ఐదుగురు ఉపముఖ్యమంత్రులా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ 25 మంది మంత్రులతో పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తామని,  ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు మరియు మైనారిటీ వర్గాలకు చెందిన ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారని తెలియచేశారు. అంతేకాక, ఈ మంత్రివర్గంలో అధిక శాతం మందికి  రెండున్నర ఏళ్ళు మాత్రమే పదవీకాలమని, ఆ తరువాత కొత్తవారికి అవకాశం కల్పిస్తామని అన్నారు. 

ఇప్పుడు ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించడం వెనుక కుల, మత సమీకరణాలను బ్యాలన్స్ చేయడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాంత, కుల సమీకరణలలో భాగంగానే ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమించుకున్నారు. 

దేశవ్యాప్తంగా రాజకీయ సంకీర్ణాల్లో భాగంగా రెండవ పార్టీ వారికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే సాంప్రదాయం ఉంది. కర్ణాటక, బీహార్‌లలో మనం దీనిని చూడవచ్చు. తెలంగాణాలో కూడా మత, కుల ప్రాతిపదికన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను మనం చూశాం. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో  పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ప్రాంతీయ సమీకరణాల కోసమే ఉప ముఖ్యమంత్రి పదవిని పేర్కొన్నారు.  

అసలు ప్రజా బాహుళ్యంలో ఉపముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్ష్యత వహించటం లాంటి విధులు నిర్వహిస్తారనే అభిప్రాయం ఉంది. కానీ ఆ సమయంలో ముఖ్యమంత్రి సూచించిన వ్యక్తి మాత్రమే ఆ విధులు నిర్వహించాలి.  రాజ్యాంగ పరంగా ఉపముఖ్యమంత్రికి ఎటువంటి ప్రత్యేక అధికారాలు గాని, మంత్రుల కన్నా ఎక్కువ హోదా గాని, ప్రోటోకాల్ గాని లేవు. కేవలం ఆ ప్రాంత/కుల/మత ప్రజలను మభ్యపెట్టేందుకే ఇప్పుడు ఉపముఖ్యమంత్రి అనే పదవి సాధనంగా మారింది.  

0/Post a Comment/Comments

Previous Post Next Post