ముంబై నగరంలో వరద కష్టాలు - ఎందుకీ దుస్థితి?


గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై నగర వీధులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలో, ప్రభుత్వ కార్యాలయాలలో, చివరకు పోలీసు స్టేషన్లలో కూడా నీరు చేరింది నీరు చేరింది. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
  • ఇవాళ రత్నగిరిలోని తివారి ఆనకట్టకు గండిపడింది. దీంతో దిగువన ఉన్న 7 గ్రామాల్లోకి వరదనీరు చేరింది. వరదల్లో 12 ఇళ్ళు కొట్టుకుపోయి ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందగా, మరో 22 మంది గల్లంతయ్యారు.  
  • మలాడ్‌ తూర్పు ప్రాంతంలోని పింప్రిపాడాలో సోమవారం అర్ధరాత్రి గోడ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతిచెందగా, 9 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 75 మంది గాయపడ్డారు.
  • వరదల ధాటికి వాషిమ్‌ జిల్లాలో ఇద్దరు స్కూల్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. 
జనజీవనం అస్తవ్యస్తం
మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో,  ప్రభుత్వం నగర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని ప్రకటన జారీ చేసింది. అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్‌ఫోన్లలో ఛార్జింగ్ లేక, వార్తలు కూడా అందుకునే అవకాశం లేక ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. రవాణా సౌకర్యాలు పూర్తిగా స్తంభించిపోయాయి. లోకల్ రైళ్లను రద్దు చేశారు. ప్రధాన రన్‌వే దెబ్బతినడంతో ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి.

నగరానికి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
కేవలం మూడు రోజులలో   65-70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవటంతో, ముంబయి నగరానికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నగరాలలో వాతావరణ కాలుష్యం పెరిగిపోవటంతో, చుట్టుపక్కల ప్రాంతాలకన్నా వాతావరణం వేడెక్కుతుంది. దీనిని  అర్బన్ ఐలాండ్ హీట్ ఎఫెక్ట్ అని అంటారు. ఇలా జరిగినప్పుడు క్లౌడ్ బరస్ట్ జరిగి కుండపోతగా వర్షాలు పడతాయి. సంవత్సరం పాటు కురవవలసిన వర్షం కొన్ని గంటల వ్యవధిలో కురిస్తే, నీరు బయటకు వెళ్లే మార్గాలు సరిపోక వరదలు ముంచెత్తుతాయి. వీటిని అర్బన్ ఫ్లడ్స్ అని అంటారు.

అర్బన్ ఐలాండ్ హీట్ ఎఫెక్ట్ ఏర్పడడానికి ప్రధాన కారణాలు నగరంలోని వాతావరణ కాలుష్యం, పచ్చదనం లోపించడం మరియు జలాశయాలు తగ్గిపోవడం. గత సంవత్సరం చెన్నైని కూడా ఇదే కారణంతో వరదలు ముంచెత్తాయి. నగరాలు ఇలా కాంక్రీటు అడవులుగా మారుతూ పోతే, మన దేశంలో దాదాపు అన్ని నగరాలు ఇదే రీతిలో వర్షాకాలంలో వరదలను, వేసవిలో నీటికొరతను ఎదుర్కొనవలసి వస్తుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post