పాకిస్తాన్ తన గగనతలంపై భారతదేశంవైపు నుండి వచ్చే అన్ని విమానాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. ఇవాళ తెల్లవారుఝామున సుమారు 00.41 సమయం నుండి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గత ఫిబ్రవరిలో బాలకోట్ వైమానిక దాడుల అనంతరం పాకిస్తాన్, తన గగనతలంపై మనదేశం నుండి వచ్చే విమానాలను నిషేధించిన విషయం విదితమే. రెండురోజుల క్రితమే ఆ దేశ మంత్రి, భారతదేశం తమ ఫార్వర్డ్ బేస్‌ల నుండి యుద్ధవిమానాలను ఉపసంహరిస్తేనే, గగనతల నిషేధాన్ని ఎత్తివేస్తామని పార్లమెంటులో ప్రకటించారు. మనదేశం నుండి ఆ విషయంపై స్పందన లేకున్నా, అకస్మాత్తుగా నిషేధాన్ని ఎత్తివేశారు.
ఈ గగనతల నిషేధం వలన పాకిస్తాన్ భారీగా నష్టపోయింది. ఆ దేశ పౌర విమాన యాన సంస్థ, ఎయిర్‌లైన్స్ కలిసి 100 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే నిషేధ ప్రభావం మనదేశంపై అంతకన్నా ఎక్కువగానే పడింది. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో మరియు గో ఎయిర్ లాంటి సంస్థలకు ఈ నిర్ణయం భారీ ఉపశమనం కలిగించనుంది. ఈ నిషేధం వలన మన విమానయాన సంస్థలు, ప్రయాణికులు కలసి 300 - 500 మిలియన్ డాలర్ల వరకు నష్టపోయినట్లు అంచనాలున్నాయి. ఒక్క ఎయిర్ ఇండియానే 100 మిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకుంది. మనదేశంతో పాటు గల్ఫ్ దేశాల విమాన సంస్థలపై కూడా ఈ నిషేధప్రభావం భారీగానే ఉంది.
Post a Comment