మైహోం సంస్థలపై ఐటి దాడులు


మైహోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావుకు చెందిన సంస్థలు, నివాసాల్లో గురువారం ఉదయం నుంచి ఐటి సోదాలు జరుగుతున్నాయి. నందగిరి హిల్స్ లోని రామేశ్వరరావు నివాసంలోనే కాకుండా, నగరంలో మరియు బెంగళూరులో పలుచోట్ల ఉన్న మైహోం గ్రూప్ కార్యాలయాల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు పత్రాలను పరిశీలించి, ఆస్తుల విలువను మదింపు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శుక్రవారం రోజు కూడా ఈ సోదాలు కొనసాగనున్నట్లు తెలుస్తుంది.  

రామేశ్వర రావు గారు 2018లో దేశంలోని రియల్ ఎస్టేట్ ధనికుల జాబితాలో స్థానం సంపాదించారు. ఆయన గ్రూపులో మైహోమ్, మహా సిమెంట్స్ కీలక సంస్థలు. ఆ సమయంలోనే, ఆయన ఆస్తులను 3500 కోట్లకు పైగా.., అని పేర్కొన్నారు. మైహోం రామేశ్వరరావు గారు కెసిఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. దీనితో, ఈ ఐటి దాడుల వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ మరియు కార్పొరేట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. 

ఇటీవలే టీవీ9 సంస్థలో యాజమాన్య వాటాను మైహోం గ్రూప్ సంస్థ అయిన అలందా మీడియా కొనుగోలు చేసింది. యాజమాన్య మార్పిడిపై వివాదం చెలరేగడంతో రామేశ్వరరావు గారి పేరు వార్తలలో వినిపించింది. టీవీ9 సంస్థలోకి హవాలా మార్గం ద్వారా రామేశ్వర రావు గారు 220 కోట్ల రూపాయలను తరలించినట్లు, ఆ సంస్థ మాజీ సిఈఓ రవిప్రకాశ్ గారు ఆరోపించారు. ఎన్నికల సమయంలో మైహోం సంస్థ టిఆర్ఎస్ పార్టీకి భారీగా ధనసహాయం చేసిందని, అందుకు ప్రతిగా హైదరాబాద్ శివార్లలో తక్కువ ధరకే భూమిని పొందిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

రాజకీయ నాయకులుగా అవతారమెత్తిన, మరియు రాజకీయ నాయకులకు సన్నిహితంగా ఉన్న పారిశ్రామికవేత్తలపై ఇటీవల కాలంలో ఐటి దాడులు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటున్న మరిన్ని కార్పొరేట్ సంస్థలపై దాడులు జరగనున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. 

5/Post a Comment/Comments

Post a Comment

Previous Post Next Post