ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ పైచేయి సాధించినట్లేనా?


ఆఫ్ఘనిస్తాన్ నుండి సాధ్యమైనంత త్వరగా వైదొలగాలని అమెరికా భావిస్తోంది. ఇందులో భాగంగా అక్కడి ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య చర్చలు జరిగే ఏర్పాట్లు చేసింది. ఒప్పందం దిశగా కీలక ముందడుగు పడినట్లు వార్తలు వస్తున్నాయి. చర్చలలో అమెరికా, రష్యా, చైనా మరియు పాకిస్తాన్ దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. భారతదేశ ప్రతినిధి చర్చలలో పాల్గొనకుండా పాకిస్తాన్ వ్యతిరేకించడమే కాకుండా, తమ కీలుబొమ్మలైన తాలిబన్లతో కూడా వ్యతిరేకింపచేసింది.      

అమెరికా వైదొలగాలని ఎందుకు భావిస్తోంది? 

అమెరికాలో 9/11 ఘటన అనంతరం ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకోవాలని, అల్-ఖైదాను, వారికి మద్ధతునిచ్చే తాలిబన్లను అంతం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీనితో మిత్రదేశాలతో కలిసి, ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి జరిపి తాలిబన్ ప్రభుత్వాన్ని కూలదోసింది. ఆ సమయంలో అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పరుస్తామని, పూర్తిస్థాయిలో శాంతియుత పరిస్థితులు నెలకొన్న తరువాత మాత్రమే వైదొలుగుతామని ప్రకటించింది. కాని, 18 సంవత్సరాలు గడిచిపోయిన తరువాత కూడా, అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లోని అన్ని ప్రాంతాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయింది. 

ఆఫ్ఘనిస్తాన్‌లో, అమెరికా ఇప్పటివరకూ ట్రిలియన్ డాలర్లకు పైగా నిధులను ఖర్చు చేసింది. రెండు వేల మందికి పైగా అమెరికన్ సైనికులు, 1500 మంది అమెరికన్ పౌరులు కూడా మరణించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత వేరే దేశంలో శాంతి స్థాపనకు తమ దేశ నిధులు ఖర్చు చేయడం, సైనికులు ప్రాణాలర్పించడం లాంటి విధానాలను మార్చుకోవాలనుకుంటున్నారు. అందుకే తాలిబన్లతో చర్చలు జరిపి, వారిని కూడా ప్రభుత్వంలో భాగస్వాములను చేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారు. 

మనదేశానికి కలిగే నష్టం ఏమిటి?

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో భారత దేశానికి అనుకూలమైన ప్రభుత్వం ఉంది. ఆ దేశ పునర్నిర్మాణంలో చురుకుగా పాల్గొంటుంది. ఇందులో భాగంగానే పార్లమెంట్‌తో సహా కొన్ని భవనాలను, ఒక నీటిపారుదల ప్రాజెక్టును, భారీ హైవేను నిర్మించింది. అక్కడ మనదేశానికి అనేక విదేశాంగ కార్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఆసుపత్రులను, స్కూళ్లను కూడా నిర్వహిస్తోంది. ఇలాంటి కార్యక్రమాలతో అక్కడి ప్రజలలో మంచి పేరు సంపాదించుకుంది. అక్కడ క్రికెట్ వ్యాప్తికి తోడ్పడడం, క్రికెట్ జట్టుకు మన దేశ స్టేడియాలను వాడుకునే అవకాశం కల్పించడం, అక్కడి విద్యార్థులకు మనదేశ యూనివర్సిటీలలో చదువుకునే అవకాశం కల్పించడం లాంటి పనులు కూడా చేస్తోంది. ఆ దేశం కోసం ఇప్పటివరకు మనదేశం 3 బిలియన్ డాలర్లు ప్రత్యక్షంగా, మరో రెండు బిలియన్ డాలర్లను పరోక్షంగా ఖర్చుపెట్టింది. ఎయిర్ కారిడార్ ఏర్పాటు, చాబహార్ పోర్టు ద్వారా వాణిజ్యం లాంటి అంశాల ద్వారా రెండు దేశాల మధ్య ఎగుమతి, దిగుమతులు కూడా ఊపందుకున్నాయి.       

