ఇంగ్లాండ్ 44 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు ప్రపంచ కప్‌ను సాధించింది. న్యూజీలాండ్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ టైగా, ముగిసిన అనంతరం ఆడిన సూపర్ ఓవర్ కూడా టైగా ముగియడంతో సాధించిన బౌండరీల ఆధారంగా (26-17) విజేతను నిర్ణయించారు. ఇంగ్లండులో సంబరాలు మిన్నంటగా, న్యూజీలాండ్‌లో తీవ్ర నిరాశ, అందివచ్చిన విజయం కోల్పోయిన భావన నెలకొంది.
84 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన బెన్ స్టోక్స్ న్యూజీలాండ్ నుండి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. చివరి ఓవర్ నాలుగవ బంతికి గుప్తిల్ వేసిన త్రో, రన్ కోసం పరిగెడుతున్న స్టోక్స్ బ్యాట్‌ను తాకి ఓవర్‌త్రోలుగా ఆరు పరుగులు వచ్చాయి. ఈ సంఘటనే మ్యాచ్ టై కావడానికి కారణమైంది. కాగా, బెన్ స్టోక్స్ న్యూజీలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్ నుండి ఇంగ్లాండుకు వలస వచ్చిన వ్యక్తి కావడం విశేషం.
కాగా, ఇప్పటివరకు గూచ్, అథర్టన్, బోథమ్ లాంటి దిగ్గజాలు కూడా సాధించలేని ప్రపంచ కప్‌ను ఇంగ్లాండుకు వచ్చేలా చేసిన సారథి మోర్గాన్ కూడా ఐర్లాండ్ నుండి వలస వచ్చాడు. ఇక ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా వెస్ట్ ఇండీస్ నుండి వలస వచ్చాడు. ప్రపంచ కప్‌కు కొన్ని రోజుల ముందే అతన్ని జట్టులో చేర్చుకున్నారు. దానికి నిబంధనలు అంగీకరించకపోవడంతో ఏకంగా వాటినే మార్చారు. జేసన్ రాయ్ కూడా దక్షిణాఫ్రికా నుండి చిన్నతనంలోనే వలస వచ్చాడు. ఇలా వలస వచ్చిన క్రికెటర్లు ఇంగ్లండ్ ప్రపంచ కప్ సాధించడంలో ముఖ్య పాత్ర వహించారు.
Post a Comment