నీతిఆయోగ్‌ సమావేశంలో ప్రత్యేక హోదా ప్రస్తావన

నీతి ఆయోగ్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఈ  అంశంపై మాట్లాడానికి ఆయన భారీగా సన్నద్ధమైనట్లు కనిపించింది. 

కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, అప్పటి కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక హోదాకోసం తీర్మానం చేసి, అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్లానింగ్‌ కమిషన్‌ను ఆదేశించిందని, ఆ హామీలకు గౌరవాన్ని ఇవ్వాలని జగన్ కోరారు. తరువాత ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంత అవసరమో వివరించి, ఆ హోదా రావడానికి అడ్డంకులుగా ప్రచారంలో ఉన్న వార్తలను కేవలం పుకార్లేనని స్పష్టం చేశారు. 

రాష్ట్రం ఏర్పాటు నాటికి ఆంధ్రప్రదేశ్‌కు 97 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. 2018–19కి ఆ అప్పులు 2,58,928 కోట్లకు చేరాయి. ఈ అప్పులపై ఏడాదికి 20 వేల కోట్ల వడ్డీ, మరో 20 వేల కోట్ల అసలు చెల్లించాల్సి వస్తోంది. విభజనలో రాజధానిని కోల్పోవడంతో రెవిన్యూను కోల్పోయాం. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేదు. ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. హోదా కూడా రాకపోవడంతో ప్రజలు నిరాశా, నిస్పృహలకు లోనవుతున్నారు.   

ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇచ్చేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. రాష్ట్రానికి  ప్రత్యేక హోదా సాధ్యం కాదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి హోదా ఇవ్వొద్దని ఎక్కడా సిఫార్సు చేయలేదంటూ 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్‌సేన్‌ రాసిన లేఖను ఈ సమావేశం ముందు ఉంచుతున్నాను. మాకు హోదాను ఇస్తే, ఇతర రాష్ట్రాలు కోరతాయని ప్రచారం చేస్తున్నారు. కాని పార్లమెంట్లో హామీ ఇచ్చిన రాష్ట్రం మాది ఒక్కటే. మా వినతిని సహృదయంతో సహకరిస్తారని విశ్వసిస్తున్నాము. 

0/Post a Comment/Comments

Previous Post Next Post