జగన్ మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు చోటు దక్కినప్పటికీ, సినీ నటి, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు చోటు లేకపోవడంపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధినేతకు సన్నిహితురాలైన ఆమె, వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగానికి అధ్యక్ష్యురాలిగా ఉంటూ అనేక సందర్భాలలో టిడిపిపై దూకుడుగా వ్యవహరించారు. రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఆమెకు ఇంకా ఏదైనా ఇతర పదవిని ఇస్తారా? లేక రెండున్నర ఏళ్ల తరువాత మంత్రి పదవి లభిస్తుందా? అనేది వేచి చూడాలి.
రోజా గారికి మంత్రిపదవి రాకపోవడంపై వివిధ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
- రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా నుండి ఇప్పటికే ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి వస్తుందనే అందరూ భావించారు. ఆ జిల్లా నుండి రెండవ స్థానం రోజాకు గాని, భూమన కరుణాకర్‌రెడ్డికి గాని లభిస్తుందని అందరూ ఊహించగా, అది అనూహ్యంగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామికి దక్కింది. దానితో జిల్లా సమీకరణాలలో భాగంగా ఆమె అవకాశం కోల్పోయారనే వాదన వినిపిస్తుంది.
- జగన్ మంత్రివర్గంలో సామాజిక సమతుల్యతను పాటించాలనుకోవడం కూడా ఆమెకు వ్యతిరేకంగా పనిచేసినట్లుగా భావిస్తున్నారు. ఆ సమీకరణలలో భాగంగా ఆమెకు చోటు దక్కలేదనేది మరో వాదన.
- మూడవ వాదన ప్రకారం గత సంవత్సర కాలం నుండి జగన్ గారి వ్యవహార శైలిలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తుంది. ఆయన దూకుడుగా, ఆవేశంతో వ్యవహరించడం మానివేసి సున్నితంగా, ఓపికతో వ్యవహరిస్తున్నారు. తన ప్రభుత్వం మరియు మంత్రివర్గం కూడా ప్రజలతో అదే విధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించాలనే ఉద్ధేశ్యంలో ఆయన ఉన్నారు. అందుకే ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచి, దూకుడుగా వ్యవహరించే రోజాకు అందులో చోటు దక్కలేదు.
Post a Comment