ఇంకెన్నాళ్లీ పేర్ల రాజకీయం

అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు సంక్షేమ పథకాల నుండి రాజకీయ లబ్దిని పొందాలనుకుంటాయి. అందుకే వాటికి తమ పార్టీకి సంబంధించిన వారి పేరు పెట్టడానికి ప్రయత్నిస్తాయి. దీనికోసం అప్పటివరకు అమలులో ఉన్నపేర్లను కూడా మారుస్తాయి. 

రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారంలోకి  రావడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పథకాలకు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గార్ల పేర్లను తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం మొదలు పెట్టారు. దీనిలో భాగంగా 
మధ్యాహ్న భోజన పథకం పేరును వైఎస్ఆర్ అక్షయ పాత్రగా,  
ఎన్టీఆర్ భరోసా పథకం పేరును వైఎస్ఆర్ పెన్షన్‌గా, 
ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా, 
కార్పొరేషన్ రుణాలను కూడా వైఎస్ఆర్ చేయూతగా, 
చంద్రన్న రైతు నేస్తాన్ని వైఎస్ఆర్ రైతు భరోసాగా....  
ఇంకా పోలవరం ప్రాజెక్టుకు,... అన్న క్యాంటీన్లకు.... ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో పథకాలు పేరు మార్చుకోనున్నాయి.  

ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేరు మార్పు జరగడానికి ప్రజలు అలవాటుపడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని పథకాలకు రాజీవ్, ఇందిర పేర్లు ఉండేవి. తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన తరువాత అవి పోయి ఎన్టీఆర్, అన్న, చంద్రన్నపేర్లు వచ్చాయి. ప్రస్తుతం అన్ని పథకాలకు వైఎస్ఆర్ పేరు రానుంది.  కొన్నాళ్ల తరువాత వేరే రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే, మళ్ళీ వైఎస్ఆర్ పేరును తీసేస్తారు. అది ఆయన పేరుకు గౌరవమా? అని ఇప్పుడు పేరు మార్చే ముందే ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి.  

రాజకీయ పార్టీలకు సంబంధం లేని ప్రముఖుల పేర్లుగాని, ఆ ప్రాంతానికి సంబంధించిన పేరుగాని, సంస్కృతికి, సాహిత్యానికి, చరిత్రకు సంబంధించిన పేర్లుగాని పెడితే తరువాత వచ్చే వారు కూడా మార్చడానికి ఇంతగా తాపత్రయపడరు. ఈ అనవసర ఖర్చులు, జంఝాటాలు ఉండవు.  

వీరందరిలో స్వయంగా తన పేరునే పథకాలకు పెట్టుకున్నది మాత్రం చంద్రబాబు ఒక్కరే. ఆయన అధికారం కోల్పోయారు కనక వీటిని ఎలాగూ మార్చక తప్పదు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి ఈ విధమైన ఇబ్బంది లేదు. ఆయన చాలావరకు పథకాలకు, ప్రాజెక్టులకు స్థలాల పేర్లు,   పుణ్యక్షేత్రాల పేర్లు, ఒకటి రెండు చోట్ల జయశంకర్ గారి పేరు పెట్టారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post