కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం నుండి పన్నుల రూపేణా రావలసిన వాటా తప్ప ప్రత్యేకంగా కేటాయింపులేం లేవు. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా, ఒక్క దానికి కూడా మోదీ ప్రభుత్వ ఆమోదం లభించలేదు.
తెలంగాణకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉంటుందని ఎందుకు ఆశించారు?
గత ఐదు సంవత్సరాలుగా బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు పెద్దగా లేకున్నా, ఈ సారి మాత్రం ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాలుగు లోక్‌సభా స్థానాలలో విజయం సాధించడంతో, ఈ రాష్ట్రంపై దృష్టి సారించనుందని, ఇందులో భాగంగానే తెలంగాణకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు ఉంటాయని భావించారు.
కేంద్రబడ్జెట్ నుండి తెలంగాణ ఏం ఆశించింది?
- కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా
- మిషన్ భగీరథ మరియు మిషన్ కాకతీయ పథకాలకు నీతిఆయోగ్ సిఫారసు మేరకు కేటాయింపులు
- విభజన హామీలైన బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ
- పసుపు బోర్డు
- జిల్లాల సంఖ్య పెరగడంతో వెనుకబడిన జిల్లాలకు కేటాయింపుల పెంపు
- సింగరేణి కాలరీస్ సంస్థకు 1850 కోట్లు
- గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 4 కోట్లు
- హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయింపులు (అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చికి 319.39 కోట్లు, నేషనల్ ఫిషరీష్ బోర్డుకు 80.75 కోట్లు, ఐఐటి, సి-డాక్ సంస్థలకు దేశవ్యాప్తంగా కేటాయింపులు జరిగాయి, వాటిలో కొంత దక్కవచ్చు.)
ప్రత్యేక కేటాయింపులు లేకపోగా, తెలంగాణ ప్రజలపై కేవలం డీజిల్ మరియు పెట్రోల్ పన్నుల రూపేణా 1000 కోట్లకు పైగా భారం పడింది. ఇప్పటికే నష్టాలలో ఉన్న తెలంగాణ ఆర్టీసీపై ఈ ధరలు భారీ ప్రభావం చూపనున్నాయి. హర్ ఘర్ జల్ యోజన, పిఎం కిసాన్ యోజనలను తెలంగాణ ప్రభుత్వ పథకాలను అనుసరించి రూపొందించినా, బడ్జెట్‌లో కనీసం రాష్ట్ర ప్రస్తావన చేయలేదు. దీనితో బడ్జెట్‌పై అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు, ఎంపీలు మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు.
Post a Comment