విచారణకు మరోసారి శివాజీ గైర్హాజరు


ప్రముఖ నటుడు  శివాజి, మరోసారి సైబరాబాద్ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌తో కుమ్మక్కై, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి, తమను మోసం చేసి డైరెక్టర్ల నియామకాన్ని అడ్డుకున్నారని అలంద మీడియా పెట్టిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. 

ఈ కేసులో పోలీసులు ఆయన నివాసానికి పలుమార్లు నోటీసులు పంపినా ఆయన స్పందించకుండా అజ్ఞాతంలోకి వెళ్లడంతో, ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. దానితో ఈ నెల ఒకటవ తేదీన హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడిపోయారు. పోలీసులు ఆయనకు 11న విచారణకు హజరుకావాలంటూ నోటీసులు అందజేశారు.

తన కుమారుడిని అమెరికాలో చదువులకు పంపడంలో నిమగ్నమై ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని శివాజీ పోలీసులకు ఈమెయిల్‌ పంపారు. దీనికి అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశానని అందులో వివరించారు. అయితే మరోసారి నోటీసులు జారీ చేసి, చర్యలకు ఉపక్రమించాలని పోలీసులు భావిస్తున్నారు. తాము సాధ్యమైనంత సున్నితంగా వ్యవహరిస్తున్నా నిందితులు ఇలా చేయడంపై పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన పోలీసుల ప్రశ్నలకు చెప్పే సమాధానాలపై సిద్ధమవుతున్నారని, మరికొంత సమయం పొందేందుకే ఇలా చేస్తున్నారని కూడా కొందరు వ్యాఖ్యానించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post