తనదాకా వస్తే....

దేశం కోసం అందరూ త్యాగాలు చేయాలి. ప్రభుత్వ విధానాల కోసం కష్టనష్టాలను భరించాలి. దేశాన్ని పరిపాలిస్తున్న మేము మాత్రం దీనికి అతీతులం అన్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వైఖరి ఉంది. 

మోడీ గారు పాకిస్తాన్ గగనతలం మీదుగా విమాన ప్రయాణం చేయడానికి భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనను, ఆ దేశం మన్నించింది. ఆయన జూన్ 13 మరియు 14వ తేదీలలో కిర్ఘిజిస్తాన్ రాజధాని బిష్‌కేక్‌లో జరగనున్న SCO సదస్సుకు హాజరవనున్నారు. పాకిస్తాన్ ప్రధాని కూడా ఆ సమావేశానికి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 26న బాలాకోట్ దాడుల తరువాత మనదేశ విమానాలు పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రయాణించడాన్ని ఆ దేశం నిషేధించింది. పాకిస్తాన్ విమానాలను కూడా మనదేశం నిషేధించింది. 

బిష్‌కేక్‌లో రెండు దేశాధినేతల మధ్య సమావేశం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం అభ్యర్థించగా మన దేశం తోసిపుచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకారం అందించడం ఆపేవరకు ఆ దేశంపై కఠినవైఖరిని అవలంభిస్తామని ప్రకటించింది. ఇదే సమావేశంలో చైనా అధ్యక్ష్యుడు జిన్‌పింగ్ గారితో మోడీ ప్రత్యేకంగా సమావేశమవనున్నారు. 

పాకిస్తాన్‌తో కఠిన వైఖరి అవలంభించాలి అనుకున్నప్పుడు పూర్తిగా కట్టుబడి ఉండాలి గాని, కేవలం రెండు మూడు  గంటల సమయం కలసి వస్తుందని ఆ దేశ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అనుమతి కోరడం ఎందుకు? 

రోజూ వేలాది మంది మన దేశ ప్రయాణికులు దూరం ఎక్కువైనా, 2-3 రెట్ల చార్జీలు పెట్టుకుని మరీ చుట్టూ తిరిగి వెళుతున్నారు కదా?, మన దేశ విమానయాన సంస్థలు వందల కోట్ల రూపాయలు నష్టపోయినా భరిస్తున్నాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఎయిర్-ఇండియా కూడా దీనివలన 300 కోట్లకు పైగా నష్టాన్ని భరించవలసి వచ్చింది. మోడీగారు కూడా అందరిలా కొంత ఎక్కువ సమయం తీసుకుని చుట్టూ తిరిగి వెళితే సంఘీభావం ప్రకటించినట్లు అయ్యేది, హుందాగా కూడా ఉండేది. అందరినీ కష్ట నష్టాల పాలు చేసి, కేవలం తన సొంత సమయం కొంత  కలసివస్తుందని పాకిస్తాన్‌ను అభ్యర్థించడం ఆ దేశంపై కఠిన వైఖరి ఎలా అవుతుంది?  

0/Post a Comment/Comments

Previous Post Next Post