ఈ అర్ధసత్యాల ప్రచారం ఎందుకు?


పుల్వామా ఘటన అనంతరం మనదేశం బాలాకోట్‌ (పాకిస్తాన్) లోని ఉగ్రస్థావరాలపై వైమానిక దాడి జరిపింది. ఆ తరువాత, ఆ దేశం తన గగనతల మార్గాలను మూసివేసింది. కొన్ని రోజుల తర్వాత ఇతర దేశాల విమానాలను అనుమతిస్తున్నప్పటికీ, భారత దేశం నుండి వచ్చే మార్గాలలో మాత్రం నిషేధమే కొనసాగింది. ఇలా పాకిస్థాన్‌ గగనతలంపై విమానాల నిషేధంతో ప్రపంచవ్యాప్తంగా రోజుకు 400 విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి. వీటిలో కొన్ని వాటి ప్రయాణ మార్గాలను మార్చుకోగా, మరికొన్ని పూర్తిగా రద్దు అయ్యాయి.  తాజాగా ఆ దేశం, ఈ నిషేధాన్ని జులై 12 వరకూ పొడిగించింది. 

ఇవాళ పత్రికలలో గగనతలాన్ని మూసివేయడం వలన పాకిస్తాన్ భారీగా నష్టపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీ మరియు ఎయిర్‌లైన్స్ కలిసి మిలియన్ డాలర్లు నష్టపోయాయని పేర్కొన్నారు. ఈ వార్త నిజమే అయినప్పటికీ అర్ధసత్యం మాత్రమే. ఈ నిషేధం వలన పాకిస్తాన్ కన్నా, మూడు రెట్లు ఎక్కువగా మన దేశం నష్టపోతోందనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. మన దేశం కూడా నష్టపోతుందన్న విషయాన్ని దాచవలసిన అవసరం ఎందుకు వచ్చింది?, భారత దేశ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రజలు కష్టమైనా, నష్టమైనా భరిస్తారు. కాని, ఇలా అర్ధసత్యాలతో దానినో ఘనకార్యంగా ప్రచారం చేసుకోవడం ఎందుకు?     

మనదేశంపై ఉన్న ప్రభావమెంత?       
  • మన దేశానికి చెందిన ప్రభుత్వ సంస్థ, ఎయిర్‌ ఇండియాకు కూడా దీని వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఈ సంస్థ దీనివలన మరో 500K డాలర్లు నష్టపోయినట్లు అంచనాలున్నాయి. నష్టం మిలియన్ డాలర్లను మించేది కాని, మిగతా భారాన్ని ప్రజలపై మోపింది. అంటే ఈ సంస్థ మరియు ప్రయాణికులు కలసి పాకిస్తాన్ కన్నా ఎక్కువే నష్టపోయారన్నమాట. 
  • స్పైస్ జెట్, ఇండిగో విమాన సంస్థలు కూడా భారీగా నష్టపోయాయి. మనదేశంలోని మిగిలిన విమానయాన సంస్థలు కూడా నష్టపోయినా, వీరి స్థాయిలో భారీ నష్టం అయితే కాదు. 
  • మన దేశానికి కలుగుతున్న మరో ప్రధాన నష్టం భారత, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య రాకపోకలు, వాయుమార్గాన ఎగుమతి, దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. 
  • మనదేశం నుండి యూరోప్, మధ్య ఆసియా, పూర్వపు సోవియట్ దేశాలకు ప్రయాణించే విమానాలు చుట్టూ తిరిగి ప్రయాణిస్తుండడంతో, చార్జీలు విపరీతంగా పెరిగాయి. ఉత్తర భారత దేశం నుండి అయితే, పశ్చిమానికి ప్రయాణించే దాదాపు అన్ని విమానాలపై ఈ భారం ఉంది. 
ఇలా చేయడం ద్వారా పాకిస్తాన్ ఏం ఆశిస్తుంది?

గగనతల నిషేధం ప్రభావం మనదేశం పైనే ఎక్కువగా ఉన్నప్పటికీ, దానిని తట్టుకునే సామర్థ్యం కూడా మనకు ఉంది. అదే పాకిస్తాన్ నష్టాలను తట్టుకునే స్థితిలో లేదు. అయినా నిషేధాన్ని కొనసాగించడం ద్వారా  పాకిస్తాన్ ప్రధానంగా రెండు ప్రయోజనాలను ఆశిస్తున్నట్లు కనిపిస్తుంది.
  • మళ్ళీ బాలాకోట్ తరహా దాడులు జరపమని ఒప్పందం కుదుర్చుకుంటే గగనతల నిషేధాన్ని ఎత్తివేస్తామని బాహాటంగానే ప్రకటించింది. దీనికి మనదేశం ఇప్పటివరకు అంగీకరించలేదు. 
  • గగనతల నిషేధ ప్రభావం మనదేశం పైనే కాక, ఇతర దేశాల విమానయాన సంస్థలపైనా కూడా ఉంది. ఇరాన్‌, జార్జియా, అజర్‌ బైజన్‌, ఇటలీ, సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌, థాయ్‌ ఎయిర్‌వేస్‌, మలేషియా ఎయిర్‌లైన్స్‌, ఎమరేట్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌ ఫ్రాన్స్‌, కేఎల్‌ఎం, బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, లుఫ్తాన్సా, ఏరోఫ్లోట్‌, ఫిన్నయర్‌, యూనైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ అమెరికా, కెనడాకు చెందిన విమానయాన సంస్థలు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి పెంచి, భారత దేశాన్ని చర్చలకు ఒప్పించేందుకే ఇలా చేస్తోందనే విమర్శలు ఉన్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post