రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి గోదావరి జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లకు తరలించే ప్రాజెక్టుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంపై టీవీ చర్చలలో, సోషల్ మీడియాలో, జగన్ కెసిఆర్ ట్రాప్‌లో పడ్డారని, ఆంధ్రా నిధులతో తెలంగాణకు నీళ్లు తీసుకుపోయే ఉపాయం పన్నాడని విమర్శలు వస్తున్నాయి.
గోదావరి జలాలను తరలించేందుకు ప్రాజెక్టుకు అనువైన ప్రదేశం దుమ్ముగూడెం. ఇక్కడ నుండి ఉదయసముద్రం వరకు జలాలను సులువుగా తరలించవచ్చు. కాని, సాంకేతిక కారణాల వలన, ప్రత్యామ్నాయంగా రాంపూర్ ప్రాంతం అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే రాంపూర్ ప్రాంతంలో ప్రాజెక్టును నిర్మించి, అక్కడి నుండి ఉదయసముద్రం రిజర్వాయరును నింపుతారు. ఇక ఉదయసముద్రం నుండి శ్రీశైలానికి నీళ్లు వెళ్ళటానికి 90 కిలోమీటర్ల సొరంగం తవ్వవలసి ఉంటుంది. కాళేశ్వరంలో ఏకంగా 203 కిలోమీటర్ల దూరం సొరంగాలు తవ్వారు.
ఇప్పటి వరకు అన్ని నీటి పారుదల ప్రాజెక్టులలో (నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల etc.) తెలంగాణ ప్రాంతమే ముంపునకు గురయింది, నష్టపోయింది. అయినా ఆంధ్రా ప్రాంతం వారు, తెలంగాణ ఏదో తమవల్లే బాగుపడినట్లుగా ప్రవర్తిస్తారు. ఈ ప్రాజెక్టులో కూడా ఉదయసముద్రం, నార్లాపూర్ రిజర్వాయర్ల కెపాసిటీని పెంచవలసి ఉంటుంది. అంటే దాదాపుగా కాలువలకు, రిజర్వాయర్లకు భూసేకరణ మొత్తం తెలంగాణాలోనే జరుగుతుంది. పైగా ఇక్కడి ప్రాంతంలోని రిజర్వాయర్లపై, కాలువలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా హక్కులు కల్పించవలసి వస్తుంది. ఇప్పుడు ఉమ్మడిగా ప్రాజెక్టు చేపడితే ఎక్కువ విమర్శలు వారి నుండే ఎదురవుతాయి.
ఆ ప్రాజెక్టును కొంత తక్కువ కెపాసిటీతో చేపట్టి, తెలంగాణలోని నాగార్జున సాగర్ ఆయకట్టుకు, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలలోని ఇతర ప్రాంతాలకు ఉదయసముద్రం నుండే నీళ్లు ఇవ్వవచ్చు. దానికి నాగార్జున సాగర్‌ను నింపవలసిన అవసరం లేదు. అలాగే భవిష్యత్తులో ఉదయసముద్రం నుండి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు శ్రీశైలం ప్రాజెక్టును నింపకుండా తక్కువ కెపాసిటీతో సొరంగం ద్వారా గాని, పైపులైన్ల ద్వారా గాని అక్కడ ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లు చెరువులు నింపుకోవచ్చు. అనవసరంగా ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జున సాగర్‌ను గాని, శ్రీశైలంను గాని నింపడం ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉత్తరాంధ్ర మరియు కోస్తా జిల్లాలకు పోలవరం నుండి తమ సొంత ఎత్తిపోతల పథకాలను రూపొందించుకోవచ్చు. కాని, రాయలసీమ ప్రాంతానికే నీటి తరలింపు కష్టమవుతుంది.
దుమ్ముగూడెం నుండి ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా ఆయకట్టుకు నీటి తరలింపును తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ గారు, తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు తరలింపు చేపడితే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణకు రావలసిన మరింత వాటా వాదన బలహీనమవుతుంది. అప్పుడు ఏ ప్రాతిపదికన దుమ్ముగూడెం ప్రాజెక్టును వ్యతిరేకించారో, ఆ అంశాలన్నీ ఇప్పటికీ చెల్లుబాటయ్యే పరిస్థితి ఉంది కదా?, ఈ విషయంపై తెలంగాణాలో కూడా తనకు పేరు రావడానికి రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నాడని విమర్శలు మొదలవుతాయి.
ఆంధ్రా ప్రభుత్వమే రాయలసీమకు నీటి కోసం విజ్ఞప్తి చేసినప్పుడు పరిశీలించవచ్చు. కాని, తెలంగాణ ముఖ్యమంత్రే దుమ్ముగూడెం/ రాంపూర్ ఎత్తిపోతలను ప్రతిపాదించడం కందకు లేని దురద సామెతను గుర్తు చేస్తుంది.
Post a Comment