కాళేశ్వరం..ఒక రాష్ట్రానికి సరిపోయేంత విద్యుత్... ఒక నదిని తలపించే ప్రవాహం

కాళేశ్వరం ప్రాజెక్టు - తెలంగాణ వర ప్రదాయినిగా పేరొందిన ఈ ప్రాజెక్టు, కొన్ని దశలలో రోజుకు మూడు టిఎంసిల నీటిని, దాదాపు 100 మీటర్ల ఎత్తు నుండి నుండి 600 మీటర్ల ఎత్తు వరకు తరలించనుంది. రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాలలో వ్యవసాయ, పారిశ్రామిక మరియు గృహ నీటి అవసరాలను ఈ ప్రాజెక్టు తీర్చనుంది. 

ఎంత విద్యుత్ అవసరం కానుంది?   

ఇన్ని దశలలో, ఇంత ఎత్తువరకు నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలో ఇదే  తొలిసారి. దీనికి అయ్యే విద్యుత్ వినియోగం కూడా అదే స్థాయిలో ఉండనుంది. ప్రస్తుతానికి రెండు టిఎంసిల నీటిని మిడ్ మానేరు వరకు తరలించనున్నారు. దీనికి ఈ ఏడాది 3800 మెగావాట్ల విద్యుత్ అవసరమని భావిస్తున్నారు. భవిష్యత్తులో ప్రాజెక్టు మొత్తం పూర్తయి, మూడు టిఎంసిల నీటిని పూర్తి స్థాయిలో తరలిస్తే 7152 మెగావాట్ల విద్యుత్‌ అవసరం కానుంది. దానిని మూడు నెలల పాటు, వరద కాలం మొత్తం నిరంతరాయంగా సరఫరా చేయవలసి ఉంటుంది. 

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరాసరి విద్యుత్ వినియోగం ఏడు వేల మెగావాట్ల వద్దే ఉంది. ఇక ఛత్తీస్ ఘడ్, కేరళ, ఒడిషా వంటి రాష్ట్రాల గరిష్ట విద్యుత్ వినియోగం నాలుగు వేల మెగావాట్లు మాత్రమే. అంటే ఏ స్థాయి విద్యుత్‌ను వినియోగంలోకి తేనున్నారో అర్థమవుతుంది. ఇంత విద్యుత్‌ను ఎలా సమీకరించనున్నారు? ఏటా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దాని భారం ఎంత? లాంటి విషయాలపై స్పష్టత రావడానికి ఒకటి, రెండేళ్ల సమయం పట్టనుంది.

విద్యుత్ భారాన్ని ఎవరు భరించనున్నారు?

ఏటా ఐదు నుండి ఆరు వేల కోట్ల రూపాయల వరకు అయ్యే ఈ విద్యుత్‌ భారం గురించి, కెసిఆర్ గారిని ప్రశ్నించగా, నీటి సరఫరా ఇబ్బందులు ఉండకపోనుండడంతో రాష్ట్రం అన్ని రంగాలలో మరింతగా అభివృద్ధి చెందనుందని, ఇప్పటికే 2 లక్షల కోట్లకు చేరిన రాష్ట్ర బడ్జెట్ ఐదేళ్ళలో రెట్టింపు అవనుందని, అప్పుడు ఈ భారం పెద్దగా లెక్కలోకి రాదని అనడమే కాక, రాష్ట్ర ప్రభుత్వమే ఈ భారాన్ని భరించనుందని స్పష్టం చేశారు.

నీటిప్రవాహం ఎలా ఉండనుంది? 

రోజుకు మూడు టిఎంసిల నీటిని తరలించడం అంటే అది 33 వేల క్యూసెక్కుల ప్రవాహం. ఈ ప్రవాహం ఒక నదిని తలపించనుంది. ఇక్కడ నీటి లభ్యత 70 నుండి 110 రోజులపాటు ఉండనుంది. మనం నదిని తలపించే పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే దాని గరిష్ఠ నీటి సామర్థ్యం 44 వేల క్యూసెక్కులు అంటే రోజుకు నాలుగు టిఎంసిల నీటిని తరలించవచ్చు. కాని, నీటి లభ్యత దృష్ట్యా అక్కడ ఏడాదికి 5 రోజుల పాటు నీటిని తరలించడం కూడా గగనమే.   

మేడిగడ్డ వద్దే ఎందుకు?
  • తుమ్మడిహెట్టి వద్ద ముంపు ప్రాంతం ఎక్కువగా ఉండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించలేదు.  
  • ప్రాజెక్టును 180  టిఎంసిల నీటిని వినియోగించడానికి రూపొందించినట్లు చెబుతున్నా, వాస్తవ వినియోగం అంతకన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మేడిగడ్డ వద్ద 70 నుండి 110 రోజుల వరకు నీటి లభ్యత ఉండే అవకాశం ఉంది. రోజుకు మూడు టిఎంసిల చొప్పున తరలిస్తే అంతకన్నా ఎక్కువ నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. తుమ్మడిహెట్టి వద్ద ఈ స్థాయి నీటి లభ్యత లేదు.

0/Post a Comment/Comments

Previous Post Next Post