ప్రజావేదిక నిర్మాణ వ్యయం రికవరి?

ఉండవల్లిలో చంద్రబాబు నాయుడి గారి నివాసం పక్కన ఉన్న ప్రజావేదిక కూల్చివేత పనులు ప్రారంభమైన నేపథ్యంలో, సామాజిక కార్యకర్త  పోలూరి శ్రీనివాసరావు గారు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈయన పిటిషన్‌లో ప్రధానంగా రెండు అంశాలున్నాయి. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు వెంటనే నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలి. మరియు అక్రమ భవనాన్ని నిర్మించి ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారి నుండి రికవరి చేపట్టాలని ఆయన కోరారు.

ఈ అత్యవసర ప్రజాహితవ్యాజ్యంపై విచారణ, ఇవాళ ఉదయం 2.30 దాటిన తర్వాత కూడా కొనసాగింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సీతారామమూర్తి, జస్టిస్‌ శ్యాంప్రసాద్‌లు ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి హాజరయ్యారు. ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు నిలిపివేయాలనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కాగా, పిటిషన్‌లో పేర్కొన్న మరో అంశం ప్రజావేదిక ఖర్చును తిరిగి రాబట్టాలన్న దానిపై విచారణ కొనసాగిస్తామని పేర్కొంటూ, రెండు వారాలపాటు కేసును వాయిదా వేసింది.  

ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదిస్తూ, పర్యావరణాన్ని భంగపరిచేలా ఏమైనా నిర్మాణాలు ఉంటే వాటిని కూల్చే బాధ్యత కోర్టులకు కూడా ఉందన్నారు. అక్రమ నిర్మాణం తొలగించడమే కాదు, దాన్ని ఆ భవనానికి అయిన ఖర్చును రికవరీ చేయడం కూడా ప్రభుత్వ  బాధ్యత అని, ఈ విషయంలో పిటిషనర్‌తో ఏకీభవిస్తున్నామని అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post