సంఘటితమవుతున్న హిందూ ఓటు బ్యాంకు

దురదృష్టవశాత్తు గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో మత ప్రాతిపదికన ఓట్లు అడగడం, ఓటు వేయడం పెరుగుతుంది. ఇది మొదట ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో, ఆ ఓట్లన్నీ ఓటు బ్యాంకుగా రూపొందటంతో ప్రారంభమైంది. దానితో లౌకిక వాదులుగా చెప్పుకునే రాజకీయ పార్టీలన్నీ, ఆ వర్గాన్ని బుజ్జగించడానికి (Appeasement) ప్రయత్నాలు చేసాయి. హిందువులే ప్రధానంగా పోటీదారులు కావడం వలననో లేక హిందూ సమాజం వివిధ కులాలు, వర్గాలుగా చీలి ఉండటం వలననో హిందూ ఓటు బ్యాంకు మొదట నుండి సంఘటితమై లేదు.

ఈ తరహా ఓటుబ్యాంకు రాజకీయాలు మనదేశంలో అన్ని ప్రాంతాలలో కనిపిస్తాయి. తరతరాలుగా హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీ మత ప్రాతిపదికనే గెలుస్తూ వస్తుంది. దీనిని కాంగ్రెస్ తో సహా అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి మరియు లాభపడే ప్రయత్నం చేసాయి. కెసిఆర్ కూడా ముస్లిం ఓట్ల కోసమే ఒవైసి సోదరులతో అవసరమైన దానికన్నా ఎక్కువ సాన్నిహిత్యాన్ని నెరపుతున్నాడు.

బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూడా ముస్లిం మరియు యాదవుల ఓట్ల ఆధారంగా రాజకీయాలు జరిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాయావతి గారు దళిత మరియు ముస్లిం ఓట్లపై ఆధార పడి రాజకీయాలు చేస్తుండగా, సమాజ్ వాదీ పార్టీ యాదవ మరియు ముస్లిం ఓట్లపై ఆధారపడింది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ముస్లిం, ఇతర మైనారిటీ వర్గాల ఓట్లను తనవిగా భావిస్తుంది. 

రాను రాను ఈ ముస్లింలను బుజ్జగించే ధోరణి (Appeasement Politics) ఏ స్థాయికి చేరిందంటే దేశంలో 13% ఉన్న ముస్లిం ఓట్ల కోసం, 80% కన్నా ఎక్కువ జనాభా ఉన్న హిందువులను నిర్లక్ష్యం చేయడానికి, వారికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా కొన్ని పార్టీలు వెనుకాడలేదు. విచ్చలవిడిగా మైనారిటీ మత సంస్థలను వెనకేసుకు రావడం, మత మార్పిడులను ప్రోత్సహించడం, వారికి అనుకూలమైన చట్టాలు చేయడం వంటివి చేసారు. ఇటువంటి రాజకీయ విధానాల వలన మెజారిటీగా ఉన్న హిందువులలో తాము వివక్షకు గురి అవుతున్నామన్న భావన వచ్చింది. లౌకిక వాదులమని చెప్పుకునే రాజకీయ పార్టీలపై అసంతృప్తి, అసహనంపెరిగిపోయాయి.   

మెజారిటీ హిందూ వర్గంలో నెలకొని ఉన్న ఈ అసంతృప్తి ఆధారంగా వారిని ఏకీకృతం చేసి ఓటుబ్యాంకుగా మార్చుకోవడానికి బిజెపి ప్రయత్నాలు రామజన్మభూమి వివాదంతో మొదలయ్యాయి. మొదట ఇది అగ్రవర్ణాలకు, హిందీ మాట్లాడే రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన పార్టీగా ముద్ర పడినప్పటికీ, మోడీ వచ్చిన తరువాత హిందువులలో దాదాపు అన్ని వర్గాలను ఆకర్షించగలిగింది. ఈ పార్టీ ప్రచార వ్యూహాలు, సోషల్ మీడియా ఇంజనీరింగ్ మిగిలిన ఏ పార్టీ కూడా అందుకోలేని స్థాయిలో ఉండటంతో క్రమ క్రమంగా తమ భావజాలాన్ని దేశమంతటా విస్తరించగలిగింది. ఈ పార్టీ విస్తరణకు తమను తాము లౌకిక వాదులుగా చెప్పుకునే పార్టీలే తమ విధానాలతో, మాటలతో దోహదం చేసాయి.  

కాంగ్రెస్ మరియు లౌకిక వాదులుగా చెప్పుకునే ఇతర పార్టీలు మైనారిటీ వర్గాలకు చెందిన పార్టీలతో కలిసి పనిచేస్తాయి. కానీ హిందూత్వ పార్టీలుగా పేరు పొందిన వాటిని మాత్రం దగ్గరకు రానివ్వవు. సెక్యులరిజంఅంటే మైనారిటీలను బుజ్జగించటం కాదు. అన్ని మతాలను సమానంగా చూడటం అని వాటికి తెలిసి వచ్చేవరకూ ఈ పార్టీ విస్తరణ కొనసాగుతూనే ఉంటుంది.    

