ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో 2014, జూన్ రెండవ తేదీన ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. ఇది జరిగి ఇప్పటికి ఐదేళ్లు అయిన సందర్భంలో వారి ఆశలు, ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయో ఒకసారి సమీక్షిద్దాం.
తెలంగాణ ఉద్యమం విభిన్న అంశాల కలబోతగా సాగింది. కొంతమంది దీనిని తమ అస్థిత్త్వానికి, ఆత్మ గౌరవానికి ప్రతీకగా, ఇంకొంత మంది పరాయి పాలనలో తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేక పోరాటంగా, మరికొంత మంది తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుకునే సాధనంగా భావించారు. వీరిలో కొంతమంది ఆశలు పూర్తిగా, ఇంకొంతమందివి పాక్షికంగా నెరవేరగా, మరికొంతమందిని నిరాశ పరిచింది.
తెలంగాణ ఏర్పాటును అస్థిత్త్వానికి, ఆత్మ గౌరవానికి సంబంధించినదిగా భావించే వారి లక్ష్యం ఈ ఐదేళ్ళలో దాదాపుగా నెరవేరింది. వీరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది అహంకార, ఆధిపత్య భావజాలానికి అడ్డుకట్ట వేయడానికే తెలంగాణను కోరుకున్నారు. తెలంగాణ వారికి పరిపాలన చేతకాదు. ఇక్కడి ప్రజలకు వ్యవసాయం రాదు. పంటలు పండించడం మేమే నేర్పించాం, 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ అభివృద్ధి అంతా మావల్లే కొన్ని సంవత్సరాలలో జరిగింది. వీరు మాట్లాడేది అసలు తెలుగే కాదు.... వంటి మాటలు వినవలసిరావడం వల్లే వీరు తెలంగాణ ఏర్పాటు జరగాలనుకున్నారు.
అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో చిన్న రాష్ట్రం కాబట్టి వామపక్ష తీవ్రవాదం పెరుగుతుందని, మత ఘర్షణలు జరుగుతాయని, విద్యుత్ సమస్యలతో విఫల రాష్ట్రంగా మారుతుందని, అభివృద్ధి ఆగిపోతుందని, ఐటీ వృద్ధి రేటు పడిపోతుందని, బ్రాండ్ హైదరాబాద్ కు నష్టం వాటిల్లుతుందని మరియు సీమాంధ్రులపై దాడులు జరుగుతాయని విపరీత ప్రచారాలు జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రితో సహా ఇతర నేతలు కూడా ఇలాంటి దుష్ప్రచారాలు చేసారు.
- ఈ ఐదు సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రం మనుగడ విషయంలో ఉన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.
- తెలంగాణ భాషకు గౌరవం పెరిగింది. సంస్కృతి మరియు పండగలకు పెద్దపీట వేయడం జరిగింది.
- వామపక్ష తీవ్రవాదం దాదాపుగా కనుమరుగయ్యింది. ఆంధ్రప్రాంతంలో ఈ తరహా కొన్ని ఘటనలు జరిగాయి గాని, ఈ ప్రాంతం పూర్తి ప్రశాంతంగా ఉంది.
- ప్రజలు సామరస్యంగా ఉన్నారు. మతఘర్షణలు అసలే తలెత్తలేదు.
- కొద్దికాలం లోనే విద్యుత్ సమస్యల నుండి రాష్ట్రం గట్టెక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పవర్ హాలిడేలు కూడా పోయి, గ్రామాలకు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ను అందించే స్థాయికి చేరింది.
- రాష్ట్ర వృద్ధి రేటు మునుపెన్నడూ లేని స్థాయికి చేరింది. ఐటీ వృద్ధి రేటు పెరిగింది. బ్రాండ్ హైదరాబాద్ మరింత పెరిగి రియల్ ఎస్టేట్ రేట్లు కూడా ఊపందుకున్నాయి.
- సీమాంధ్ర ప్రజలు రెండవ శ్రేణి పౌరులుగా ఉండవలసివస్తుందని, వారిపై దాడులు జరుగుతాయని, భూములు ఆస్తులు లాక్కుంటారని జరిగిన ప్రచారం కూడా అసత్యమని తేలింది.
- రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ప్రాంత నిధులు పూర్తిగా ఈ ప్రాంతంపైనే ఖర్చవుతున్నాయి.
- తెలంగాణ వాటాకు వచ్చే నీళ్లను వినియోగించుకోవడానికి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. కాళేశ్వరంతో సహా ఎక్కువశాతం ప్రాజెక్టులు రానున్న ఐదేళ్ళలో పూర్తి కానున్నాయి. నీళ్ల విషయంలో ఇప్పటి వరకు ప్రజలకు అందిన ఫలాలు మాత్రం స్వల్పమే కానీ భవిష్యత్తు మాత్రం ఆశాజనకమని చెప్పవచ్చు.
- నియామకాల విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్ర ఏర్పాటుతో ప్రభుత్వ రంగంలో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం టాస్క్ పేరుతో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది, కానీ తరువాత దానిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఫలితాలు కనిపించలేదు.
కొత్త రాష్ట్రంలో పాలన విషయంలో చాలావరకు ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన విధానాలే కొనసాగుతున్నాయి. కెసిఆర్ గారు ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన వారినే ఎక్కువగా ప్రోత్సహించారు. రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహించడం, ప్రశ్నించే వారిని పక్కన పెట్టడం, అణచి వేయడం, నిరంకుశంగా వ్యవరించడం లాంటి వాటితో ఉద్యమ స్ఫూర్తిని ఆయనే దెబ్బతీసారు. కొంతకాలం క్రితం జరిగిన ఎన్నికలలో ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల ప్రభావం మరియు అవతల పార్టీలో ఇంతకన్నా ఎక్కువ మంది తెలంగాణ వ్యతిరేకులు ఉండటంతో అసంతృప్తి ఉన్నప్పటికీ మళ్ళీ కెసిఆర్ గారే గెలుపొందగలిగారు.
కేజీ టు పీజీ ఉచిత విద్య అంటూ చేసిన ప్రచారం కార్యరూపం దాల్చలేదు. ఇంటర్మీడియట్ విద్య ఇంకా కార్పొరేట్ చేతుల్లోనే ఉంది. ఈ మధ్య అస్తవ్యస్తంగా జరిగిన ఫలితాల ప్రకటన రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చింది. భారీగా ఉద్యోగాల కల్పన, రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవు అనే హామీలు అటకెక్కాయి. ప్రభుత్వ వైద్యం కొంత మెరుగుపడినా అంచనాలను అందుకోలేక పోయింది. పాక్షిక ఫలితాలనిచ్చిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఈ విధంగా ఉద్యమ స్పూర్తితో పాలన సాగుతుందనే భావన ఉన్నవారు మాత్రం తీవ్ర నిరాశ చెందారు.
Post a Comment