ఎవరు తీసుకున్న గోతిలో....

ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించటం, రాజకీయాలకు స్పీకర్ స్థానాన్ని వాడుకోవటం వంటి సాంప్రదాయాలను కాంగ్రెస్ పార్టీయే ప్రారంభించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీ నుండి, పరిమిత సంఖ్యలో ఇతర పార్టీల నుండి ఆకర్షించారు. ఆ సమయంలో కూడా ఇప్పుడు కెసిఆర్ గారు అనుసరిస్తున్న పద్దతిలోనే ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి మరీ తమ పార్టీలో చేర్చుకున్నారు. దానికి ఆపరేషన్ ఆకర్ష్ అనే ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. అయితే ఆ సమయంలో వారిని రాజీనామా చేయించి తమ పార్టీ ద్వారా ఎన్నికయ్యేలా చూసుకునేవారు.  

ఇక రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి గార్లు సీఎంలుగా ఉన్న కాలంలో, కాంగ్రెస్ పార్టీ స్పీకర్ స్థానానికి ఉన్న అధికారాలను తమ ప్రయోజనాల కోసం వాడుకోవడం మొదలుపెట్టింది. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా/ వ్యతిరేకంగా చేసిన రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్‌కు ఉన్న విచక్షణ/ అధికారం పేరిట పెండింగులో ఉంచేవారు. కాంగ్రెస్ పార్టీయే రాజకీయ ప్రయోజనాలకోసం మరియు ఉద్యమాన్ని చల్లబరచడం కోసం, తమ ఎమ్మెల్యేల చేతే రాజీనామా చేయించి మరీ  ఈ ఎత్తుగడలను అనుసరించేది. కెసిఆర్ గారు ఈ విషయమై కోర్టు గడప తొక్కినా స్పీకర్ విచక్షణను ప్రశ్నించజాలమనే తీర్పు వచ్చింది. 

అధికారంలోకి వచ్చిన తరువాత కెసిఆర్ గారు 'ఆపరేషన్ ఆకర్ష్' మరియు 'స్పీకర్ విచక్షణ' రెండింటిని మేళవించి మరీ ఎన్నికలకు కూడా వెళ్లకుండా కొత్త తరహా ఎత్తుగడలకు తెరతీశారు. అప్పట్లో తమను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నష్టపరిచి, ఏకంగా శాసన సభలో పార్టీని విలీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇది అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికం, రాజకీయ విచ్చలవిడితనం అని నినదిస్తున్న భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, షబ్బీర్‌లు, ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇవే విధానాలపై నోరు మెదపలేదు, సరి కదా సహకరించారు. పైగా దీనిపై ప్రజాస్వామ్యవాదులు, మేధావులు స్పందించాలని, ప్రజలు నిరసన తెలపాలని వారు కోరారు.

కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రజలు ఒకరి ప్రోద్బలంపై ఇటువంటి విషయాలపై ప్రత్యేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపరు. అప్పుడూ, ఇప్పుడూ అన్నీ గమనించారు, గమనిస్తారు మరియు ఆలోచిస్తారు. తగిన సమయంలో వారు తమ 'ఓటు' హక్కునుపయోగించి తీర్పునిస్తారు.         

0/Post a Comment/Comments

Previous Post Next Post