ప్రజావేదిక కూల్చివేతతో అక్రమ నిర్మాణాల అంశం మళ్ళీ చర్చల్లో నానుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ నిర్మాణాలు, ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలోనే కొత్తగా మొదలవలేదు. అంతకు ముందు ఎవరు అధికారంలో ఉన్నా, జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో కూడా ఇవి జరిగాయి. కాని, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అక్రమ నిర్మాణంలో నివాసముండడం, దాని పక్కనే తన సౌకర్యం కోసం ప్రభుత్వ ఖర్చుతో మరో అక్రమ నిర్మాణం జరపడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఇలా చేయడం ద్వారా చంద్రబాబు గారే వీటిని ప్రోత్సహించారనే భావనను ప్రజలలోకి తీసుకెళ్లడమే జగన్ ఉద్దేశ్యంగా కనిపిస్తుంది.
ప్రజావేదిక కూల్చివేయడమే కాకుండా, చంద్రబాబు నివాసంతో సహా, కరకట్టపై ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేయడం ద్వారా కూల్చివేత వ్యక్తిగత కక్ష కాదని జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పదలచుకున్నారు. ఇక రాష్ట్రంలో అక్రమ కట్టడాలను ఉపేక్షించబోమని మరియు పర్యావరణ పరిరక్షణ విషయంలో తీవ్ర చర్యలుంటాయని అన్నారు.
పర్యావరణ పరిరక్షణపై ఆయనకు అంత శ్రద్ధ ఉంటే నిర్మాణాలు ఒక్క కరకట్టపైనే లేవు కదా? విజయవాడలో మొత్తం కృష్ణా తీరాన, విశాఖలో సముద్రపు ఒడ్డున ఇలా ఎక్కడపడితే అక్కడ ఉన్నాయి. కొల్లేరు ఆక్రమణల గురించి, చేపల చెరువుల గురించి అయితే చెప్పనక్కరలేదు. అంతేకాక, రాష్ట్రంలో ప్రతి పట్టణంలోనూ అక్రమ నిర్మాణాలు కనిపిస్తాయి. వాటన్నింటిపై చర్యలకు సమగ్ర విధానమేదైనా ఉందా? లాంటి ప్రశ్నలకు వివరణలు లేవు.
ఇక తెలుగు దేశం నేతల విషయానికి వస్తే వారి వాదనలు విచిత్రంగా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి హయాంలోనే స్విమ్మింగ్ పూల్‌కు అనుమతులు లభించాయని వారు అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వస్తే మాత్రం అక్రమం సక్రమం అయిపోతుందా?, దేవినేని ఉమా గారు, అయితే అధికారంలోకి రాగానే వీటిపై తీవ్ర చర్యలుంటాయని ప్రకటించారు. కాని చంద్రబాబు నివాసం అక్కడికి మారగానే, ఆయన స్వరం మారిపోయింది. ఇప్పుడు ఆయన ఏకంగా కూల్చివేతలను ఖండిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అక్రమ నిర్మాణాలను బిఆర్ఎస్ తరహా స్కీములతో ప్రోత్సహిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకోకుండా, ఇలాంటి పద్ధతులను అవలంభించడం వల్ల అక్రమ నిర్మాణాలు పెరుగుతాయే తప్ప తగ్గవు.
Post a Comment