తెలంగాణాలో బలపడే అవకాశాలున్నాయని గ్రహించిన భారతీయ జనతాపార్టీ అధినాయకత్వం, సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్ష్యుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. శంషాబాద్‌లో సామాన్య కార్యకర్త ఇంట సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఆయన, ఒక హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులను కలిసి, వారినుద్ధేశించి ప్రసంగించారు. పార్టీని బలోపేతం చేయడం కోసం నెలకోకసారి తెలంగాణకు తాను వస్తానని, నెలకు ఇద్దరు కేంద్ర మంత్రులను రాష్ట్రానికి పంపుతానని కూడా తెలిపారు.
ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే, రాష్ట్రంలో బలపడే దిశగా బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. కేంద్ర హోంమంత్రి గారే స్వయంగా వచ్చినా, కేవలం తమ పార్టీ అంతర్గత కార్యక్రమంగానే నిర్వహించారు. బహిరంగ సభలు పెట్టడంగాని, అధికార టిఆర్ఎస్ పార్టీని, కెసిఆర్‌ను విమర్శించడంగాని చేయలేదు. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడం మరియు ముందుగా పార్టీని పటిష్టపరుచుకున్న తరువాతే దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకోవడం దీనికి కారణాలుగా భావిస్తున్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడు కెసిఆర్‌ను ప్రశంసించి వెళ్లేవారు. పార్టీ స్థానిక నాయకులు కెసిఆర్ గారిని విమర్శించడం, కేంద్ర మంత్రులు ప్రశంసించడంతో కార్యకర్తలలో అయోమయం నెలకొంది. ఇప్పుడు కేంద్రమంత్రులు కూడా ప్రశంసించకుండా కూడా ఆదేశాలు జారీచేసినట్లు వివరించారు.
రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉన్న విషయాన్ని అమిత్ షా గారు గ్రహించారు. అందుకే సభ్యత్వాల్ని భారీగా పెంచాలని, అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులనీ చేర్చుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. 20 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని కూడా సూచించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 20 శాతం ఓట్లు వచ్చాయని, 2023 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, మూడింట రెండొంతులు మెజార్టీ సాధించాలని అన్నారు.
భారీగా 'కమలం ఆపరేషన్ ఆకర్ష్?'
రెండు, మూడు సంవత్సరాల క్రితం వరకు ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి బలహీనంగా ఉండేది. ఇతర పార్టీల నాయకులను ఆకర్షించి క్రమంగా బలపడిందనే విషయాన్ని గత లోక్ సభ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. అక్కడ రామ్ మాధవ్ గారే ఆపరేషన్ ఆకర్ష్ ను నిర్వహించారు. ఇదే విధానాన్ని ఇక్కడ అమలు చేయడంలో భాగంగా ఆయన నెలలో కొన్ని రోజులు హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారు. తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నాలలో ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఇతర పార్టీలలో అసంతృప్తితో ఉన్న నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు ఇప్పటికే భారీగా మొదలుపెట్టారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిగారిని ఆకర్షించగలిగిన పార్టీ, కడియం శ్రీహరి, మర్రి శశధర్ రెడ్డి లను కూడా చేర్చుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. కాని, వారిద్దరూ ఖండించారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి లాంటి నేతలను ఆకర్షించడానికి వారు ప్రయత్నించి విఫలం చెందినట్లు కనిపిస్తుంది. కాని, వారి ఆకర్ష్ ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.
టిఆర్ఎస్ విధానాలే బిజెపి బలపడడానికి కారణమా?
- గత అయిదేళ్లుగా టిఆర్ఎస్ నేతలు, కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి సహకరించట్లేదని గాని, నిధులు కేటాయించడం లేదనిగాని, బిజెపి పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యతనిస్తుందని గాని, విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చడంలేదని గాని పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. పైగా నోట్ల రద్ధు, జిఎస్టి లాంటి విషయాలలో మరియు రాష్ట్రపతి ఎన్నికలలో సహకరించారు. అప్పట్లో బిజెపిని విమర్శిస్తే కాంగ్రెస్ బలపడుతుందేమోనన్న అనుమానంతో వారు అలా వ్యవహరించినట్లు తెలుస్తుంది.
- చాలామంది తెలంగాణ వాదులలో కూడా టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి ఉంది. కెసిఆర్ గారు ఎన్నికల సమయంలో తెలంగాణా వాదాన్ని ప్రచారం చేయడం, ఎన్నికలు ముగిసిన అనంతరం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ప్రాధాన్యతను ఇస్తున్నారని వారు భావిస్తున్నారు.
- ఎంఐఎంతో టిఆర్ఎస్ దోస్తీని తమ భావజాల వ్యాప్తికి ఉపయోగించుకునే అవకాశముండడం కూడా బిజెపికి కలిసి వచ్చింది.
- రాష్ట్రంలో ఇప్పటివరకు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఫిరాయింపులు ప్రోత్సహించడం ద్వారా బలహీనపరిచారు. దానితో పాటు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రజలలో కొంత వ్యతిరేకతను తెచ్చుకున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నవారు, ఓటు వేసే విషయంలో రాజకీయ శూన్యత నెలకొంది. దీనిని భర్తీ చేసే దిశలో బిజెపి బలపడింది.
మతపరమైన భావోద్వేగ రాజకీయాలు చేయడంలో బిజెపిని ఎదుర్కునే సత్తాగాని, సోషల్ మీడియా వనరులుగాని ఇప్పటి వరకైతే తెలంగాణ రాష్ట్రసమితికి లేవు. గత ఎన్నికలలో కెసిఆర్ గారు కరీంనగర్ సభలో చేసిన వ్యాఖ్యను అద్భుతంగా ఉపయోగించుకోవడంతోనే ఈ విషయం స్పష్టమైంది.
లోక్ సభ ఎన్నికలకు, శాసన సభ ఎన్నికలకు స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. బిజెపి 20% ఓట్లు సాధించామని చెపుతున్నా, కాంగ్రెస్ పార్టీ 30% ఓట్లు సాధించింది. ఇప్పటికే రెండు పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రంలో బిజెపి సంస్థాగతంగా బలపడడం కష్టమే. ఇకనుండి కెసిఆర్ గారు బిజెపిపైన కూడా దృష్టి సారించే అవకాశముంది. ఇలాంటి పరిస్థితులలో వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి ప్రతిపక్ష స్థానం దక్కించుకోవాలన్నా రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు సంభవించాలి.
Post a Comment