నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో, ప్రస్తుతం ప్రభుత్వ భవనాలు పరిమితంగా ఉన్నాయి. కలెక్టర్ల సమావేశాన్ని సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావించి ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, అక్కడ చాలినంత స్థలం లేదని అధికారులు నివేదించడంతో, చంద్రబాబు ఇది వరకు కలెక్టర్ల సమావేశానికి వినియోగించిన ప్రజావేదికలో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం రోజు ప్రజావేదిక వద్దకు వెళ్లిన సిఆర్‌డిఎ అధికారులు దాన్ని ఖాళీ చేయాలని టిడిపి నేతలకు చెప్పారు. అయితే, వారు తమకు నోటీసులు ఇవ్వకుండా ఖాళీ చేసే ప్రసక్తే లేదని అధికారులకు చెప్పి, తిప్పిపంపారు. దానితో గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, జేసీ హిమాంశు శుక్లా, పోలీసు అధికారులు బలగంతో భవనం వద్దకు చేరుకొని కలెక్టర్ల సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు.
ఈ క్రమంలో ప్రజావేదిక ఆవరణలో ఉన్న టిడిపి సామగ్రిని, చంద్రబాబు వ్యక్తిగత సామాగ్రిని అధికారులు బయటపడేశారని టిడిపి నేతలు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు గారిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే, ఆయనను అవమానించేలా ప్రజావేదికను స్వాధీనం చేసుకున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ప్రజా వేదికను స్వాధీనం చేసుకోవడం సరికాదని, బాబూ రాజేంద్రప్రసాద్ మరికొందరు నేతలు ధర్నాకు దిగారు. అయితే, టిడిపి సామాన్లు ఏవీ ప్రజా వేదికలో లేవని, చంద్రబాబు సామాన్లను తాము బయట పడేయలేదని ఆర్డీవో వీరబ్రహ్మం తెలియజేసారు.
ప్రజావేదికను ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న నివాసం పక్కనే, పరిపాలన అవసరాల కోసం అప్పటి ప్రభుత్వం నిర్మించింది. దీనిని ఆయన ప్రభుత్వ అవసరాల కోసం, పార్టీ కార్యక్రమాల కోసం కూడా వినియోగించుకునేవారు. ఎన్నికలలో ఓటమి అనంతరం, చంద్రబాబు గారు ఈ ప్రజావేదికను తన వ్యక్తిగత అవసరాలకు కేటాయించమని ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. దానికి ప్రభుత్వం స్పందించలేదు.
అసలు నివాస భవనమే, అక్రమ నిర్మాణం అయినప్పుడు, దానికి పక్కనే ప్రభుత్వ పరిపాలన భవనాన్ని నిర్మించడం, దానిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవాలనుకోవడం సరికాదు. అయినా టిడిపి నేతలు అధికారం కోల్పోయాక, వారికి ఆందోళనలు చేయడానికి ప్రజా సమస్యలు ఏవీ కనిపించడం లేదా? 'చంద్రబాబు గారిని అవమానిస్తున్నారు', 'విమానాశ్రయాల్లో తనిఖీ చేస్తున్నారు', 'ఆయన సమావేశాలకు ఉపయోగించుకునే, ప్రభుత్వ భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు'. అంటూ చంద్రబాబు గారి సౌకర్యాల కోసం మాత్రమే ఆందోళనలు చేయడం వారిని ప్రజలలో మరింత చులకన చేస్తుంది.
Post a Comment