గత ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ నుండి ఏకంగా 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు వారి ప్రభుత్వానికి వచ్చిన, రాబోతున్న ముప్పు ఏమీ లేదు. టిఆర్ఎస్‌కు అదనంగా ఒక్క ఎమ్మెల్యే కూడా అవసరం లేనప్పుడు ఇలా ఫిరాయింపులను, పార్టీల విలీనాన్ని ప్రోత్సహించడం ఒక పట్టాన అర్థం చేసుకోవడం కష్టం. కేవలం ప్రతిపక్షం లేకుండా చేయడానికి, లేదా కాంగ్రెస్ పార్టీ పట్ల కక్ష సాధించడానికి ఇలా చేస్తున్నట్లుగా భావించవచ్చు.
ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలో చేరడాన్ని గాని, అవతలి పార్టీని విలీనం చేసుకోవడాన్ని గాని ప్రజలు హర్షించరు. అసలు ప్రశ్నించే వారు లేకుండా చేయాలనుకోవడం ఏకపక్ష, అహంకార ధోరణులను సూచిస్తుంది.
ఏం జరిగింది?
తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ అనేదే లేకుండా పోయింది. గురువారం మధ్యాహ్నం ఆ పార్టీకి చెందిన పన్నెండు మంది సభ్యులు స్పీకర్‌ను కలిసి తాము కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతామని వినతి పత్రాన్ని సమర్పించారు. సాయంత్రం ఆయన దానిని ఆమోదించి విలీన ఉత్తర్వులు జారీ చేసారు.
విలీనం ఎలా సాధ్యమైంది?
గత శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి 19 మంది సభ్యులు ఎన్నికయ్యారు. పదవ షెడ్యూలు నిబంధన ప్రకారం సభలో, ఒక పార్టీ మరోదానిలో విలీనం కావడానికి 2/3వ వంతు మంది సభ్యుల అంగీకారం కావాలి.
ఇప్పటికే కాంగ్రెస్ నుండి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో 11 మంది పార్టీ ఫిరాయించారు. 2/3 వంతు కోసం మరో ఇద్దరి సభ్యుల అంగీకారం కావలసి వచ్చింది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లోక్ సభ సభ్యునిగా ఎన్నిక కావడంతో శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. దానితో ఆ పార్టీ బలం 18కు పడిపోయి విలీనానికి కేవలం మరొక సభ్యుని అవసరం మాత్రమే వచ్చింది. టిఆర్ఎస్ పార్టీ వెంటనే తాండూరు సభ్యుడు రోహిత్ రెడ్డిని ఆకర్షించి విలీన లాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ పన్నెండు మంది శాసనసభ్యులు స్పీకర్‌ను కలవడానికి ముందు కెటిఆర్‌తో సమావేశమై, సమాలోచనలు జరిపారు.
స్పీకర్ అధికారాలను ఎలా దుర్వినియోగం చేసారు?
విలీనం అయిన పన్నెండు మంది శాసన సభ్యులు ఒక్కసారిగా వచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరలేదు. వారిని విడతలు, విడతలుగా ఆకర్షించడం/ప్రలోభపెట్టడం జరిగింది. తమ పార్టీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ శాసన సభా పక్షం ఎన్నోసార్లు స్పీకర్‌ను కోరడం, వారిపై ఫిర్యాదులు సమర్పించడం జరిగింది.
స్పీకర్ విచక్షణ పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదులను పట్టించుకోలేదు. వాటి ప్రకారం చర్య తీసుకుంటే ఆ శాసన సభ్యులందరినీ అనర్హులుగా ప్రకటించాలి. ఒకసారి ఫిరాయింపు దారుల సంఖ్య 2/3వ వంతుకు చేరగానే, వారు సమర్పించిన విలీన విజ్ఞప్తిని ఆగమేఘాల పైన ఆమోదించారు.
విలీనం చట్టబద్దమేనా?
విలీనంపై రాజ్యాంగ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్పీకర్ నిర్ణయాలను కోర్టు ప్రశ్నించజాలదని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు పార్టీతో సంబంధం లేకుండా శాసనసభా పక్ష విలీనం చెల్లదని అంటున్నారు. విలీనంపై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానానికి వెళ్లడంతో ఈ విషయం అక్కడే తేలనుంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడానికి గల కారణాలు
- ఎన్నికల ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఈ పదవీ కాలంలో అధికార పార్టీతో ఉంటే ఎంతో కొంత సంపాదించుకునే అవకాశం ఉండటం
- కేసులు, భూ సమస్యలు లాంటి వాటిలో ప్రభుత్వం నుండి సమస్య లేకుండా చూసుకోవడం
- మంత్రిపదవి, కాంట్రాక్టులు ఇతరత్రా ప్రయోజనాల కోసం ప్రలోభపడటం
- రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తమ సొంత ప్రయోజనాల కోసమే పాకులాడటం, ఇతర నాయకుల్ని, సభ్యులను ఏ మాత్రం ఖాతరు చేయకపోవడం
నామినేటెడ్ సభ్యులు, కాంగ్రెస్ నుండి విలీనం అయిన వారు, తెలుగు దేశం నుండి విలీనం కాబోతున్న సభ్యుడితో కలిపి శాసన సభలో టిఆర్ఎస్ పార్టీ బలం 104కు చేరనుంది.
టిఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- సబితారెడ్డి (మహేశ్వరం)
- జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి)
- రేగా కాంతారావు (పినపాక)
- కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు)
- హరిప్రియ (ఇల్లెందు)
- వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం)
- చిరుమర్తి లింగయ్య (నకిరేకల్)
- దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్)
- ఆత్రం సక్కు (ఆసిఫాబాద్)
- బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్)
- గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి)
- రోహిత్‌రెడ్డి (తాండూరు)
Post a Comment