బిజెపి ఎమ్మెల్యే దూకుడు... పోలీసులతో రచ్చ రచ్చ

హైదరాబాద్‌లోని జుమ్మెరాత్ బజార్‌లోని స్థానికులు బుధవారం అర్థరాత్రి సమయంలో రాణి అవంతి భాయ్ విగ్రహ పునఃప్రతిష్టాపన చేసేందుకు ప్రయత్నించారు. అనుమతి లేకుండా 10 అడుగుల విగ్రహం స్థానంలో 25 అడుగుల విగ్రహం ఎలా పెడతారంటూ వారిని, పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ప్రజలు భారీగా గుమికూడడంతో, వారికి మద్ధతుగా ఎమ్మెల్యే రాజాసింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన రాకతో రెచ్చిపోయిన ప్రజలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు వీరిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రాజా సింగ్ గాయపడడంతో ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అనంతరం రాజాసింగ్ తలపై కట్టుతో ఉస్మానియా ఆసుపత్రి నుండి మాట్లాడుతూ పోలీసులు తనపై అక్రమంగా లాఠీచార్జీ చేశారని ఆరోపించారు. ఒక స్వాతంత్య్ర సమరయోధురాలి విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకోవడం అరాచకమని నిప్పులు చెరిగారు. ఆసుపత్రి విజువల్స్  మీడియాలో ప్రసారం కావడంతో, ఈ వ్యవహారంపై బిజెపి నేతలు ఘాటుగా స్పందించారు. 

రాజా సింగ్‌పై తాము ఎలాంటి దాడి చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. రాజా సింగే తనకు తాను రాయితో కొట్టుకున్నాడని, దీనికి సంబంధించి వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తాము, అసలు ఆ ప్రాంతంలో లాఠీచార్జి చేయలేదని, అలా చేస్తే కేవలం ఒక్కరికే గాయాలెలా అవుతాయని పోలీసులు అన్నారు. కాసేపటికి రాజా సింగ్ రాయితో కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, దానిని పోలీసులే విడుదల చేశారని బిజెపి నేతలు మండిపడ్డారు. 


ఈ ఘటన అనంతరం బిజెపి జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, గ్రేటర్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు రాజాసింగ్‌ ఇంటికి వెళ్లి పరామర్శించారు. సిఎం కెసిఆర్ స్వయంగా బిజెపి నేతలపై దాడులను ప్రోత్సహిస్తున్నారని, అందుకు నిరసనగా గోషామహల్‌ నియోజకవర్గంలో శుక్రవారం బంద్‌ పాటిస్తున్నామని ప్రకటించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post