ప్రభుత్వ విధానాలే, అధికారులపై దాడికి కారణమా?

కుమురంభీమ్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని సార్సాల గ్రామ సమీపంలో ఆదివారం రోజు మొక్కలు నాటడానికి వెళ్లిన అటవీ సిబ్బందిపై దాడి జరిగింది. కోనేరు కృష్ణారావు నేతృత్వంలో కొంత మంది వారిని కర్రలతో  కొడుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఈ దాడిలో అటవీ అధికారిణి అనితతో పాటు మరికొంతమంది గాయపడ్డారు. ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్య అంశం ఏమిటంటే, వారికి రక్షణగా వెళ్లిన పదిహేను మంది పోలీసు సిబ్బంది, అసలు దాడిని నిరోధించే ప్రయత్నమే చేయలేదు.   

దాడికి నాయకత్వం వహించిన కోనేరు కృష్ణారావు గారు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు స్వయానా సోదరుడు. ఈయన ప్రస్తుతం కుమురంభీమ్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ కారణాల వలననే అటవీ సిబ్బందిని కొడుతున్నా, పోలీసులు నిరోధించలేదనే వాదన ఉంది.  

అధికారులు అక్కడికి ఎందుకు వెళ్లారు?     

కాళేశ్వరంలో కొన్ని అటవీ భూములు మునిగిపోవడంతో వాటి స్థానంలో కొత్త ప్రాంతంలో చెట్లు నాటి మొక్కలు పెంచాలని అటవీ శాఖ నిర్ణయించింది. దానికోసం ఈ ప్రాంతంలో 20 హెక్టార్ల ప్రభుత్వ భూమిని అధికారులు ఎంపిక చేశారు. ఆ భూమిని చదును చేయడానికి ఆదివారం ఉదయం ట్రాక్టర్లతో వెళ్లారు. కొన్ని తరాలుగా ఆ భూములను తామే సాగు చేసుకుంటున్నామని, ఆ భూములపై యాజమాన్య హక్కు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నామని కొంతమంది స్థానికులు కృష్ణారావుతో కలిసి దాడి చేశారు.    

దాడిపై ప్రభుత్వ స్పందన 

ప్రభుత్వ అధికారులపై దాడి ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. దాడికి పాల్పడిన కోనేరు కృష్ణారావును, మరికొంత మందిని  పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ 147, 148, 307, 353, 332, 427, ఆర్‌/డబ్ల్యూ149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనపై సక్రమంగా స్పందించని పోలీసులపైనా చర్యలు తీసుకున్నారు. ఆ ప్రాంత ఎస్సై, సిఐ, డిఎస్పిలను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. కెసిఆర్ గారు కూడా ఎమ్మెల్యే కోనప్పతో మాట్లాడి, కృష్ణారావు చేత జిల్లా పరిషత్ సభ్యత్వానికి, ఉపాధ్యక్ష్య పదవికి రాజీనామా చేయవలసిందిగా సూచించారు. 

ఈ దాడిలో ప్రస్తుత ప్రభుత్వ పాత్ర ఎంత? 

ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు తాము గెలిచిన ప్రాంతానికి మకుటం లేని మహారాజులుగా వ్యవరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆ ప్రాంతంలో  పోస్టింగు కావాలంటే ఎమ్మెల్యే సిఫార్సు ఉండి తీరవలసిందే.  ఎస్సైలు, ఇంజనీర్లు, అటవీ అధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే దీనికి అతీతం కాదు. ఎమ్మెల్యే సిఫార్సుతో అక్కడికి వచ్చిన పోలీసు అధికారులు అతడి తమ్ముడికి వ్యతిరేకంగా వ్యవరించగలరా? అంటే ప్రభుత్వమే ఈ వ్యవహారం జరగడానికి కారణం కాదా?   

తెలంగాణ ప్రాంతంలో చాలావరకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తాము తాము ప్రజా సేవకులమనే మాటను మరిచిపోయి, వారి కంటే ఉన్నతులైనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలలోకి వచ్చే ప్రజలకు సరైన స్పందన, గౌరవం ఎక్కడా కనిపించవు. మితిమీరిన అధికార దర్పంతో ఉండే వారి వ్యవహారశైలిపై కూడా ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. 

పోడు భూముల సమస్య మాటేమిటి?  

ఇది పోడు భూముల సమస్యలను పరిష్కరించక పోవడం వలన వచ్చిన పర్యవసానమని కూడా కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే  పోడు భూముల సమస్యలను పరిరక్షిస్తామని కెసిఆర్  గారు హామీ ఇచ్చారు. కాని, తరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై హక్కులను కల్పించాలని ప్రతి ప్రాంతంలో వేల సంఖ్యలో దరఖాస్తులు ఉన్నాయి. అటవీ చట్టాలు కఠినంగా ఉండడంతో వాటి పరిష్కరణ ప్రభుత్వానికి కూడా దాదాపు అసాధ్యంగా మారింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post