'హిందుత్వ' మరియు 'హిందువులు' అనే పదాలు దేశంలో మెజారిటీ ప్రజల మతానికి, మనోభావాలకు సంబంధించినవి. ఇది తెలియకుండా రాజకీయ పార్టీలు హిందూ పదాన్ని ఇష్టం వచ్చినట్లు వాడితే మెజారిటీ హిందువుల ఆగ్రహానికి గురికాక తప్పదు. విహెచ్‌పిని గానీ ఇతర సంఘ్ సంస్థలను గానీ ఏమైనా అనాలనుకుంటే ఆ సంస్థల పేరుతో వ్యాఖ్యానించాలి. కానీ 'హిందూ' పదాన్ని వాడకూడదు.  

ఈ జాగ్రత్త తీసుకోనందువలనే హిందూ ధర్మాన్ని, ఆధ్యాత్మిక భావనలను మోడీ గారి కన్నా ఎక్కువ నిష్ఠగా ఆచరించే కెసిఆర్ గారు, కరీంనగర్ సభలో 'సంఘ్ పరివార్' సంస్థల గురించి మాట్లాడే సందర్భంలో, ఒక్క పదం నోరుజారినందుకు హిందూ వ్యతిరేకి అనే  ముద్ర వేయించుకోవలసి వచ్చింది. మొత్తం వ్యాక్యాన్ని, సందర్భాన్ని వదిలివేసి హిందువులు-బొందువులు అనే రెండు పదాలనే బిజెపి వారు తమ ఉత్తర తెలంగాణ ప్రచారంలో అద్భుతంగా ఉపయోగించుకోగలిగారు. కెసిఆర్ గారికి కంచుకోటగా పేరుపడ్డ ఉత్తర తెలంగాణలోనే ఎంపీ స్థానాలను కొల్లగొట్టగలిగారు.   

హిందూ మతసంస్థలు ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించకున్నా, కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకంగా హిందూ తీవ్రవాదం అనే పదాన్ని సృష్టించి దేశంలో మెజారిటీ వర్గాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేసారు. కానీ, వీరికి ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలపై వ్యాఖ్యలు చేసే దమ్ము ఉండదు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు  “ఈ దేశ వనరుల మీద ముస్లింలకే మొదటి హక్కు ఉండాలి” అనడం వారికి హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులనే విషయాన్ని ఎత్తి చూపుతుంది.  

మమతా బెనర్జీ గారు కూడా దుర్గాష్టమి ర్యాలీలకు అనుమతించకుండా, ముస్లింల మొహర్రం ర్యాలీలకు మాత్రమే అనుమతించడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీసారు. అంతేకాకుండా తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి అక్రమ వలసలను ప్రోత్సహించడం లాంటివి చేయడంతో ప్రజలలో పెరిగిన అసంతృప్తి పశ్చిమ బంగలో బిజెపి బలపడటానికి కారణమైంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అక్రమ వలసలపై కఠినంగా వ్యవరించగలరనే భావనతోనే  ప్రజలు బిజెపికి పట్టంకట్టారు.

రామాయణ, మహా భారతాలు హింసాత్మకమైనవి, హిందూ మతం హింసతో కూడుకొన్నది అంటూ ఎన్నికలకు ముందు సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్యలను ఏ ఒక్క లౌకిక పార్టీ ఖండించలేదు. ఈ తరహా మాటలే బిజెపి బలపడటానికి కారణమవుతాయి. చివరకు ఇప్పుడిప్పుడే రాజకీయాలలో అడుగుపెడుతున్న ప్రకాష్ రాజ్, కమల్ హాసన్ లాంటి సినీ నటులు కూడా ఎన్నికలలో హిందూ వ్యతిరేక పంథానే అనుసరించారు. బిజెపి నాయకులు ఎన్నికలలో  'జై శ్రీరామ్' అంటూ చేసే వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే వారు, ముస్లిం నాయకులు 'అల్లా'  అంటూ చేసే వ్యాఖ్యలపై స్పందించరు. శబరిమలపై మాట్లాడేవారు, బురఖాలపై, మసీదులలో మహిళలకు ప్రవేశంపై మాట్లాడరు.  

ఇలా మతపరమైన ఓట్లు ఏకీకృతం కావడం వలన అభివృద్ధి మరియు ఇతర ముఖ్యమైన అంశాలకు ఎన్నికలలో తగినంత ప్రాధాన్యం లభించదు. మెజారిటీ ఓట్లు సంఘటితం కావడం వలన పార్లమెంట్లో మైనారిటీల ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. అక్కడ ఈ సారి ముస్లిం ప్రాతినిధ్యం ఎన్నడూ లేని స్థాయికి తగ్గిపోయింది. ఇన్నాళ్లుగా కేవలం తమ వర్గానికే ఓట్లు వేసుకోవడం వలన లౌకిక వాదులుగా చెప్పుకునే పార్టీలు, కొంతమంది ముస్లిం నేతలే బాగు పడ్డారు కానీ, పేద ముస్లింలకు కూడా ఒరిగిందేమీ లేదు. కాబట్టి మైనారిటీలు, ఇతర పార్టీలు ఈ బుజ్జగింపు రాజకీయాలకు చెక్ పెడితేనే  ఎన్నికలలో మతపరమైన ప్రాధాన్యతలు తగ్గుతాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post