మనకు ప్రత్యేక హోదా ఇక అసాధ్యమేనా?

ప్రత్యేక హోదాపై కేంద్రప్రభుత్వం తమ వైఖరిని పునరుద్ఘాటించింది. ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ప్రకటన చేశారు. హోదా కోసం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఒడిషా, బీహార్ మరియు తెలంగాణ రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయని ఆవిడ వెల్లడించారు.    

బిజెపి గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేక హోదాపై స్పష్టమైన వైఖరినే అనుసరిస్తుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లపాటు ప్రత్యేక హోదాను కల్పిస్తామని ప్రకటించగా, బిజెపి ఐదేళ్లు సరిపోదని, పదేళ్ల పాటు హోదా కావాలని డిమాండ్ చేసింది. 2014 ఎన్నికల సమయంలో మోడీ గారితో సహా బిజెపి నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తామనే ఆశలు కల్పించారు. ఆ ఎన్నికలలో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం, ఈ అంశాన్ని నానుస్తూ, క్రమంగా తమ స్వరం మార్చారు. 2016 సమయానికి 14 ఫైనాన్స్ కమిషన్‌ను సాకుగా చూపుతూ, ప్రత్యేక హోదా సాధ్యం కాదని, ప్యాకేజీని అందిస్తామని తేల్చి చెప్పారు. దీనికి చంద్రబాబు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ఆమోదించింది. 

జగన్మోహన రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని ప్రకటించారు. అసెంబ్లీలో మళ్ళీ ప్రత్యేక హోదాపై తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించారు. ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రులను కలసిన ప్రతిసారి ప్రత్యేక హోదా గురించిన ప్రస్తావన తీసుకు వస్తామని ఆయన అన్నారు. కాని, కేంద్రంలో బిజెపికి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నందున తాము బతిమాలే ధోరణిని అవలంబిస్తామని ప్రకటించడం, ఆయన పూర్తిస్థాయి పోరాటానికి సిద్ధంగా లేరనే  విషయాన్ని స్పష్టం చేస్తుంది.                

ప్రత్యేక హోదాపై తెలంగాణ వైఖరి మరోలా ఉంది. ఆ రాష్ట్ర ఎన్నికల సమయంలో సోనియా గాంధి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇస్తే, టిఆర్ఎస్ నాయకులు విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో వినోద్ గారు, ఆంధ్రప్రదేశ్‌కు హోదాను సమర్ధిస్తాం కాని, తమకూ పారిశ్రామిక రాయితీలు కావాలని కోరతాం అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను సమర్థిస్తున్నాం అని స్పష్టంగా ప్రకటించినప్పటికీ, తాము కూడా ప్రత్యేక హోదా కోసం విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలియజేయలేదు. 

ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం మాట చెల్లుబాటయ్యే అవకాశం లేకపోవడం, అసెంబ్లీ తీర్మానాల పేరుతో రాష్ట్రమే తమ వైఖరిని రెండుసార్లు మార్చుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఒకవేళ  ప్రత్యేక హోదా రావాలంటే, తెలంగాణ రాష్ట్ర పోరాటం వలే సుదీర్ఘంగా పోరాడుతూ, కేంద్రంలో మన మాట చెల్లుబాటయేంత బలం వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.   

0/Post a Comment/Comments

Previous Post Next Post