మరింత పెద్దదైన ధోని గ్లోవ్స్ వివాదం

బిసిసిఐ మరియు కేంద్ర మంత్రి కూడా తలదూర్చడంతో ధోని గ్లోవ్స్‌పై కనిపించిన బలిదాన్‌ గుర్తు వివాదం మరింత రాజుకుంది. మహేంద్రసింగ్‌ ధోనీ టెరిటోరియల్‌ ఆర్మీ ప్యారాచూట్‌ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్‌ కల్నల్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే. జూన్ ఐదవ తేదీన దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ధోని ధరించిన గ్లోవ్స్‌పై బలిదాన్‌ గుర్తు కనిపించింది. ప్రసారకర్తలు దానిని మాగ్నిఫై చేసి పదే పదే చూపించారు. 

మనదేశ క్రికెట్ అభిమానులు ధోని దేశభక్తిని మెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనితో అది సైన్యానికి సంబంధించినదని గ్రహించిన ఐసిసి, ఆ గుర్తును తొలగించాలని బిసిసిఐకి సూచించింది. ఐసిసి నిబంధనల ప్రకారం ఆటగాళ్ల దుస్తులపై, క్రీడా ఉపకారణాలపై మత, వాణిజ్య, సైనిక చిహ్నాలు ఉండకూడదు.

ధోనీ వేసుకున్న గ్లోవ్స్‌ విషయంపై బిసిసిఐ అతనికి మద్దతుగా నిలిచింది. అతడు ప్రపంచకప్‌ మొత్తం ఇవే గ్లోవ్స్ ఉపయోగించడానికి అనుమతించాలని ఐసిసికి అధికారిక అభ్యర్థన పంపింది. సిఓఏ వినోద్‌ రాయ్‌ మాట్లాడుతూ ధోనీ ధరించింది పారామిటలరీ బలిదాన్ గుర్తు కాదు, అందులో ఉండాల్సిన బలిదాన్ అనే అక్షరాలు లేవు, అందువల్ల నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదు. అని పేర్కొంటూ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ కు ముందే బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీ ఈ విషయంపై స్పష్టత ఇస్తారని అన్నారు.  ఐపిఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌శుక్లా మాట్లాడుతూ ఈ విషయంలో ఐసిసి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. బలిదాన్‌ గుర్తులు కలిగిన గ్లోవ్స్‌ను ధరించేందుకు ధోనీకి అనుమతివ్వాలని, ఇందులో ఎలాంటి వాణిజ్య అంశాలు లేవని, ఇది కేవలం జాతి గౌరవమని అన్నారు.

భారత అభిమానులు #DhonikeepTheGlove అనే హ్యాష్‌ట్యాగ్‌తో ధోనికి సామాజిక మాధ్యమాల్లో భారీగా మద్ధతు ప్రకటిస్తున్నారు. ఈ విషయంపై అనేక మంది మన దేశ సెలబ్రిటీలు, కేంద్రమంత్రి కిరణ్ రిజుజు కూడా వ్యాఖ్యానించి గ్లోవ్స్‌ వివాదాన్ని జాతి గౌరవ వివాదంగా మార్చేశారు. ఈ విషయంపై ఐసిసి జనరల్‌ మేనేజర్‌ క్లైరే ఫర్లాంగ్‌ మాట్లాడుతూ, బిసిసిఐని ఆ గుర్తులను తొలగించాలని కోరామని చెప్పారు. అయితే బిసిసిఐ స్పందనను అత్యున్నత స్థాయికి తీసుకెళతామని, అక్కడే తుది నిర్ణయం జరుగుతుందని వివరించారు. 

కాగా ఐసిసి, ఈ గుర్తు ధరించడంపై సానుకూలంగా స్పందించే అవకాశం లేనట్లు సమాచారం. బిసిసిఐ కూడా మరింత దూకుడు ప్రదర్శించకుండా వదిలేస్తేనే మేలు. ఇవాళ మనకు అవకాశమిస్తే రేపు మన దేశంతో జరిగే  మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెటర్లు కూడా తమ దేశ సైన్యానికి సంబంధించిన గుర్తులు ధరిస్తే మన మనోభావాలు ఎలా ఉంటాయి? అని ఒకసారి ఆలోచించుకోవాలి. క్రీడల విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తేనే అందరికీ హుందాగా ఉంటుంది.   

0/Post a Comment/Comments

Previous Post Next Post