నీరు చెట్టు బకాయిలు నిలిపివేత

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చిన పథకాలలో నీరు-చెట్టు ఒకటి. ఈ పథకంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి జగన్, ఈ నెల 6వ తేదీన న జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో బకాయిల చెల్లింపులను నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 

2015-16లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన ఈ పథకం చిన్న నీటివనరుల పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణ కోసం ఉద్దేశింపబడినది.  చెరువుల్లో పూడికతీత, చెరువు కట్టల, తూముల మరమ్మతులు, చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం, నిర్వహణ, మరియు చెట్లు నాటడం లాంటి పనులను దీనికింద చేపట్టేవారు. 

నిబంధనలను అతిక్రమించి నీరు-చెట్టులో అన్ని పనులను తెలుగు దేశం నాయకులకు నామినేషన్లపై కట్టబెట్టారని, చాలా చోట్ల పూడికతీత, ఇతర పనులను పూర్తి చేయకుండానే బిల్లులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.   

"ఇప్పటివరకు ఈ పథకంలో భాగంగా 18,060.70 కోట్ల రూపాయల పనులు మంజూరయ్యాయి. వాటిలో 16,843.86 కోట్ల రూపాయలను చెల్లించగా 1,216.84 కోట్లు బకాయిలుగా ఉన్నాయి. కాగా, ఇదే 18వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తయ్యేదని అధికారులు కూడా వ్యాఖ్యానించారు." అనే వార్తను విడుదల చేసారు.

ఈ పథకంలో ప్రధానంగా ఉపాధి హామీ, జలవనరులు, అటవీ శాఖల నిధులను వినియోగించారు. వీటిలో ఉపాధి హామీవి పూర్తిగా కేంద్ర నిధులే. అటవీ శాఖ నిధులు కూడా కేంద్రం వద్ద ఉన్న రాష్ట్రంలో అడవులు పెంచడానికి ఉద్దేశించిన నిధులు. వీటిని రాష్ట్రవ్యాప్తంగా వినియోగించాలి గాని, ఒక నీటి పారుదల ప్రాజెక్టుకు వినియోగించలేము. పథకంలో అవినీతి నిజం కావచ్చు కాని, పోలవరం పూర్తయ్యేది అనేది మాత్రం అతిశయోక్తిలాగే అనిపిస్తుంది.           

0/Post a Comment/Comments

Previous Post Next Post