ప్రభుత్వంలో APSRTC విలీనం - ఏం జరగనుంది?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత, ఆయన నేతృత్వంలో జరిగిన తొలి క్యాబినెట్ భేటీలోనే APSRTCని ప్రభుత్వంలో విలీనం చేయాలని తీర్మానించారు. ప్రభుత్వం ఇంత తొందరగా విలీన నిర్ణయం తీసుకోవడం, ఎంతో కాలంగా ఈ డిమాండ్ చేస్తున్న సంస్థ కార్మిక సంఘాలనే ఆశ్చర్యపరచింది. యూనియన్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, అధికారులు విలీనం కోసం సంసిద్ధమవుతున్నారు.    

విలీనాన్ని గురించి అధ్యయనం చేసేందుకు, విధి విధానాలు రూపొందించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో APSRTC మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేసిన మాజీ IPS అధికారి ఆంజనేయ రెడ్డి ఈ కమిటీకి అధ్యక్ష్యత వహించనున్నారు. ప్రభుత్వ ప్రతినిధులు, ఆర్టీసి అధికారులు మరియు కార్మిక సంఘాల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉండనున్నారు.        

APSRTC చరిత్ర 

1932లో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం స్టేషన్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్ (NSR -RTD)గా ఈ సంస్థ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ సమయంలో సంస్థలో మొత్తం 27 బస్సులు మరియు 166 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇది 1951 లో హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ చేతికి వచ్చింది. 1958 లో, దీనిని ASPRTC పేరుతొ ప్రజా రవాణా సంస్థగా మార్చారు. రాష్ట్ర విభజన తరువాత ఈ సంస్థలో కొంతభాగం విడిపోయి TSRTCగా రూపొందినా, మన రాష్ట్రానికి సంబంధించి ASPRTCగానే కొనసాగింది. 

ప్రస్తుతం APSRTC గురించి అంకెలలో 
 • 12,027 బస్సులు 
 • 14,123 గ్రామాలకు రవాణా సౌకర్యం 
 • సంవత్సరానికి 237.2 కోట్ల మంది ప్రయాణీకులు  
 • 53,261 మంది ఉద్యోగులు
 • 128 బస్సు డిపోలు 
 • పేరుకుపోయిన 7000 కోట్ల రూపాయల నష్టాలు 
విలీనం తదనంతర పరిణామాలు 

ఇంత భారీస్థాయిలో నష్టాలు పేరుకుపోవడంతో సంస్థ మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. దానితో ట్రేడ్ యూనియన్లు విలీనం కోసం డిమాండ్ చేశాయి. విలీనం వలన కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. కానీ, వీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనుండడంతో కార్మిక చట్టాలు వీరికి వర్తించవు. హక్కులను కోల్పోతారు. రేపు సంస్థకు లాభాలు వచ్చినా బోనస్ డిమాండ్ చేయలేరు. వేతనాలు సవరణ కమిషన్ ద్వారా మాత్రమే నిర్ధారితమవుతాయి. సంస్థ ఆస్తులన్నీ ప్రభుత్వ పరమవుతాయి. ఇప్పటిలా ఈ సంస్థ ఆస్తులన్నీ, సంస్థ కోసమే వాడాలని ప్రభుత్వాన్ని నిర్బంధించలేరు. ప్రభుత్వ ఆధ్వర్యంలోకి సంస్థ వెళ్తే, సామర్థ్యం తగ్గి ప్రైవేటు ప్రజా రవాణా మరింతగా విస్తరించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే లాభసాటిగా ఉన్న అన్ని రూట్లలో ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. నష్టాలు వచ్చే రూట్లలో బస్సులను సామాజిక బాధ్యతగా ప్రభుత్వం నడుపుతుంది.   

నష్టాలపై అధ్యయనం 

రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వంలో సంస్థను నష్టాలనుండి బయట పడేసేందుకు ఐఐఎం సంస్థతో అధ్యయనం చేయించారు. ఆ అధ్యయనంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసినా నివేదిక అమలుకు నోచుకోలేదు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు:    
 • ప్రైవేటు బస్సులను నియంత్రించాలి 
 • బస్సుపాస్‌లు తదితర సబ్సిడీల భారాన్ని ప్రభుత్వమే భరించాలి. 
 • నష్టాలు వచ్చే రూట్లలో తిరిగే బస్సులపై పన్నులు తొలగించాలి  
 • అద్దె బస్సుల పద్ధతికి స్వస్తి పలకాలి.   
 • రెగ్యులర్‌గా వాడే టైర్లు, ఇతర విడిభాగాల సేకరణలో పారదర్శక విధానాలు పాటించాలి, అవినీతిని నిర్మూలించాలి. 
 • ఆర్టీసి స్ధలాలను వాణిజ్య సరళిలో ఉపయోగించుకోవాలి
 • వస్తు రవాణాను రైల్వే పద్దతిలో క్రమబద్దీకరించి లాభాలు ఆర్జించాలి. 
అంతర్గత సామర్థ్యం పెరిగి, లాభాలు రాకపోతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నా సంస్థ విస్తరణ జరుగదు. కాబట్టి విలీనంతో పాటుగా సంస్థను లాభాల బాట పట్టించే చర్యలు కూడా తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు ఈ విలీనాన్ని భరించే స్థితిలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి లేదు. నివేదిక వచ్చి విలీనం పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో ఖచ్చితంగా చెప్పలేము.

0/Post a Comment/Comments

Previous Post Next Post