భారత్ - అమెరికా సంబంధాలు: వెన్నెముక లేని విదేశాంగ విధానం

పాకిస్తాన్‌ విషయంలో దృఢంగా వ్యవహరిస్తున్న భావన కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం, అమెరికాతో  సంబంధాల విషయంలో అస్తవ్యస్త విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది. మనదేశానికి జిఎస్‌పి (General System Preferences) ద్వారా లభించే పన్ను మినహాయింపులను అమెరికా తొలగించడంతో విదేశాంగ విధానంపై మళ్ళీ చర్చ మొదలయింది. 
  • ఇండియాతో తమకు ఉన్న వాణిజ్య లోటును తగ్గించుకునే దిశగా చేపట్టిన చర్యలలో భాగంగా, అమెరికా మనదేశానికి ఉన్న జిఎస్‌పి సౌకర్యాన్ని రద్దు చేసింది. ఈ జిఎస్‌పిలో భాగంగా, అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి  కొన్ని రకాల వస్తువుల దిగుమతి సుంకంపై అమెరికా పూర్తి మినహాయింపును ఇస్తుంది. 70వ దశకం నుండి ఈ విధానం అమలులో ఉంది. మన దేశ 39 వేల కోట్ల రూపాయల ఎగుమతులపై దీని ప్రభావం ఉండనుంది. హార్లే-డేవిడ్సన్ బైకులు, కార్ల దిగుమతులపై మనదేశంలో ఉన్న పన్నులను సాకుగా చూపి ఈ చర్యకు ఉపక్రమించింది. దీనిపై మనదేశ స్పందన అతిపేలవంగా ఉంది. కేవలం 'అమెరికాతో దృఢమైన వాణిజ్య, రక్షణ సంబంధాల విషయంలో కట్టుబడి ఉన్నాం' అనే ప్రకటనతో సరిపుచ్చింది.   
  • భారతదేశ ప్రాదేశిక జలాలలోకి, వాయుమార్గాలలోకి, నౌకాశ్రయాలలోకి, వైమానిక స్థావరాలలోకి అమెరికన్ నౌకలు, విమానాలు ప్రవేశించి ఇంధనం నింపుకునే, మరమత్తులు జరుపుకునే వెసులుబాటును Logistics Exchange Memoranda of Agreement (LEMOA) ఒప్పందం ద్వారా మోడీ ప్రభుత్వం కల్పించింది. ఇందులో మనదేశానికి ఉన్న వెసులుబాటు ఏమిటంటే మన దేశం కూడా అమెరికన్ నౌకాశ్రయాలను, వైమానిక స్థావరాలను ఉపయోగించుకోవచ్చు. మనకు పసిఫిక్, అట్లాంటిక్ తీరప్రాంతాల్లో ఉన్న స్థావరాలతో పెద్దగా ఉపయోగం ఉండకున్నా ఈ ఒప్పందంపై ప్రభుత్వం సంతకం చేసింది. 
  • అమెరికా శత్రువులతో మనదేశం వాణిజ్యం చేయకూడదని ఆ దేశ ఒత్తిడితో ఇరాన్ మరియు వెనిజులాల నుండి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేసింది. ఇరాన్ మనకు అతి సమీపంగా ఉన్న మరియు మనదేశానికి భారీ డిస్కౌంట్లతో అతి చౌక ధరలకు చమురును సరఫరా దేశం. దీనివలన ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగి మన వినియోగదారులకు భారంగా మారింది. ఇక వెనిజులా మన దేశంలో భారీ చమురు రిఫైనరీని నిర్వహించే రిలయన్స్ ఇండస్ట్రీస్ కు పెద్ద సరఫరాదారు. 
  • ఇలా వారి శత్రువులతో వాణిజ్యం చేయకూడదని CAASTA (Countering America's Adversaries Through Sanctions Act) చట్టంతో మన దేశానికి తీవ్ర నష్టం కలిగించే అమెరికా, మన శత్రువైన పాకిస్తాన్‌కు మాత్రం ఉగ్రవాదులతో యుద్ధం చేయడం పేరిట దూర శ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణులతో కూడిన F-16 యుద్ధ విమానాలను అందించింది. దూర శ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు ఉగ్రవాదులతో యుద్ధానికి ఎలా ఉపయోగపడతాయి అని అమెరికా నాయకత్వం నుండి ఇప్పటివరకు వివరణ లేదు. వీటినుపయోగించే గత ఫిబ్రవరి 27న మన మిగ్ యుద్ధ విమానాన్ని కూల్చి పైలట్ అభినందన్‌ను బందీగా పట్టుకున్నారు.   
  • ఇదే CAASTA చట్టంతో మనదేశం రష్యా నుండి కొనుగోలు చేయనున్న S - 400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని రద్దు చేయించడానికి ప్రయత్నిస్తుంది. మన దేశం ఇజ్రాయెల్ నుండి రక్షణ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అమెరికా అడ్డుకుంది. అంతే కాక THHAD రక్షణ వ్యవస్థను మన దేశానికి అమ్మడానికి అప్పట్లో సమ్మతించని అమెరికా, ఇప్పుడు S - 400 ఒప్పందం రద్దు చేసుకుంటే అమ్ముతానని అంటోంది. 
  • గత సంవత్సరం మనదేశ స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచింది. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మన దేశ ఐటీ సంస్థలకు H1B వీసాలను పరిమితం చేసింది. ఇప్పుడు H4 వీసాలపై పనిచేసే సౌకర్యాన్ని కూడా రద్దు చేసే ప్రక్రియను ఆరంభించింది. ఇవన్నీ చేస్తూ మరోవైపు భారత దేశం తమకు రక్షణ, మరియు వాణిజ్య రంగాలలో కీలకమైన భాగస్వామి అని చెబుతుంది. కానీ, మన దేశం నుండి మాత్రం ఇంతవరకు ధీటైన ప్రతిస్పందన మాత్రం కనిపించడం లేదు.
1947లో భారత్ స్వతంత్య్ర దేశంగా రూపొందిన నాటి నుండి సార్వభౌమత్వంతో కూడిన స్వతంత్య్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ వచ్చింది. దీనిని నెహ్రూ మొదలుపెట్టడంతో  నెహ్రూవియన్ విధానంగా పేరుపొందింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  ఈ విధానంలో అమెరికా విషయంలో కొన్ని సడలింపులు తీసుకున్నట్లు కనిపిస్తుంది. మనదేశ ప్రయోజనాల విషయంలో ఈ దేశంతో మోడీ ప్రభుత్వం మరింత  దృఢంగా వ్యవరించవలసిన అవసరం ఉంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post