క్రికెట్‌కు అంబటి రాయుడు గుడ్‌బై


క్రికెటర్, హైదరాబాద్ రంజీ కెప్టెన్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అతని తరపున ప్రకటనను విడుదల చేసింది. ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంపై తీవ్ర అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా, రిటైర్మెంట్ విషయాన్ని స్వయంగా వెల్లడించకపోవడం కూడా అనేక ప్రశ్నలను రాజేసింది. 

ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన సభ్యులను ఎంపిక చేసిన సమయంలో, విజయ్ శంకర్ త్రీ డైమన్షనల్ ప్లేయర్ అని, అందుకే రాయుడు స్థానంలో ఎంపిక చేశామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పడంపై అంబటి రాయుడు "తాను 3డీ కళ్లజోడును ఆర్డర్ చేశానని" ట్విట్టర్లో  స్పందించడం చర్చకు దారితీసింది.

ప్రపంచకప్‌కు అంబటి రాయుడు మరియు రిషబ్ పంత్‌లను రిజర్వు ప్లేయర్లుగా ప్రకటించారు. శిఖర్ ధావన్ గాయపడడంతో రిషబ్ పంత్‌కు అవకాశం లభించింది. ఆ తర్వాత విజయ శంకర్ గాయంతో జట్టుకు దూరమవడంతో, తనకు అవకాశం వస్తుందని అంబటి రాయుడు భావించాడు. కాని, బిసిసిఐ మయాంక్ అగర్వాల్‌కు అవకాశం కల్పించడంతో తీవ్ర నిరాశకు గురై అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడని భావిస్తున్నారు

అంతర్జాతీయ  మ్యాచ్‌లలో... 

అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్లో 55 వన్డేలు ఆడి 47.05 సగటుతో 1694 పరుగులు చేసాడు. ఇందులో మూడు సెంచరీలు, పది హాఫ్ -సెంచరీలు ఉన్నాయి. ఆరు అంతర్జాతీయ టి20లు ఆడి 42 పరుగులు చేసాడు. టెస్టు క్రికెట్ ఆడే అవకాశమే రాలేదు.

ఒడిదుడుకులతో సాగిన క్రికెట్ కెరీర్

అంబటి రాయుడి 17 సంవత్సరాల క్రికెట్ కెరీర్ మొత్తం తీవ్ర ఒడిదుడుకులతో సాగింది. 16 సంవత్సరాల వయసులోనే ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకుని హైదరాబాద్ రంజీ జట్టులో సభ్యుడయ్యాడు. అప్పటి  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్ష్యుడు శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ యాదవ్ కూడా అదే జట్టులో ఉండేవాడు. అతనితో తీవ్ర విభేదాలు రావడంతో హైదరాబాద్‌ను వదిలి ఆంధ్ర జట్టుకు మారాడు.

బిసిసిఐకి వ్యతిరేకంగా మొదలైన ఇండియన్ క్రికెట్ లీగ్‌లో చేరడంతో బిసిసిఐ అతనిపై నిషేధం విధించింది. ఆ తరువాత వారిని క్షమించి అనుమతించింది. తిరిగి హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక్కడ ఎక్కువ అవకాశాలు లేకపోవడం వలన బరోడా జట్టుకు మారాడు. మళ్ళీ ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్‌కు మారి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. అతనికి గుర్తింపు మాత్రం ఐపిఎల్ వల్లే లభించింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లకు, రాయుడు ఆడిన ఇన్నింగ్సే అతనికి భారత జట్టులో స్థానం కల్పించాయి.   

0/Post a Comment/Comments

Previous Post Next Post