తాలిబన్లు మొదటినుండి పాకిస్తాన్‌ మద్దతుతోనే ఆఫ్ఘనిస్తాన్‌లో నిలదొక్కుకున్నారు. వారు తొలినుండి భారత వ్యతిరేక వైఖరిని కనబరుస్తున్నారు. అందుకే ప్రస్తుత ప్రభుత్వానికి, తాలిబాన్లకు మధ్య ఉన్న గొడవలతోనే పాక్-ఆఫ్ఘన్ సరిహద్ధు కూడా ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉంటుంది. ఒకసారి అక్కడ తమకు అనుకూల ప్రభుత్వం ఏర్పడితే పాకిస్తాన్, తమ పశ్చిమ సరిహద్దును వదిలి పూర్తిగా తూర్పున ఉన్న కాశ్మీర్, పంజాబ్ లపై దృష్టి సారించి అక్కడ తీవ్రవాదాన్ని మరింత పెంచిపోషించే అవకాశం ఉంది.

పాకిస్తాన్ విదేశాంగ విధానం ఎలా ఉంది?

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ పునర్నిర్మాణ పనులలో ఎప్పుడూ పెద్దగా పాల్గొనలేదు. తమ దేశ శక్తియుక్తులను పూర్తిగా తాలిబన్లకు సహాయ సహకారాలందించేందుకే ఖర్చు చేసింది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ ప్రోద్బలంతోనే వారు చర్చలలో పాల్గొంటున్నారు. అంటే టెర్రరిస్టులను ఏరివేస్తామని అమెరికా నుండి సైనిక, ధన సహాయం పొందుతూ, తాలిబన్లకు సహకరించేది. 

ఇక మనదేశంపై ఆఫ్ఘనిస్తాన్‌లో సానుకూల దృక్పథం ఉండడం పాకిస్తాన్‌కు మొదటినుండి ఇష్టం లేదు. వాఘా సరిహద్దు ద్వారా రెండుదేశాల మధ్య రోడ్డు మార్గంలో వాణిజ్యాన్ని కూడా అనుమతించలేదు. అందుకే ఖర్చు ఎక్కువైనా, ఎయిర్ కారిడార్ ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. పాకిస్తాన్‌ను బైపాస్ చేయడంలో భాగంగానే మనదేశం, ఇరాన్లో చాబహార్ పోర్టును కూడా అభివృద్ధి చేసింది.

కాని బాలాకోట్ దాడుల అనంతరం పరిస్థితులు మారిపోయాయి. పాకిస్తాన్ గగనతలం మూసివేయడంతో ఎయిర్ కారిడార్ మూతపడింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో, ఈ బడ్జెట్లో మనదేశం చాబహార్ పోర్టుకు నిధులను కూడా తగ్గించింది. అంటే మనదేశంతో ఆఫ్ఘనిస్తాన్‌కు గల ద్వైపాక్షిక వాణిజ్యం పూర్తిగా కుంటుపడింది.                                              

ఆఫ్ఘనిస్తాన్‌ భవితవ్యం ఎలా ఉండనుంది?

ప్రాథమిక శాంతి చర్చలలో భాగంగా రెండు పక్షాలు "ఇస్లాం నియమ నిబంధనలకు లోబడి" మాత్రమే మహిళల హక్కులను అనుమతించాలని నిర్ణయించాయి. అంటే ఆ దేశం పూర్తిస్థాయి ఇస్లామిక్ రాజ్యంగా రూపొందనుందని అర్థం చేసుకోవచ్చు.   

0/Post a Comment/Comments

Previous Post Next Post