బిజెపిలోకి నలుగురు రాజ్యసభ సభ్యుల ఫిరాయింపు వెనక....

నలుగురు రాజ్యసభ సభ్యులు టిడిపి నుండి ఫిరాయించారు. సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేశ్, గరికపాటి మోహన రావులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని స్వయంగా కలిసి, తమ నలుగురిని ప్రత్యేక టీమ్‌గా భావించి రాజ్యసభలో బిజెపి అనుబంధ సభ్యులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. చేరడానికి ముందు ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌తో వీరు చర్చలు జరిపారు.

మరో రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని కూడా టిడిపిని వీడి బిజెపిలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. బిజెపి నేతలు తమ పార్టీలోకి ఆంధ్రప్రదేశ్ నుండి మరింత మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరనున్నారని  చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీకి ఎందుకీ పరిస్థితి వచ్చింది?     

ఈ మధ్యకాలంలో రాజకీయపార్టీలన్నీ కేవలం ఆర్థిక వెసులుబాటు కోసం, పారిశ్రామిక వేత్తలను, ఆర్థిక నేరాలు విచారణలో ఉన్నవారిని పార్టీలో చేర్చుకుని రాజ్యసభలో ఎంపీలుగా చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి తప్పే చేసింది. ఇలాంటి వారిని ఆకర్షించడం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి చాలా సులభం. తెలుగు దేశం పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నేపథ్యంలో, వారికి  బిజెపిలో చేరడంలోనే రాజకీయ, వ్యాపారపరమైన ప్రయోజనాలు కనిపించి ఉంటాయి.      

సుజనా చౌదరి గారు బిజెపితో సంబంధాలు తెంచుకోవడాన్ని వ్యతిరేకించినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఈ పారిశ్రామిక వేత్తలు విచారణను తప్పించుకోవడానికి, ఇతరత్రా ప్రయోజనాల కోసం, అప్పటినుండే బిజెపితో సన్నిహితంగా ఉన్నారు. 

ఎన్నికలకు ముందు వరకు చంద్రబాబు గారు బిజెపితో స్నేహంగా ఉండి, ప్యాకేజీకి ఒప్పుకుని, ప్రత్యేక హోదా వద్దని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తర్వాత తమను కేంద్ర ప్రభుత్వం మోసగించిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలలో బిజెపి పట్ల వ్యతిరేకభావం కలిగించడానికి ప్రయత్నించడం పట్ల, ఆ పార్టీ అధిష్టానం కోపంతో ఉంది. చంద్రబాబును దెబ్బకొట్టడమే లక్ష్యంగా  రాష్ట్రంలో బిజెపి మరిన్ని ఫిరాయింపులను ప్రోత్సహించే అవకాశం ఉంది.  

తదనంతర పరిణామాలు 

తీవ్రమైన ఆర్ధిక నేరాల విచారణను ఎదుర్కొంటున్న సుజనా చౌదరి, సిఎం రమేష్ వంటి వారిని చేర్చుకోవటం ద్వారా బిజెపి తప్పు చేస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. కాని, రాజ్యసభలో ఇప్పటికీ తమకు అవసరమైన మెజారిటీ లేనందువలన ఈ చేరికలకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.

వైసిపి ఆరోపణలు   

చంద్రబాబు సూచన మేరకే టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరుతున్నారని, అందుకే ఇదే సమయంలో యూరోప్ పర్యటన పెట్టుకున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రయ్య ఆరోపించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post