కెసిఆర్ ట్రాప్‌లో జగన్?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కెసిఆర్ గారి ట్రాప్‌లో పడి, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రచారం ప్రారంభించింది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన పరిపాలనా భవనాలను తిరిగి తెలంగాణకు అప్పగించడం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్ళటం వంటి విషయాల ఆధారంగా, వారు ఈ ఆరోపణలు చేస్తున్నారు. ముందు తెలంగాణ నుండి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు, తొమ్మిది, పదవ షెడ్యూలులోని సంస్థల  ఆస్తులపై తేల్చుకోవాలని అంటున్నారు.    
  • పరిపాలనా భవనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహా అయితే మరో నాలుగు సంవత్సరాల పాటు తమ వద్దే ఉంచుకోవచ్చు. కాని, దానివలన తెలంగాణకు ఆస్థి పన్ను, విద్యుత్ మరియు ఇతర బిల్లులు చెల్లించడం తప్ప మన రాష్ట్రానికి ఏదైనా ఇతరత్రా ఉపయోగం ఉంటుందా?
  • కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్ళటం ద్వారా ముఖ్యమంత్రి గారు, మరో మంచి సాంప్రదాయానికి తెరతీశారు. దీని వలన మన రాష్ట్రానికి గొప్ప మేలు జరిగింది. తెలంగాణ ఉద్యమ కాలం నుండి, కెసిఆర్ గారు వ్యతిరేకించిన దుమ్ముగూడెం ప్రాజెక్టుపై ఆయనను ఒప్పించగలిగారు. దానివలన ఆంధ్రప్రదేశ్‌కు తప్ప, తెలంగాణకు ఉపయోగం ఉండదని ఎన్నోసార్లు ప్రసంగించిన ఆయన, ఒప్పుకోవడం మనకు సంబంధించినంత వరకు శుభపరిణామమే. 
  • తొమ్మిది, పదవ షెడ్యూలు లోని సంస్థల విభజన అంత సులువేమీ కాదు. సంస్థల ఆస్తుల విషయంలో పెద్దగా గొడవ లేదు. సంస్థలకు హైదరాబాద్ నగరంలో ఉన్న భూముల పైనే తగాదాలన్నీనూ. వాటిని అమ్మితే వేలకోట్లు వస్తాయని, వాటిలో వాటా ఇవ్వాలని మన రాష్ట్రం వాదిస్తుంది. కాగా  తెలంగాణ మాత్రం, ఆ సంస్థల ఏర్పాటుకు తమ రాష్ట్రంలో ఉచితంగా భూములు కేటాయించారని, నిజాం కాలం నుండి అవి తమ ఆస్తులని అంటోంది. ఈ సమస్యను ప్రజలనుండి, ప్రతిపక్షాల నుండి విమర్శలు రాకుండా తేల్చడానికి ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరుపుతున్నారు. 
  • ఢిల్లీలో ఉన్న ఎపిభవన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత తగ్గి పరిష్కారానికి అంగీకరించింది. త్వరలో గవర్నర్ సమక్షంలో రెండు ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. 
  • విద్యుత్ బకాయిల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమకు 5600 కోట్ల రూపాయల బకాయిలు రావాలని 'లా ట్రిబ్యునల్' కు వెళ్ళింది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ బకాయిలు పోను, తమకే 5000 వేల కోట్ల రూపాయలు రావాలని వాదనలు వినిపించింది. ఈ వ్యవహారం ఇంతదూరం రావడానికి విభజన బిల్లుతో పాటు రెండురాష్ట్రాల తప్పులూ కారణమయ్యాయి. వీటిపై కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. 
తెలుగు దేశం పార్టీ వారు, తాము ఐదు సంవత్సరాల పాటు పాలించిన సమయంలో గొడవలు పడడం, కోర్టులకెక్కడం తప్ప పరిష్కారానికి చర్యలేమీ చేపట్టలేదు. ఇప్పటికైనా, రెండు రాష్ట్రాల  మధ్య ఉన్న సమస్యల పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమవడం ఆహ్వానించదగిన పరిణామమే. ఇంతవరకు జగన్ గారు తీసుకున్న నిర్ణయాల వలన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కలిగిన నష్టమేమీ లేదు. అందువలన జగన్ గారు, కెసిఆర్ గారి ట్రాప్‌లో పడ్డారని అనడం సరికాదు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post