స్పీకర్ ఎన్నిక తరువాత అనవసర రభస

శాసన సభ ప్రారంభమైన మొదటిరోజు ప్రమాణస్వీకారాలతో హుందాగానే గడచిపోయింది. కాని రెండవ రోజే స్పీకర్ ఎన్నిక సందర్భంగా అనవసర చర్చలు, వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో ఇరుపక్షాలు దొందు దొందే అన్నట్లుగా వ్యవహరించాయి.        

సాధారణంగా సభకు కొత్త స్పీకర్ ఎన్నికవగానే, సభలో అన్ని పార్టీల అధ్యక్ష్యులు, స్వతంత్య్ర సభ్యులు అభినందించి, కూడా వెళ్లి ఆయనను సభాపతి స్థానంలో కూర్చుండబెడతారు. ఇదేమీ చట్టం కాదు, సాంప్రదాయం మాత్రమే. కాని, దీనిపై వైసిపి సభ్యులు
'చంద్రబాబు సభా సంప్రదాయాల్ని పాటించలేదు',
'ఆయన బిసి కాబట్టే వెంట నడవడానికి ఇష్టపడలేదు',
'ఇంతకు ముందు తనవద్ద మంత్రిగా పనిచేశాడనే ఇప్పుడు గౌరవం ఇవ్వట్లేదు',
'తాను రాకుండా బంట్రోతులను పంపించాడు' అంటూ
అనవసరమైన మాటలతో దురదృష్టకరమైన చర్చను లేవదీశారు. పదే, పదే ఆయనను బిసి అని ప్రస్తావించడం సీతారాం గారిని, ఆయన సామర్థ్యాన్ని కాకుండా కేవలం కులాన్ని మాత్రమే గౌరవించినట్లవుతుంది.   

చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రొటెం స్పీకర్ తమను పిలవలేదని, అంతేకాక అధికార పార్టీ వారు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి తమ పార్టీని సంప్రదించలేదని, తమను అడిగితే తాము కూడా ఆయనను ప్రతిపాదించి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసేవారమని, వెంట నడిచేవారమని అన్నారు. 

సాధారణంగా స్పీకర్ ఎన్నిక సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిని ఏకగ్రీవం విషయంలో అధికారపక్షం సంప్రదిస్తుంది. అలా సంప్రదించనప్పుడు తమ పార్టీ నుండి కూడా స్పీకర్ స్థానానికి పోటీని ఉంచాలి. కానీ గెలిచిన తరువాత ఆయన వెంట నడవను. అనడం ఎన్నో ఏళ్ల అనుభవం ఉండి మంత్రిగా, ముఖ్యమంత్రిగా మరియు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన వ్యక్తికి  తగదు. రెండు పక్షాలు స్పీకర్ స్థానానికి పోటీపడిన సందర్భాలలో కూడా అన్ని పక్షాల నాయకులు స్పీకర్‌కు గౌరవం ఇచ్చారు.  

ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన అప్పల నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మరియు ఇతర పార్టీ నాయకులు స్పీకర్‌ వెంట రావలసిందిగా కోరారు. అక్కడ ఉన్నదే మొత్తం మూడు పార్టీలు, పేరు పేరునా ముగ్గురిని పిలిచి ఉంటే బావుండేది. అయినా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా స్పీకర్ గారిని గౌరవించి, తరువాత సభలో ప్రస్తావిస్తే ఆయనకు హుందాగా ఉండేది.

0/Post a Comment/Comments

Previous Post Next Post