అంతా మీడియానే చేసిందా?

ఓట‌మి అనంతరం కూడా తెలుగు దేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబునాయుడు గారు, వాస్త‌వాలు గుర్తించ‌డానికి ఇష్టపడడం లేదు. 'ఎంతో అభివృద్ధి చేసినా, మ‌న‌కు ఎందుకీ ప‌రిస్థితి' అంటూ తమమీద తామే సానుభూతిని కురిపించుకుంటున్నారు తప్ప, తమను న‌మ్మి అధికారం ఇచ్చిన ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని, వ‌మ్ము చేశామ‌నే విష‌యాన్ని గుర్తించ‌టానికి సిద్ధంగా లేరు. తమ వైఫల్యాలను గుర్తించకుండా, ఓటమి కారణాలను ఈవీఎంల పైకి, మరొకరి పైకి నెట్టాలని చూస్తూ 'ఆత్మవిమర్శ'కు బదులు 'ఆత్మవంచన' చేసుకుంటున్నారు. 

ఋణమాఫీ అమలులో, రాజధాని నిర్మాణంలో వైఫల్యాలు, పార్టీ నేతల అరాచకాలు, విచ్చలవిడి అవినీతి కళ్లెదుట కనిపిస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఈదఫా ఓటమికి అసలు కారణాలే తెలియట్లేదట. 

ఏ తప్పుల వల్ల వారు ఓట‌మి చెందారో, కారణాలు వెతికేప‌నిలోనూ మళ్ళీ అవే త‌ప్పులు చేస్తున్నారు. అస‌లు ఎదుటి వారి మాటలు విన‌టానికి సిద్ధ‌ప‌డ‌క‌పోవ‌టం, నిజాలు చెప్పిన వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం, తమకే అన్నీ తెలుసనుకోవడం చంద్రబాబు గారిని ఈ స్థితికి దిగజార్చాయి. పరిపాలనాకాలంలో తమ భజనపరుల మాటలను మాత్రమే వినడం, తమను మోసే పత్రికల వార్తలను మాత్రమే నమ్మడం ఆయన ఓటమికి కారణమయ్యాయి.  

వేలాది మందితో  టెలి కాన్ఫరెన్సులు, గంటల తరబడి  రివ్యూలు నిర్వహించడంలో భాగంగా అందరినీ అదరించడం, బెదరించడం తప్ప ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకోగలిగారా? పరిపాలన ప్రజలకోసం కాకుండా, మీడియాలో వార్తల కోసం చేయడం ద్వారా అందరినీ విసుగెత్తించారు. ఇంకొకళ్ళు మనకి చెప్పేది ఏమిటి ? మనం సరిదిద్దుకునేది ఏమిటి ? మా అనుభవం ముందు వారి పరిజ్ఞానం ఎంత? లాంటి ధోరణులతో ఎవరు విమర్శించినా వారిని, దుమ్మెత్తిపోసేవారు. ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చే క్రమంలో భాగంగా ఆ పార్టీ అనుకూల మీడియా, ఈసారి ప్రజల అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వానికి చేరకుండా చేసింది.  

0/Post a Comment/Comments

Previous Post Next Post