తానా తలచినది ఒకటయితే...


తానా (TANA - Telugu Association of North America), అమెరికాలో 1977లో నిమ్స్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన కాక‌ర్ల సుబ్బారావు చొరవతో, ఈ తెలుగు సంఘం ఆవిర్భ‌వించింది. విద్య‌, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు వారందరూ కలిసి, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు, వారిలో వారు సహాయ సహాకారాలు అందించుకునేందుకు దీనిని ఉపయోగించుకునేవారు. ఆరంభంలో ఒక వెలుగు వెలిగిన ఈ సంస్థ ప్రతిష్ట గత రెండు దశాబ్దాలుగా మసకబారడం ప్రారంభించింది. ఇది తెలుగు దేశం పార్టీకి అనుబంధ సంస్థ అని, కేవలం ఒక కులానికే ప్రాతినిధ్యం వహిస్తూ "కామా"గా మారిందని విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా,  తానా నుండి విడిపోయి కొన్ని వేరే తెలుగు సంఘాలూ వెలిశాయి.  

ప్రతి సంవత్సరం తానా ఆధ్వర్యంలో తెలుగు మహాసభలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ సభలలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుండి సినీ, రాజకీయ ప్రముఖులను,  కవులు, కళాకారులు, రచయితలు, వ్యాపారవేత్తలు, డాక్టర్లను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా, ఈ నెల 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు తానా మహాసభలు వైభవంగా జరిగాయి. అయితే సంఘం ఈసారి సభలలో తమపై పడిన కుల మరకలను తొలగించే ప్రయత్నం చేసింది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నుండి ఒక వర్గం నాయకులనే ఎక్కువగా పిలిచే సంఘం, ఈసారి వేడుకలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత రాంమాధవ్‌లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. 

ఆహ్వానాలపై మరో రకమైన విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి, జనసేన మరియు బిజెపిలతో ఏర్పడిన విభేదాలను తొలగించేందుకే వారిని ఆహ్వానించారని, తెలుగు దేశం జేబు సంస్థగా వ్యవహరిస్తుందని వార్తలు వచ్చాయి. మరోవైపు బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్‌కు అవమానం జరిగిందంటూ వచ్చిన వార్తలు, ఖండించేలోపే సంఘ ప్రతిష్టను మరింత దిగజార్చాయి. దీనిపై టీవీలలో డిబేట్లు, ఈ సంఘం కులరాజకీయాల గురించి, తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారికి కూడా చాటిచెప్పాయి. ఇలా ఒక సామాజికవర్గం చేతుల్లోనే తానా వుందన్న అపవాదును తొలగించుకోవడానికి చేసిన ప్రయత్నాలు మరింత అప్రతిష్ఠను తెచ్చిపెట్టాయి.

దేశం కాని దేశంలో బతకడానికి వచ్చిన గుప్పెడు మంది తెలుగువారికి, ఉన్న కులపిచ్చిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పరిస్థితి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా ఇంతగా కనిపించదు. తెలుగు సినిమాల విషయంలో, రాజకీయాల విషయంలో, సంఘాల విషయంలో విధానాల పరంగా కాక, కులాల పరంగా విడిపోవడాలు, వాదులాడుకోవడాలు, మద్దతునిచ్చుకోవడాలు ఇక్కడి పరిస్థితికి అద్దం పడతాయి.    

2/Post a Comment/Comments

  1. తందానా కులసంఘానికి పోవడమే దండగ

    ReplyDelete
    Replies
    1. అను'కుల' వ్యక్తులు క్రమం తిప్పకుండా వెడుతూనే ఉంటారు లెండి. అదంతా వాళ్ళ ఎస్టేట్.

      Delete

Post a Comment

Previous Post Next Post