రాంతంలో మత్స్య సంపద తగ్గిపోయింది. అప్పటి నుండి మత్స్యకారులు సముద్రపు లోతులలోకి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఆ కాలంలో శ్రీలంకలో తమిళులకు, సైన్యానికి మధ్య అంతర్యుద్ధం జరుగుతుండడంతో, శ్రీలంక సైన్యం మత్స్యకారులపై దృష్టిపెట్టలేదు. పొరపాటున లేదా ఉద్దేశ్యపూర్వకంగా ఆ దేశ జలాలలో ప్రవేశించినా ఎటువంటి ఇబ్బంది ఎదురయ్యేది కాదు. 2009లో అంతర్యుద్ధం ముగిసిన అనంతరం మాత్రమే ఈ తరహా దాడులు మొదలయ్యాయి.
మొదట్లో వారు అన్ని సౌకర్యాలు కలిగిన పెద్ద ట్రాలర్లపై మాత్రమే దాడి చేసేవారు. ఎందుకంటే వారివద్ద సరిహద్ధును తెలిపే అన్ని ఉపకరణాలు ఉన్నా తమ జలాలలోకి ప్రవేశిస్తున్నారని. కాని, తర్వాత కాలంలో వారు చిన్న చిన్న మరపడవలపై కూడా దాడి చేయడం మొదలు పెట్టారు. అప్పటినుండి తమిళనాడులో శ్రీలంక వారి పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలయింది. వారు తాము తమిళులమనే, సింహళులు ఉద్దేశ్యపూర్వకంగా దాడిచేస్తున్నారన్న భావనలోకి వచ్చేశారు. అందుకే శ్రీలంకకు చెందిన క్రికెటర్లు వచ్చినా, ఇతర క్రీడాకారులు వచ్చినా వారు నిరసనలు వ్యక్తం చేస్తారు. కొన్ని ఐపిఎల్ మ్యాచ్‌లు చెన్నై నుండి తరలింపబడడం, అక్కడ జరిగిన వాటిలో శ్రీలంక ఆటగాళ్లు పాల్గొనకపోవడం కూడా మనం చూసాం.
సాంప్రదాయకంగా మనదేశ మత్స్యకారులే ఈ జలాలలో చేపలు పట్టుకునేవారు. కాని, 1970వ దశకంలో తమిళనాడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వివాదాస్పదమైన 'కచ్చ తీవు' ద్వీపాన్ని, ఆ ప్రాంతంలోని సముద్ర జలాలను కేంద్రం, శ్రీలంక దేశానికి ధారాదత్తం చేసింది. ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు ద్వీపాన్ని మరియు మత్స్యకార హక్కులను తిరిగి పొందాలని కోరుకుంటారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి, మత్సకారులకు మన దేశ ప్రాదేశిక జలాలను గురించిన అవగాహన కల్పించడం, మన దేశ ప్రాదేశిక జలాలలోనే అవసరమైతే దూరంగా వెళ్లి చేపలను వేటాడేందుకు అవసరమైన ఉపకరణాలు అందించడం చేయాలి. శ్రీలంక సైన్యంతో కూడా చర్చలు జరిపి కఠినంగా వ్యవహరించకుండా చూడాలి.
Post a Comment