కూటమిలో గందరగోళం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గత లోక్ సభ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పి), బహుజన్  సమాజ్‌వాదీ పార్టీ(బిఎస్పి) కలిసి పోటీ చేసాయి. విధానాలలో గాని, భావాలలో గాని అసలు సారూప్యత లేని ఈ పార్టీలు బిజెపిని ఓడించడమే లక్ష్యంగా కూటమి కట్టి, ఉమ్మడి బలంతో భారీ స్థాయిలో సీట్లు సాధిస్తామని అంచనా వేసాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. బిఎస్పి కేవలం 10 స్థానాలు సాధించగా, ఎస్పికి 5 సీట్లు మాత్రమే వచ్చాయి.          

ఫలితాలు నిరాశ పరచడంతో ఈ కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. ముందుగా బిఎస్పి అధినేత్రి మాయావతి ఈ విషయంపై ప్రకటన చేసారు. తమ పార్టీ కూటమి ధర్మాన్ని పాటించిందని, కాని ఎస్పికి చెందిన యాదవుల ఓట్లు తమకు రాలేదని ఆమె ఆరోపించారు. అయినా సొంత భార్యను గెలిపించుకోలేని వ్యక్తి కూటమిని ఏం గెలిపిస్తారని అఖిలేష్ యాదవ్‌ను ఎద్దేవా చేశారు. త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఉపఎన్నికలలో తమ పార్టీ సొంతంగా పోటీ చేయనుందని ప్రకటించారు. వాస్తవానికి కూటమి ఎస్పీ కన్నా బిఎస్పికే లాభించిందని ఎన్నికల ఫలితాల సందర్భంగా అనేకులు విశ్లేషించారు. 

ఈ వార్తలపై ఎస్పి అధినేత అఖిలేష్ యాదవ్‌ జాగ్రత్తగా స్పందించారు. కూటమి ఉన్నా లేకపోయినా మాయావతిపై తనకు ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదని పేర్కొన్నారు. కూటమిని ప్రయోగాత్మకంగా మొదలు పెట్టామని, అందులోని లోటుపాట్లు అర్థం చేసుకున్నామని అన్నారు. అంతే కాక, ఆయన ఓటమి అనంతరం తన తండ్రి, బాబాయిలతో కూడా ఉన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగా చర్యలు కూడా మొదలు పెట్టారు.

కేవలం 11 స్థానాలకు మాత్రమే ఉపఎన్నికలు జరుగుతున్నందున మరోసారి సొంతంగా బలం పరీక్షించుకునేందుకు, భవిష్యత్ ఎన్నికలలో మళ్ళీ కూటమి కడితే, బేరసారాల ద్వారా మరిన్ని ఎక్కువ స్థానాలు పొందేందుకే మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అంచనాలున్నాయి.    

0/Post a Comment/Comments

Previous Post Next Post